CSK: అది నిజం కాదు.. కెప్టెన్‌ రుతురాజ్‌కు జడేజా అండగా నిలుస్తాడు: స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌

సీఎస్కే (CSK) కొత్త కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌కు జట్టులోని ప్రతిఒక్కరూ సహకారం అందిస్తారని.. సీనియర్లు వెన్నంటి ఉంటారని ప్రధాన కోచ్ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ స్పష్టం చేశాడు.

Published : 22 Mar 2024 16:08 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ (IPL 2024) ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్సీలో మార్పు చేసింది. ఎంఎస్ ధోనీ (MS Dhoni) వైదొలిగి రుతురాజ్‌కు బాధ్యతలు అప్పగించాడు. అయితే, మరో సీనియర్‌ ఆటగాడు రవీంద్ర జడేజాను కాదని యువ క్రికెటర్‌కు కెప్టెన్‌ పదవి ఇవ్వడం గమనార్హం. రెండేళ్ల కిందట జడ్డూనే తొలుత సారథిగా నియమించి.. ధోనీ వైదొలిగాడు. కానీ, ఆ సీజన్‌లో జడేజా మెప్పించకపోవడంతో మధ్యలోనే అతన్ని తప్పించారు. గత ఎడిషన్‌లో ధోనీ సీఎస్కేను ఛాంపియన్‌గా నిలిపాడు. ఈసారి కూడా అతడే ఉంటాడని అంతా అనుకున్న వేళ ఒక్కసారిగా సంచలన నిర్ణయంతో ధోనీ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. యువ క్రికెటర్ రుతురాజ్‌కు ధోనీ నుంచే కాకుండా సీనియర్‌ ఆటగాడు రవీంద్ర జడేజా నుంచీ సహకారం లభిస్తుందని ప్రధాన కోచ్ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ స్పష్టం చేశాడు. 

‘‘గత సీజన్‌ ఫైనల్‌లో రవీంద్ర జడేజా చివరి రెండు బంతుల్లో ఆడిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చెన్నైను గెలిపించాడు. సీఎస్కే నాయకత్వానికి జడ్డూ గట్టి పోటీదారు. అయితే, సారథిగా నియమితుడైన రుతురాజ్‌ గైక్వాడ్‌కు జడేజా అండగా నిలుస్తాడనడంలో అనుమానాలు అక్కర్లేదు. రుతురాజ్‌ వ్యక్తిగతంగా అద్భుతమైన ఆటగాడు. ఆటగాళ్లతో అతడు వ్యవహరించే తీరు బాగుంటుంది. జట్టులోని ప్రతిఒక్కరూ గౌరవిస్తారు. ధోనీ గాయపడటం వల్లే ఈసారి కెప్టెన్సీ నుంచి వైదొలిగినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. గతేడాది కంటే ఇప్పుడు ధోనీ మరింత దృఢంగా ఉన్నాడు. ఇప్పటికీ నెట్స్‌లో విపరీతంగా శ్రమిస్తాడు. భారీ షాట్లు కొట్టే సత్తా ఉంది’’ అని ఫ్లెమింగ్‌ వెల్లడించాడు. 

ధోనీకి తెలుసు.. అందుకే రుతురాజ్‌ ఎంపిక: భారత మాజీ క్రికెటర్

‘‘ఎంఎస్ ధోనీ జట్టును బ్యాలెన్స్‌ చేయడంలో దిట్ట. అద్భుత నాయకత్వ పటిమ కలిగిన ప్లేయర్. రుతురాజ్‌ను సారథిగా ప్రమోట్‌ చేయడానికి ధోనీ వద్ద కారణం ఉంటుంది. ఎప్పటికీ తానే కెప్టెన్‌గా ఉండలేనని ధోనీకి తెలుసు. అందుకే, భవిష్యత్తు కోసం ఇప్పటినుంచే రుతురాజ్‌ను సిద్ధం చేసేందుకు అతడివైపు మొగ్గు చూపి ఉంటాడు. ఝార్ఖండ్‌ నుంచి వచ్చిన ధోనీ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా స్టార్‌గా ఎదిగాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్‌గా మారాడు. భావోద్వేగాలను బయటకు తెలియనీయకుండా ఉండటం గొప్ప విషయం. అయితే, ప్రతి ఒక్కరూ ఎప్పటికైనా సరే ఆటకు గుడ్‌బై చెప్పాల్సిందే. అలాగే విరాట్ కోహ్లీ కూడా గొప్ప క్రికెటర్. ఈసారి ఆర్సీబీ టైటిల్‌ను కొడుతుందనే నమ్మకం నాకు లేదు’’ అని మాజీ క్రికెటర్ గోపీనాథ్ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని