ODI World Cup 2023: క్యాచ్‌ వదిలితే.. కప్పు చేజారినట్లే: క్రికెట్‌ చరిత్ర చెబుతోందిదే!

రానున్నది నాకౌట్‌ దశ.. ఇక్కడి నుంచి ప్రపంచకప్‌ కల కేవలం 200 ఓవర్ల (సెమీస్‌, ఫైనల్స్‌ కలిపి) దూరంలో ఉంది. ఇది సాకారం కావాలంటే ఫీల్డింగ్‌లో ఆపే ప్రతి పరుగు అమూల్యమైంది. క్యాచ్‌ల రూపంలో ప్రత్యర్థి బ్యాటర్ల నుంచి వచ్చే ప్రతి అవకాశం మనకు ప్రపంచకప్‌ను అంత దగ్గర చేస్తుంది. గతంలో క్యాచ్‌లు వదిలి ప్రపంచకప్‌ను కోల్పోయిన జట్లూ ఉన్నాయని టీమ్‌ ఇండియా గుర్తుంచుకోవాలి.  

Updated : 09 Nov 2023 19:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఒక క్యాచ్‌ కనురెప్పపాటులో చేజారినా.. ఆ తర్వాత సదరు బ్యాటర్‌ టోర్నీ రూపు రేఖలే మార్చేసే ప్రమాదం ఉంది. గతంలో ఇలా జరిగాయి.. దక్షిణాఫ్రికా ఏకంగా ‘ప్రపంచకప్‌ క్యాచ్‌’ను ఓ సారి వదిలేసింది. అంతదేనికి అఫ్గాన్‌ ఆటగాడు ముజీబ్‌ ఇటీవల క్యాచ్‌ వదిలేయడంతో మ్యాక్స్‌వెల్‌ ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాడు.

మరికొన్ని రోజుల్లో నాకౌట్‌ దశ మొదలు కానుంది. భారత్‌ కచ్చితంగా నాకౌట్‌ దశలోని రెండు మ్యాచ్‌ల్లో కలిపి 100 ఓవర్లు ఫీల్డింగ్‌ చేయాల్సి ఉంది. ఇక్కడ ఫీల్డర్లు చురుగ్గా లేకపోతే మాత్రం మనకు సమస్యలు తప్పవు. జడేజా, శ్రేయస్‌ అయ్యర్‌, కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి ఆటగాళ్లు ఇప్పటికే మైదానంలో చురుగ్గా కదులుతూ సత్తా చాటుతున్నారు. దీనికి తోడు ఫీల్డింగ్‌ విలువను గుర్తించిన యాజమాన్యం కూడా కొత్తగా ఈ విభాగంలో మెడల్‌ను కూడా ప్రవేశపెట్టింది.

ఇక ఫీల్డింగ్‌ విషయానికి వస్తే భారత్‌ మెరుగ్గానే ఉంది. క్యాచ్‌లు పట్టడంలో 85శాతం సక్సెస్‌రేటును సాధించినట్లు ఏడో తేదీ నాటికి గణంకాలు చెబుతున్నాయి. కేవలం ఆరు క్యాచ్‌లను మాత్రమే భారత్‌, ఇంగ్లాండ్‌ జారవిడిచాయి. మరోవైపు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు ఒక్కోటి 14 క్యాచ్‌లు, అఫ్గానిస్థాన్‌ 13 క్యాచ్‌లు, న్యూజిలాండ్‌, శ్రీలంక ఒక్కోటి 16 చొప్పున జారవిడిచాయి. దాయాది పాక్‌ 7 క్యాచ్‌లను వదిలేసింది. ఇక గత ప్రపంచకప్‌ల్లో అత్యంత ఖరీదైన క్యాచ్‌లు కూడా ఉన్నాయి.

హెర్షల్‌ గిబ్స్‌ వదిలేసింది ప్రపంచకప్‌ క్యాచ్‌..!

1999లో సూపర్‌ సిక్స్‌ దశలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా హెర్షల్ గిబ్స్‌ శతకం సాయంతో 271 పరుగులు చేసింది. లక్ష్య ఛేదన ప్రారంభించిన ఆసీస్‌ 48/3 గా ఉన్న దశలో లాన్స్‌ క్లూసెనెర్‌ బౌలింగ్‌లో స్టీవ్‌వా క్యాచ్‌ ఇచ్చాడు. దానిని పట్టకముందే దక్షిణాఫ్రికా శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఈ హడావుడిలో గిబ్స్‌ క్యాచ్‌ చేజార్చాడు. అనంతరం స్టీవ్‌వా గిబ్స్‌ వద్దకు వెళ్లి ‘హెర్షల్‌.. నీకు వరల్డ్‌ కప్‌ను ఎలా చేజార్చుకోవాలనిపించింది?’ అని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత స్టీవ్‌ 120 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా విజయం సాధించింది. గిబ్స్‌ వదిలేసిన ఆ క్యాచ్‌ వల్ల అతడు తొలి ఇన్నింగ్స్‌లో చేసిన శతకం కూడా వృథాగా మారిపోయింది. ఇక సెమీస్‌లో మరోసారి ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో చివరి బంతికి అలెన్‌ డొనాల్డ్‌ రనౌట్‌ కావడంతో ఆసీస్‌ ఫైనల్స్‌కు వెళ్లింది. అక్కడ పాక్‌ను ఓడించి రెండోసారి ప్రపంచకప్‌ గెలిచింది.

గూచ్‌ వదిలిన క్యాచ్‌.. ఇంగ్లాండ్‌ కప్పు ఆశలపై నీళ్లు..

1992 ప్రపంచకప్‌ ఫైనల్‌లో పాకిస్థాన్‌-ఇంగ్లాండ్‌ తలపడ్డాయి. ఇది ఆసీస్‌లోని మెల్‌బోర్న్‌లో జరిగింది. పాక్‌ తొలుత బ్యాటింగ్‌ చేపట్టింది. ఓపెనర్లు సొహైల్‌-రమీజ్‌ రజాలు ఇంగ్లిష్‌ బౌలర్ డెరిక్‌ ప్రింగిల్‌ దెబ్బకు త్వరగా పెవిలియన్‌ చేరుకొన్నారు. అప్పటికి పాక్‌ స్కోరు 24/2. ఆల్‌రౌండర్‌ అయిన పాక్‌ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ 3వ స్థానంలో బరిలోకి దిగాడు. కొద్దిసేపు మెల్లగా ఆడిన ఇమ్రాన్‌లో సహనం నశించింది. ఫిల్‌ డిఫ్రిటాస్‌ బౌలింగ్‌లో ఓ అనవసరపు షాట్‌ ఆడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో బంతి టాప్‌ ఎడ్జ్‌ తీసుకొని ఇంగ్లిష్‌ జట్టు కెప్టెన్‌ గ్రాహం గూచ్‌ సమీపంలోకి వెళ్లింది. అతడు ఆ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఆ తర్వాత ఇమ్రాన్‌ కుదురుకొని 72 పరుగులు చేశాడు. వారి జట్టులో అతడే టాప్‌ స్కోరర్‌. పాక్‌ మొత్తం 249 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్‌ లక్ష్య ఛేదన సమయంలో పాక్‌ బౌలర్లు వసీం అక్రం, ఆకీబ్‌ జావెద్‌, ముస్తాక్‌ అహ్మద్‌లు విజృంభించారు. 227 పరుగులకే జట్టు మొత్తం పెవిలియన్‌కు చేరింది. పాక్‌ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది.

క్యాచ్‌ డ్రాప్‌.. గప్తిల్‌ ప్రపంచ రికార్డ్‌..!

2015 ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌-వెస్టిండీస్‌ తలపడ్డాయి. కివీస్‌ బ్యాటర్ల సొంత మైదానం వెల్లింగ్టన్‌లో ఈ పోరు జరిగింది. ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ తొలి బంతినే బౌండరీ దాటించి జోరుమీదున్నట్లు కనిపించాడు. కానీ, జెరోమె టేలర్‌ వేసిన స్క్వేర్‌ లెగ్‌ దిశగా గాల్లోకి లేపాడు. అక్కడ ఫీల్డర్‌ మార్లోన్‌ శామ్యూల్స్‌ క్యాచ్‌ను డ్రాప్‌ చేశాడు. ఆ తర్వాత గప్తిల్‌ ఏమాత్రం వెనుదిరిగి చూసుకోలేదు. 237 పరుగులు సాధించి.. ప్రపంచకప్‌ టోర్నీల చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 393 పరుగులు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు