Ashwin-Shakib: అప్పుడు అశ్విన్‌.. ఇప్పుడు షకిబ్‌.. వివాదాస్పద ఔట్‌లతో ప్రపంచ క్రికెట్లో ప్రకంపనలు

మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌ వివాదంలో షకిబ్‌ అల్‌హసన్‌ వ్యవహరించిన తీరు ఎంత వరకు సమంజసం అనే చర్చలోకి వెళ్లే ముందు.. నాలుగేళ్ల ముందు ఐపీఎల్‌లో జరిగిన ఒక సంచలన ఉదంతం గురించి మాట్లాడుకుందాం..

Published : 07 Nov 2023 15:46 IST

వన్డే ప్రపంచకప్‌లో సోమవారం శ్రీలంక, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ జరిగింది.. మామూలుగా చూస్తే ఈ మ్యాచ్‌కు అంతగా ప్రాధాన్యం లేదు. బంగ్లాదేశ్‌ ఎప్పుడో సెమీస్‌ రేసుకు దూరమైంది. శ్రీలంక సాంకేతికంగా మాత్రమే రేసులో ఉంది కానీ.. ఆ జట్టు కూడా నిష్క్రమించినట్లే. ఎవరికీ ఈ మ్యాచ్‌ మీద పెద్దగా ఆసక్తి లేదు. కానీ మ్యాచ్‌ మొదలైన రెండు గంటల తర్వాత.. క్రికెట్‌ ప్రపంచమంతా ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ ఉదంతం గురించి మాట్లాడుకుంది. అందుక్కారణం.. లంక సీనియర్‌ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌గా వెనుదిరగడం. అతడి అప్పీల్‌ కోసం అడిగి, దానికే కట్టుబడ్డ షకిబ్‌ పెద్ద విలన్‌ అయిపోయాడు. ఈ మ్యాచ్‌ వరకు షకిబ్‌ చేసింది తప్పే అయినా.. అతడి నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్లో ఓ మంచి మార్పునకు దోహదం చేస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌ వివాదంలో షకిబ్‌ అల్‌హసన్‌ వ్యవహరించిన తీరు ఎంత వరకు సమంజసం అనే చర్చలోకి వెళ్లే ముందు.. నాలుగేళ్ల ముందు ఐపీఎల్‌లో జరిగిన ఒక సంచలన ఉదంతం గురించి మాట్లాడుకుందాం. ఆ సీజన్లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించిన స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. రాజస్థాన్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌తో రనౌట్‌ చేశాడు. బౌలర్‌ బంతి వేస్తున్నపుడు నాన్‌స్ట్రైకర్‌ బంతి రిలీజ్‌ చేసే వరకు క్రీజులోనే ఉండాలి. అంతకంటే ముందే క్రీజును వదిలితే.. రనౌట్‌ చేయడం నిబంధనల ప్రకారం సరైందే. కానీ ఇలా ఔట్‌ చేయడాన్ని క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా చూసేవాళ్లు.

ఒకప్పుడు భారత ఆటగాడు వినూ మన్కడ్‌ ప్రత్యర్థి ఆటగాడిని ఇలా ఔట్‌ చేసినందుకే దానికి ‘మన్కడింగ్‌’ అన్న పేరు కూడా వచ్చింది. అయితే ఇలా ఔట్‌ చేయడాన్ని మహా పాపంలా చూసేవాళ్లు ఒకప్పుడు. కానీ అశ్విన్‌.. బట్లర్‌ను ఔట్‌ చేసినపుడు దీని మీద విస్తృత చర్చ జరిగింది. మళ్లీ మళ్లీ హెచ్చరించినా కూడా వినకుండా బట్లర్‌ అలా క్రీజును వదలడంతో అశ్విన్‌కు ఔట్‌ చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదు. ముందే క్రీజును వదిలి బ్యాటర్‌ అదనపు ప్రయోజనం పొందుతున్నపుడు.. ఇలా ఔట్‌ చేయడం క్రీడా స్ఫూర్తికి ఎలా విరుద్ధం అవుతుందనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఐసీసీ సైతం ఈ రనౌట్‌ పూర్తిగా నిబంధనలకు లోబడి చేసేదే అని, అందులో తప్పేమీ లేదని స్పష్టం చేసింది. ఆ సమయంలో దీని మీద జరిగిన విస్తృత చర్చ తర్వాత ఇందులో క్రీడా స్ఫూర్తి కోణం పక్కకు వెళ్లింది. అశ్విన్‌కు మద్దతు పెరిగింది. క్రమంగా బ్యాటర్లు ముందే క్రీజును వీడే అలవాటును తగ్గించుకున్నారు. అది ఒక రకంగా క్రికెట్‌కు మంచే చేసిందనే అభిప్రాయం ఏర్పడింది.

వర్తమానంలోకి వస్తే..

ఇప్పుడు మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌ కోసం అప్పీల్‌ చేసిన షకిబ్‌ను చాలామంది తప్పుబడుతున్నారు. నిజానికి షకిబ్‌ అన్యాయంగా వ్యవహరించాడనే చెప్పాలి. ఎందుకంటే మాథ్యూస్‌ క్రీజులోకి రావడంలోనే ఆలస్యం చేసి ఉంటే అతడిది తప్పే. కానీ వికెట్‌ పడ్డాక నిర్ణీత వ్యవధిలోనే (2 నిమిషాలు) అతను క్రీజులోకి వచ్చి బంతిని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. కానీ హెల్మెట్‌ పట్టీ ఊడిపోవడంతో అది గమనించి ఇంకో హెల్మెట్‌ అడిగి తెప్పించుకుని బ్యాటింగ్‌కు సిద్ధమయ్యాడు. ఈ విషయం వివరించే ప్రయత్నం చేసినా.. షకిబ్‌ ఒప్పుకోలేదు. అంపైర్లు కూడా షకిబ్‌కు సర్దిచెప్పాలని చూసినా ఫలితం లేకపోయింది. తాను నిబంధనల ప్రకారమే అప్పీల్‌ చేశానని అతనన్నాడు. అంపైర్లు కూడా నిబంధనల ప్రకారమే మాథ్యూస్‌ను ఔట్‌ చేశాడు. మొత్తం వ్యవహారంలో షకిబ్‌ దోషిగానే కనిపిస్తున్నాడు.

కానీ ఈ మ్యాచ్‌లో అతను అన్యాయంగా వ్యవహరించినట్లు అనిపించినా.. టైమ్డ్‌ ఔట్‌ విషయంలో బ్యాటర్లు మరీ తేలిగ్గా తీసుకుంటున్నారని.. చాలామంది నిర్ణీత వ్యవధి కన్నా ఎక్కువ సమయం తీసుకుంటున్నారని.. దీని వల్ల ఫీల్డింగ్‌ జట్లు ఇబ్బంది పడుతున్నాయని.. మ్యాచ్‌లో సమయం వృథా అవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల భారత్‌తో ప్రపంచకప్‌ మ్యాచ్‌లో రిజ్వాన్‌ సైతం ఎక్కువ సమయం వృథా చేయడంతో కోహ్లి గడియారం చూస్తున్నట్లుగా సంజ్ఞ చేసి అసహనం వ్యక్తం చేయడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మాథ్యూస్‌ ఉదంతం వల్ల టైమ్డ్‌ ఔట్‌ మీద పెద్ద చర్చ జరగడంతో ఇకపై బ్యాటర్లు జాగ్రత్త పడతారని.. నిర్ణీత వ్యవధిలో క్రీజులోకి చేరుకుని బ్యాటింగ్‌ ఆరంభిస్తారని.. ఇది ఒక రకంగా క్రికెట్‌కు మంచిదే అనే వాదన వినిపిస్తోంది.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు