Australia Cricket: అప్పుడు బెవాన్‌.. ఇప్పుడు మ్యాక్సీ

ఓటమి అంచుల దాకా వెళ్లిన జట్టును ఒంటరిపోరాటంతో గెలిపించడం చాలా అరుదు. అందులోనూ డబుల్‌ సెంచరీతో పూర్తి చేయడం అఫ్గాన్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లోనే చూసి ఉంటాం. ఆసీస్ బ్యాటర్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (201*) చివరి వరకూ క్రీజ్‌లో పాతుకుపోయి జట్టును గెలిపించాడు. 

Published : 08 Nov 2023 15:44 IST

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) ఛేదనలో ఇలా కుప్పకూలి ఇక ఓటమే తరువాయి అన్న స్థితి నుంచి ఓ అద్భుతం చేసినట్లు బయటపడడం ఆస్ట్రేలియాకు ఇదేం కొత్త కాదు. 2003 ప్రపంచకప్‌లో గ్రేట్‌ ఫినిషర్‌ మైకేల్‌ బెవాన్‌..బిచెల్‌ తోడుగా అలాంటి విజయాన్నే అందించాడు. ఇప్పుడు మ్యాక్స్‌వెల్‌ ఆ జట్టుకు అంతకుమించిన గెలుపుని సాధించిపెట్టాడు. ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును ఒంటిచేత్తో బయటకు లాగేశాడు.

బెవాన్‌ అదరహో

వన్డేల్లో సిసలైన ఫినిషర్‌కు అర్థంగా చెప్పుకుంటారు మైకేల్‌ బెవాన్‌ను. ఎన్నో మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు అద్భుత పోరాటంతో విజయాలు అందించాడతను. 2003 ప్రపంచకప్‌లోనూ అతడు అలాంటి ఇన్నింగ్సే ఆడాడు. ఇప్పుడంటే అఫ్గానిస్థాన్‌ జట్టు ఆసీస్‌కు సవాల్‌ విసిరే లక్ష్యాన్ని ముందుంచింది. కానీ అప్పటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా ఛేదించాల్సి లక్ష్యం కేవలం 205 పరుగులే! ఆనాటి కంగారూ జట్టుకు ఆ స్కోరు ఓ మూలకు కూడా రాదు. కానీ ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ మొదలయ్యాక కానీ అర్థం కాలేదు. పరిస్థితి వేరేలా ఉండబోతుందని. ఆండీ కాడిక్‌ దెబ్బకు ఆసీస్‌ వికెట్లు టపటపా కూలాయి. 135/8తో ఆ జట్టు ఓటమి అంచుల్లో నిలిచింది. ఈ స్థితిలోంచి గెలవడం ఏ జట్టుకైనా అంత తేలికేం కాదు. కానీ ఇప్పటి మ్యాక్స్‌వెల్‌ మాదిరే క్రీజులో ఉన్న మైకేల్‌ బెవాన్‌ (74 నాటౌట్‌) మొక్కవోని పట్టుదల ప్రదర్శించాడు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా గొప్పగా పోరాడాడు. ఆండీ బిల్‌ (34 నాటౌట్‌) నుంచి మంచి సహకారం అందుకున్న అతడు ఆసీస్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. అఫ్గాన్‌పై మాక్సీకి ఎంతో మద్దతుగా నిలిచిన కమిన్స్‌ మాదిరే అప్పుడు బిచెల్‌ కూడా గొప్పగా ఆడాడు. కమిన్స్‌ పరుగులేమీ చేయకుండా అడ్డుగోడగా నిలబడితే.. బిచెల్‌ మాత్రం విజయంలో తానూ ఓ చేయి వేశాడు. దీంతో బిచెల్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 73 పరుగులు జత చేసిన బెవాన్‌ ఆసీస్‌కు మరుపురాని గెలుపు సాధించి పెట్టాడు. అయితే ఇంగ్లాండ్‌పై విజయంలో బెవాన్‌ది ఎంత కీలక పాత్రో..బిచెల్‌ది దానికి సరితూగే పాత్రే. ఎందుకంటే మొదట బౌలింగ్‌లో అదరగొట్టి ఏడు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు బిచెల్‌. ఆపై బెవాన్‌తో కలిసి విజయానికి బాటలు వేశాడు.

ఇన్ని ఇన్నింగ్స్‌లు చూశాం కానీ..

ఏంటా షాట్లు.. ఏంటా ఆట! మన జీవితంలో ఎన్నో ఇన్నింగ్స్‌లు చూసి ఉంటాం కానీ.. మంగళవారం ప్రపంచకప్‌లో మ్యాక్స్‌వెల్‌ ఆట మాత్రం చిరస్మరణీయం.. అద్భుతం! అమోఘం! నిజానికి ఈ పదాలు కూడా తక్కువే! ఏదో కొలిచి కొట్టినట్లు.. చాలా పద్ధతిగా, లెక్క ప్రకారం ఒంటిచేత్తో ఛేదన పూర్తి చేశాడు మ్యాక్సీ. క్యాచ్‌లు వదలడం, ఎల్బీ అయి బతికిపోవడం లాంటివి ఈ ఇన్నింగ్స్‌లో ఉన్నా కూడా ఈ ఇన్నింగ్స్‌ చరిత్రలో శాశ్వతం. 292 పరుగుల ఛేదనలో 91 పరుగులకే 7 వికెట్లు తీసి.. ఇక విజయం మనదే అన్న ఆనందంలో ఉన్న అఫ్గాన్‌ నిజంగా స్టన్‌ అయిపోయి ఉంటుంది మ్యాక్సీ మెరుపులకు! గోల్ఫ్, ర్యాంప్, స్వీప్, రివర్స్‌ స్వీప్‌ ఇలా ఒకటేంటి అన్ని రకాల ఆయుధాలతో ఎదురుదాడికి దిగిన ఈ స్టార్‌! ప్రత్యర్థి చూస్తుండగానే లక్ష్యాన్ని కరిగించేశాడు. 1983 ప్రపంచకప్‌లో కపిల్‌దేవ్‌ అసమానమైన ఇన్నింగ్స్‌ను గుర్తుకు తెస్తూ టెయిలెండర్‌ కమిన్స్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 202 పరుగులు జత చేయడం అంటే మాములు విషయం కాదు! ఒకవైపు కాళ్లు పట్టేసి నడవలేని స్థితిలో ఉండి కూడా పరుగు కోసం ప్రయత్నించిన తీరు.. సిక్స్‌లు బాదిన విధానం అద్భుతం. ముఖ్యంగా కౌ కార్నర్‌లో కొట్టిన ఆ సిక్స్‌లను ఎన్నిసార్లు చూసినా తనివి తీరుదు. గోల్ఫ్, టెన్నిస్‌ షాట్లు ఆడిన తీరులో కొట్టిన షాట్లతే అద్భుతం. ఆసీస్‌ ప్రపంచకప్‌ గెలవనీ గెలవకపోనీ మ్యాక్సీ ఆట చిరకాలం నిలిచిపోవడం ఖాయం.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని