FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలనం.. క్వార్టర్స్‌లో బ్రెజిల్‌ను ఓడించిన క్రొయేషియా

ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో మరో సంచలనం. ఫిఫా ఐదు సార్లు ఛాంపియన్‌, స్టార్‌ జట్టు బ్రెజిల్‌ క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ ఫైనల్లో ర్యాకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న క్రొయేషియా జట్టు నంబర్‌ 1 స్థానంలో ఉన్న సాంబా జట్టును మట్టికరిపించింది.

Updated : 10 Dec 2022 01:11 IST

(Photo: FIFA Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో మరో సంచలనం. ఐదు సార్లు ఛాంపియన్‌, స్టార్‌ జట్టు బ్రెజిల్‌ క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ ఫైనల్లో ర్యాకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న క్రొయేషియా జట్టు నంబర్‌ 1 స్థానంలో ఉన్న సాంబా జట్టును 4-2(1-1)తేడాతో మట్టికరిపించింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. ఇందులో క్రొయేషియా నాలుగు గోల్స్‌ చేయగా, బ్రెజిల్‌ జట్టు 2 గోల్స్‌ మాత్రమే చేసింది. దీంతో క్రొయేషియా జట్టు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మరోసారి ఛాంపియన్‌గా నిలుస్తుందనుకున్న బ్రెజిల్‌ సెమీస్‌కు చేరకుండానే ఈ ఫిఫా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. 

హోరాహోరీగా సాగిన కీలక పోరులో ఇరు జట్లు నిర్ణీత సమయంలో గోల్స్‌ చేయలేకపోయాయి. మ్యాచ్‌ ఆద్యంతం క్రొయేషియా రక్షణ కవచాన్ని దాటుకొని సాంబా ఆటగాళ్లు గోల్‌పోస్టు దగ్గరికి వెళ్లినా గోల్‌ చేయలేకపోయారు. క్రోయేషియా గోల్‌కీపర్‌ ఒక గొడలా నిలిచి గోల్‌ కాకుండా అడ్డుకున్నాడు. ఈ క్రమంలో మ్యాచ్‌ నిర్ణీత సమయం 90 నిమిషాల వరకూ ఒక్క గోల్‌ కాలేదు. దీంతో అదనపు సమాయానికి దారి తీసింది. ఎట్టకేలకు 105 నిమిషాల వద్ద బ్రెజిల్‌ స్టార్‌ ఆటగాడు నెయ్‌మార్‌ గోల్‌ చేసి తన జట్టును ఆధిక్యంలో నిలిపాడు. దీంతో బ్రెజిల్‌ శిబిరంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివెరిసింది. ఈ క్రమంలో బ్రెజిల్‌ గెలుపుదిశగా పయనిస్తున్న సమయంలో క్రోయేషియా ఆటగాడు బ్రూనో సాంబా జట్టుకు షాక్‌ ఇచ్చాడు. 117 నిమిషంలో మిస్లావ్‌ ఆర్సిక్‌ నుంచి పాస్‌ అందుకున్న బ్రూనో పెట్‌కోవిక్‌ గోల్ చేయడంతో ఇరు జట్లు సమంగా నిలిచాయి. అదనపు సమయం కూడా అయిపోవడంతో మ్యాచ్‌ చివరగా పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. దీంతో క్రోయేషియా జట్టు నాలుగు సార్లు బంతిని గోల్‌పోస్టులోకి పంపగా, బ్రెజిల్‌ ఆటగాళ్లు కేవలం రెండుసార్లు మాత్రమే గోల్స్‌ చేశారు. దీంతో 4-2 తేడాతో ఓటమిపాలై బ్రెజిల్‌ ఇంటిముఖం పట్టింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని