Lucknow Vs Chennai: ‘స్పీడ్‌’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్‌’ ఎవరికి?

ఐపీఎల్ 17వ సీజన్‌లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్‌నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది.

Published : 19 Apr 2024 14:39 IST

ముంబయితో ఐదు రోజుల కిందట ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ మెరుపులు చూశాం. మరోసారి ఆ అవకాశం వస్తే బాగుండనేది సగటు అభిమాని ఆకాంక్ష. అందుకు తగ్గట్టుగానే ఇవాళ ఏకనా స్టేడియం వేదికగా చెన్నై - లఖ్‌నవూ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

బ్యాటింగ్‌లో వీరు కీలకం.. 

పేపర్‌ మీద చెన్నై బ్యాటింగ్ లైనప్‌తో పోలిస్తే లఖ్‌నవూదే కాస్త బలంగా కనిపిస్తోంది. మ్యాచ్‌లో మాత్రం తమ జట్టు బ్యాటర్లు తేలిపోవడంతో లఖ్‌నవూ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. డికాక్‌, కేఎల్ రాహుల్, నికోలస్‌ పూరన్, స్టాయినిస్‌, ఆయుష్‌ బదోని వంటి టాప్‌ బ్యాటర్లు ఆ జట్టు సొంతం. కానీ, వీరిలో నిలకడ లేకపోవడం ఇబ్బందిగా మారింది. గత రెండు మ్యాచుల్లో ఆ జట్టు కనీసం 180 పరుగులు కూడా చేయలేకపోవడం గమనార్హం. కేవలం ఒక్కరిద్దరు మాత్రమే రాణిస్తున్నారు. మొదట్లో దూకుడుగా ఆడిన పూరన్ తేలిపోతున్నాడు. 

మరోవైపు చెన్నై మాత్రం సమష్ఠిగా ఆడుతూ ప్రత్యర్థి ఎదుట భారీ స్కోరును లక్ష్యంగా ఉంచుతోంది. కెప్టెన్ రుతురాజ్‌ శుభారంభం అందిస్తే.. మిడిల్‌లో శివమ్‌ దూబె ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. ఇక చివర్లో ధోనీ భారీ సిక్స్‌లతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును ఉరుకులు పెట్టిస్తున్నాడు. ముంబయిపై కేవలం 4 బంతుల్లోనే 20 పరుగులు సాధించాడు. అందులో హ్యాట్రిక్‌ సిక్స్‌లూ ఉన్నాయి. అజింక్య రహానె, డారిల్ మిచెల్, రచిన్‌ రవీంద్ర కూడా కాస్త కుదురుకుంటే చెన్నైను ఆపడం ఎవరితరమూ కాదు.

పతిరనతో కష్టమే.. మయాంక్ వస్తాడా?

చెన్నై పేసర్ పతిరన గాయం నుంచి కోలుకుని వచ్చాక.. మరింత చెలరేగిపోతున్నాడు. దూకుడుగా ఆడే ముంబయిని కట్టడి చేయడమంటే సాహసమే అని చెప్పాలి. పతిరన మాత్రం కీలక సమయంలో వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బ కొట్టాడు. ‘ఇంపాక్ట్‌’ ప్లేయర్‌గా వచ్చి చెన్నైని గెలిపించాడు. ముస్తాఫిజుర్‌ ఉండటం చెన్నైకి అదనపు బలం. వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తాడు. తుషార్‌ దేశ్ పాండే, శార్దూల్ పరుగులు ఇవ్వడాన్ని నియంత్రించాలి. స్పిన్‌ భారం రవీంద్ర జడేజాదే. బెస్ట్ ఎకానమీతో (7.45) బంతులేస్తున్న జడ్డూ ఎక్కువ పరుగులు ఇవ్వకుండా బౌలింగ్‌ చేయడం అతడి స్పెషాలిటీ. 

ఐపీఎల్ 17వ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా మారిన లఖ్‌నవూ పేసర్ మయాంక్ యాదవ్‌కు గాయాల బెడద ఎక్కువైంది. గత మూడు మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. ఇవాళ చెన్నైతోనైనా ఆడతాడా? అనేది క్లారిటీ లేదు. ఆ జట్టు బౌలింగ్‌ కోచ్ కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్ననప్పటికీ.. పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధిస్తేనే ఆడిస్తామని చెప్పడంతో అభిమానుల్లో సందేహాలు ఎక్కువైపోయాయి. మెగా టోర్నీలో తొలిసారి ఆడుతున్న షమార్‌ జోసెఫ్‌ తేలిపోయాడు. తన మొదటి మ్యాచ్‌లో వికెట్ తీయకపోగా.. 4 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చాడు. ఇదే సీజన్‌లో ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన యశ్ ఠాకూర్‌ కూడా ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపించడం లేదు. రవి బిష్ణోయ్, కృనాల్, మోహ్‌సిన్‌ ఖాన్‌పైనే బౌలింగ్‌ భారం పడింది.

పిచ్‌ పరిస్థితి.. టాస్‌ నెగ్గితే ఏంటి?

ఐపీఎల్‌లో అలవోకగా 200+ స్కోర్లు నమోదవుతుంటే..  ఏకనా మైదానంలో జరిగిన గత మూడు మ్యాచుల్లోనూ ఈ మార్క్‌ దాటకపోవడం గమనార్హం. పంజాబ్‌పై లఖ్‌నవూ 199 పరుగులు చేసింది. ఇదే ఈ సీజన్‌లో అత్యధికం. పిచ్‌ పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకుల అంచనా. టాస్‌ నెగ్గే జట్టు తొలుత బ్యాటింగ్‌ చేయడానికి మొగ్గు చూపనుంది. ఇప్పటివరకు ఇరు జట్లూ కేవలం రెండు మ్యాచుల్లోనే తలపడ్డాయి. చెరొక విజయంతో సమంగా నిలిచాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే.. హ్యాట్రిక్‌ విక్టరీ అవుతుంది. అప్పుడు లఖ్‌నవూకు హ్యాట్రిక్‌ ఓటమి ఎదురవుతుంది. 

తుది జట్లు (అంచనా):

లఖ్‌నవూ: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), దీపక్ హుడా, ఆయుశ్‌ బదోని, మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, మోహ్‌సిన్ ఖాన్, షమార్‌ జోసెఫ్, యశ్ ఠాకూర్. ఇంపాక్ట్ ప్లేయర్: మయాంక్‌ యాదవ్/అర్షద్ ఖాన్

చెన్నై: రచిన్‌ రవీంద్ర, రుతురాజ్‌ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్య రహానె, మొయిన్ అలీ, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్ పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్. ఇంపాక్ట్‌ ప్లేయర్: పతిరన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని