World Cup 2023: సెమీస్ అవకాశాలు.. ఏ జట్టుకు.. ఎలా?

వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023) కీలక దశకు చేరుకుంది. బంగ్లాదేశ్‌ మినహా మిగతా అన్ని జట్లకు సాంకేతికంగా సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి. మరి ఆయా జట్లకు అవకాశాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.  

Published : 01 Nov 2023 17:13 IST

వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023) కీలక దశకు చేరుకుంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ ఏడు మ్యాచ్‌లు ఆడగా.. మిగతా జట్లు ఆరేసి మ్యాచ్‌లు ఆడాయి. అయితే, ఏ జట్టు కూడా అధికారికంగా సెమీస్ బెర్తును ఖరారు చేసుకోలేదు. బంగ్లాదేశ్‌ మినహా మిగతా అన్ని జట్లకు సాంకేతికంగా సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి. మరి ఆయా జట్లకు అవకాశాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.  

భారత్

టీమ్ఇండియా ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి అన్నింట్లోనూ విజయం సాధించింది. ప్రస్తుతం 12 పాయింట్లతో టాప్‌లో ఉంది. శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. భారత్ ఖాతాలో మరో పాయింట్ చేరితే అధికారికంగా సెమీస్ చేరుతుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా ఒక్క దాంట్లో విజయం సాధించినా టాప్‌లో నిలుస్తుందన్నమాట. ఒకవేళ మూడు మ్యాచ్‌ల్లో ఓడినా టీమ్‌ఇండియా సెమీస్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా జరగాలంటే అఫ్గాన్‌ తన మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో కచ్చితంగా ఓడిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత జట్టు ఫామ్‌ చూస్తే ఈ మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు మ్యాచ్‌ల్లో నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మన జట్టు సెమీస్‌ చేరడానికి పెద్దగా అడ్డంకులు లేవని చెప్పొచ్చు.

సౌతాఫ్రికా 

సౌతాఫ్రికా ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్, భారత్, అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5 నుంచి 10 స్థానాల్లో ఉన్న జట్లను పోల్చిస్తే.. దక్షిణాఫ్రికా ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లో గెలిచినా సెమీస్ చేరుతుంది. ప్రస్తుతం ఆ జట్టు ఫామ్‌ని చూస్తే ఇది కష్టమేం కాకపోవచ్చు. కాబట్టి.. ఈ జట్టుకు కూడా సెమీస్ చేరినట్లే.  

న్యూజిలాండ్

టోర్నీ ఆరంభం నుంచి వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన న్యూజిలాండ్.. తర్వాత భారత్‌, ఆస్ట్రేలియా చేతిలో ఓడి కాస్త డీలా పడింది. ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న కివీస్.. సౌతాఫ్రికా, పాకిస్థాన్‌, శ్రీలంకతో ఆ జట్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో విజయం సాధిస్తే సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. 

ఆస్ట్రేలియా 

ఆసీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి టోర్నీని పేలవంగా ఆరంభించింది. తర్వాత పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గి సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిస్తే ఆసీస్ సెమీస్ చేరుతుంది. ఒకవేళ మూడు మ్యాచ్‌ల్లో ఒకే దాంట్లో గెలిచినా ఆస్ట్రేలియాకు అవకాశాలు ఉంటాయి. కానీ, అది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. 

అఫ్గానిస్థాన్‌

ఈ ప్రపంచకప్‌లో సంచలన విజయాలు సాధిస్తోన్న అఫ్గాన్‌కు ఇంకా సెమీస్ అవకాశాలున్నాయి. ఇంగ్లాండ్, పాకిస్థాన్‌, శ్రీలంకను ఓడించిన అఫ్గానిస్థాన్‌.. మిగతా మూడు మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో తలపడాల్సి ఉంది. సెమీస్‌ చేరాలంటే అఫ్గాన్‌ ఈ మూడు మ్యాచ్‌ల్లో నెగ్గడంతోపాటు ఆసీస్, న్యూజిలాండ్ ఒక మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడిపోవాలి. అప్పుడు ఈ మూడు జట్లూ 12 పాయింట్లతో ఉంటాయి. మెరుగైన రన్‌రేట్‌ ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. 

శ్రీలంక 

శ్రీలంక ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుం నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్న లంక సాంకేతికంగా మాత్రమే సెమీస్ రేసులో ఉంది. ఆ జట్టు సెమీస్ చేరాలంటే మూడు మ్యాచ్‌ల్లో కచ్చితంగా విజయం సాధించడంతోపాటు తన కంటే పైన ఐదు జట్లు మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. అంతేకాదు, నెట్‌రన్‌రేట్‌ కూడా కలిసి రావాలి. అయితే, లంక తన మూడు మ్యాచ్‌ల్లో గెలిచే అవకాశాలే లేవు. ఎందుకంటే భారత్, న్యూజిలాండ్ లాంటి బలమైన జట్లను ఆ జట్టు ఓడించాల్సి ఉంటుంది. కాబట్టి.. శ్రీలంక సెమీస్ రావడం కష్టమే అని చెప్పొచ్చు.

పాకిస్థాన్‌

పాకిస్థాన్‌ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో విజయం సాధించింది. ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఉన్న పాక్‌.. న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పాకిస్థాన్‌ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే.. ఈ రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలుపొందాలి. అంతేకాదు ప్రస్తుతం టాప్‌-4లో ఉన్న భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మిగిలి ఉన్న అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఆసీస్, న్యూజిలాండ్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం ఒక దాంట్లో నెగ్గినా పాక్‌ సెమీస్ అవకాశాలు మూసుకుపోతాయి.

నెదర్లాండ్స్.. 

ప్రస్తుతం నాలుగు పాయింట్లతో ఉన్న నెదర్లాండ్స్‌.. అఫ్గానిస్థాన్‌, ఇంగ్లాండ్, భారత్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ జట్టు సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలటే మొదట ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అంతేకాదు పాకిస్థాన్‌, అఫ్గాన్, శ్రీలంక 10 కంటే ఎక్కువ పాయింట్లు సాధించకూడదు.

బంగ్లాదేశ్‌ 

బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. దీంతో ఏ రకంగా చూసిన ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు లేవు. 

ఇంగ్లాండ్

ఈ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి ఒక్క దాంట్లో నెగ్గింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఆ జట్టు సాంకేతికంగా మాత్రమే సెమీస్ రేసులో ఉంది. ఇంగ్లాండ్.. ఇంకా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్‌తో తలపడాల్సి ఉంది. ఇంగ్లిష్ జట్టు సెమీస్‌కు రావాలంటే.. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో విజయం సాధించాలి. అంతేకాదు మూడు జట్లు మాత్రమే ఎనిమిది కంటే ఎక్కువ పాయింట్లతో లీగ్‌ దశను ముగించాల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పని కాదు. 

- ఇంటర్నెట్ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని