Rishabh pant: ఎప్పుడొస్తావ్‌ పంత్‌.. పునరాగమనంపై అభిమానుల్లో ఉత్కంఠ!

మహేంద్రసింగ్‌ ధోని లాంటి ఆల్‌టైం గ్రేట్‌ స్థానాన్ని భర్తీ చేస్తూ సత్తా చాటిన పంత్‌ పోటీ క్రికెట్‌లోకి ఎప్పుడొస్తాడనే ప్రశ్న అభిమానులను తొలిచేస్తోంది.

Published : 17 Aug 2023 15:06 IST

(source: pant insta)

వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా భారత క్రికెట్‌ జట్టులో మహేంద్రసింగ్‌ ధోని లాంటి ఆల్‌టైం గ్రేట్‌ స్థానాన్ని భర్తీ చేయడమంటే మాటలు కాదు. ధోని ఉండగానే వివిధ ఫార్మాట్లలో అనేకమంది వికెట్‌ కీపర్‌ బ్యాటర్లను ప్రయత్నించి చూసింది భారత్‌. వాళ్లందరిలో ఎక్కువ ఆకట్టుకున్నది, నిలకడగా ఆడింది రిషబ్‌ పంత్‌ (Rishabh pant). వివిధ ఫార్మాట్లలో సత్తా చాటుతున్న ఈ కుర్రాడు గతేడాది డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆటకు దూరం కావడం అభిమానులకు పెద్ద షాక్‌. ఆ ప్రమాదం జరిగాక దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఎట్టకేలకు బ్యాటింగ్‌ చేస్తూ కనిపించిన వీడియో సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఇంతకీ పంత్‌ పోటీ క్రికెట్లోకి ఎప్పుడొస్తాడనే ప్రశ్న అభిమానులను తొలిచేస్తోంది.

సాధారణ నేపథ్యం నుంచి వచ్చి.. ఎంతో కష్టం, పట్టుదలతో టీమ్‌ఇండియా స్థాయికి ఎదిగిన కుర్రాడు రిషబ్‌ పంత్‌. 2018 అండర్‌-19 ప్రపంచకప్‌తో వెలుగులోకి వచ్చిన అతను.. ఐపీఎల్‌లో, దేశవాళీల్లో సత్తా చాటి త్వరగానే భారత జట్టులో స్థానం సంపాదించాడు. ధోని కెరీర్‌ చరమాంకంలో ఉన్న దశలో ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్న దశలో రిషబ్‌ తన ప్రతిభతో సెలక్టర్లను మెప్పించాడు. అప్పటికే టెస్టుల్లో రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌గా ఉన్న వృద్ధిమాన్‌ సాహాను వెనక్కి నెట్టి టెస్టుల్లో నిలదొక్కుకున్నాడు. 2021-22 సీజన్లో ఆస్ట్రేలియాతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో టీమ్‌ఇండియా చరిత్రాత్మక విజయం సాధించడంలో ఈ హరిద్వార్‌ కుర్రాడిది కీలక పాత్ర. ఆ సిరీస్‌లోనే కాక మరి కొన్ని మ్యాచ్‌ల్లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. వన్డేలు, టీ20ల్లోనూ సత్తా చాటాడు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తరఫునా అతను అదరగొట్టాడు. ఆ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇలా కెరీర్‌ గొప్పగా సాగిపోతున్న దశలో గత ఏడాది డిసెంబరులో దిల్లీ నుంచి తన స్వస్థలానికి కారులో ప్రయాణిస్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురి కావడం సంచలనం రేపింది. త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్నప్పటికీ.. రిషబ్‌ మోకాలికి తీవ్ర గాయమే అయింది.

డెహ్రాడూన్‌ నుంచి అత్యవసరంగా హెలికాఫ్టర్లో ముంబయికి తరలించి మరీ అతడికి చికిత్స అందించింది బీసీసీఐ. లిగ్మెంట్‌ సర్జరీతో పాటు మరికొన్ని శస్త్రచికిత్సలు చేయించుకున్న కొన్ని నెలల పాటు ఇంటికే పరిమితం అయ్యాడు. నడక మొదలుపెట్టాక జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కు చేరుకుని పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ మధ్యే నెమ్మదిగా బ్యాటింగ్‌ సాధన ఆరంభించాడు. ఈ క్రమంలోనే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బెంగళూరు సమీపంలో జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్‌ నిర్వహించిన వేడుకల్లో భాగంగా సరదాగా కాసేపు క్రికెట్‌ మ్యాచ్‌ ఆడాడు. పంత్‌ ప్యాడ్లు కట్టుకుని క్రీజులోకి వచ్చి బ్యాటింగ్‌ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీంతో అతడి పునరాగమనం మీద ఆసక్తి పెరిగింది.

ఐపీఎల్‌కు గ్యారెంటీ!

పంత్‌ ఏదో సరదాకి ఈ మ్యాచ్‌ ఆడాడు కానీ.. అతను మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించడానికి ఇంకా సమయం పట్టేలాగే ఉంది. వన్డే ప్రపంచకప్‌నకు అతను అందుబాటులోకి వస్తాడని ఎంతమాత్రం ఆశలు పెట్టుకోవడానికి లేదు. ఈ ఏడాది అయితే పోటీ క్రికెట్లోకి వచ్చే అవకాశాలు దాదాపు లేనట్లే. తీవ్ర గాయాలు, శస్త్రచికిత్సల నుంచి కోలుకుని.. అంతర్జాతీయ స్థాయిలో పోటీకి తగ్గట్లు మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించాలంటే సమయం పడుతుంది. ఎన్‌సీఏ వైద్యుల బృందం అతడికి ప్రత్యేకమైన ఫిట్‌నెస్‌ ప్రణాళిక రూపొందించింది. దశల వారీగా ఎప్పుడేం చేయాలో అందులో పొందుపరిచారు. ఓవైపు శారీరక దృఢత్వం కోసం కష్టపడుతూ తేలికపాటి క్రికెట్‌ సాధన చేస్తున్నాడు. ఈ ఏడాది చివరికి అతను మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తాడని భావిస్తున్నారు. ఆ తర్వాత కూడా నేరుగా భారత జట్టులోకి పునరాగమనం చేయకపోవచ్చు. ముందు దేశవాళీల్లో ఆడి ఫిట్‌నెస్, ఫామ్‌ నిరూపించుకోవాల్సి ఉంటుంది. టీమ్‌ఇండియాలోకి సరిగ్గా ఎప్పుడు వస్తాడో చెప్పలేం కానీ.. 2024 ఐపీఎల్‌లో పంత్‌ ఆడే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అందులో సత్తా చాటితే భారత జట్టులోకి పునరాగమనం లాంఛనమే కావచ్చు.

అతడు లేని లోటు

పంత్‌ లేని సమయంలో భారత జట్టు బాగానే ఇబ్బంది పడింది. ముఖ్యంగా టెస్టుల్లో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా తన స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు కనిపించలేదు. పంత్‌ స్థానంలో ఆడిన ఆంధ్రా కుర్రాడు శ్రీకర్‌ భరత్‌ అవకాశాలను ఉపయోగించుకోలేకపోయాడు. వికెట్‌ కీపింగ్‌లో ఆకట్టుకున్నప్పటికీ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. ఇషాన్‌ కిషన్‌ కొన్ని మ్యాచ్‌లు ఆడినా.. పంత్‌కు ప్రత్యామ్నాయంలా కనిపించలేదు. ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పంత్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో భారత అభిమానులు పంత్‌ను బాగా గుర్తు చేసుకున్నారు. అతనుంటే కథ వేరుగా ఉండేదని ఫీలయ్యారు. రాబోయే వన్డే ప్రపంచకప్‌లోనూ పంత్‌ లేకపోవడం భారత్‌కు ప్రతికూలమే. వికెట్‌ కీపింగ్‌ చేసే కేఎల్‌ రాహుల్‌ సైతం ప్రపంచకప్‌నకు అనుమానంగా మారగా.. పంత్‌ లేని లోటును ఇషాన్‌ కిషన్, సంజు శాంసన్‌ లాంటి ఆటగాళ్లు ఏమేర భర్తీ చేస్తారో చూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని