CSK vs GT: ఇదంతా ‘మహి’మే: చెన్నై సూపర్ కింగ్స్‌ ప్లేయర్లు

అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఛాంపియన్‌గా అవతరించడం చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) స్పెషాలిటీ. బౌలింగ్‌దళంలో కుర్రాళ్లు ఉన్నా సరే వారి నుంచే అద్భుత ప్రదర్శనను రాబట్టడంలో కెప్టెన్‌ ధోనీని (MS Dhoni) మించిన సారథి మరొకరు ఉండరు. ఇదే మాటను సీఎస్‌కే స్టాఫ్‌, ఆటగాళ్లు చెబుతారు. 

Published : 30 May 2023 14:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ చరిత్రలో (IPL) ఐదుసార్లు విజేతగా నిలిచిన రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అవతరించింది. ఇంతకుముందు ముంబయి ఇండియన్స్‌ మాత్రమే ఐదు ట్రోఫీలను గెలుచుకుంది. ఇప్పుడు ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వంలోని సీఎస్‌కే  ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను (CSK vs GT) మట్టికరిపించింది. ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌ ఇరు జట్ల మధ్యే జరిగింది. అందులో గుజరాత్ గెలిచింది. అయితే, తొలి క్వాలిఫయర్‌లో మరోసారి ఇరు జట్లూ తలపడ్డాయి. సీఎస్‌కే విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఇక్కడా చివరి బంతికి జీటీని చిత్తు చేసిన చెన్నై టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. వర్షం కారణంగా అర్ధరాత్రి దాటినా.. ఈ మ్యాచ్‌కు 3.2 కోట్ల వ్యూవర్‌షిప్‌ వచ్చినట్లు జియో సినిమా వెల్లడించింది. వీక్షణలపరంగా ఇదే రికార్డు. మ్యాచ్‌ అనంతరం చెన్నై ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది మాట్లాడారు. మరీ ముఖ్యంగా సీఎస్‌కే కోచ్ స్టీఫెన్‌ ప్లెమింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘జడేజా ఆల్‌రౌండర్‌ షో వల్ల తొలి క్వాలిఫయర్‌లోనూ గుజరాత్‌పై విజయం సాధించాం. ఫైనల్‌లో మరోసారి అతడే గెలిపించాడు. శుభ్‌మన్‌ గిల్ వంటి కీలక వికెట్‌ను తీయడంతోపాటు విలువైన పరుగులు చేసిన జడేజా గన్‌ ప్లేయర్‌. గత సీజన్‌లో తీవ్ర నిరుత్సాహానికి గురైన సందర్భాలను చవిచూశాడు. కెప్టెన్సీ కష్టంగా మారడం, గాయాలు కావడంతో ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. టెస్టుల్లోకి అడుగు పెట్టిన జడేజా అదరగొట్టేసి సీఎస్‌కేలోకి అడుగు పెట్టాడు. బంతితో కీలక పాత్ర పోషించిన జడ్డూ.. లోయర్‌ ఆర్డర్‌లో జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. మేం 20 మంది కీలక ఆటగాళ్లు .. 15 మంది కోచింగ్‌ సిబ్బందితో బరిలోకి దిగాం. ఆల్‌రౌండర్‌ జడేజాకు మద్దతుగా నిలిచి అతడిలోని ఆటకు మరింత పదును పెట్టడంలో ధోనీ ముఖ్య భూమిక పోషించాడు. అతడిపై ఉంచిన నమ్మకానికి ఈ మ్యాచ్‌లో ప్రతిఫలం అందించాడు’’ అని ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ తెలిపాడు. 

వారిని చూస్తే గర్వంగా ఉంది: బ్రావో

‘‘ఫైనల్‌లో విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకోవడం బాగుంది. సీఎస్‌కే జట్టుతో ప్రయాణించడం ఎల్లవేళలా ఆనందంగా ఉంటుంది. యువ బౌలర్లు ఒత్తిడిని తీసుకోవడానికి ముందుకు రావడం అభినందనీయం. ఇలాంటి ప్రదర్శన చూస్తే మాకు గర్వంగా ఉంటుంది. తుషార్‌ దేశ్‌ పాండే ఈ మ్యాచ్‌ మినహా.. మిగతా వాటిల్లో మెరుగ్గా రాణించాడు. నా బెస్ట్‌ ఫ్రెండ్ కీరన్‌ పొలార్డ్‌ మ్యాచ్‌ను చూసి ఉంటాడని భావిస్తున్నా’’ అని బౌలింగ్‌ కోచ్ బ్రావో వ్యాఖ్యానించాడు. 

దాని గురించే చర్చ: దీపక్ చాహర్

‘‘ప్రతిసారి మ్యాచ్‌ విజయం గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన రాయుడు కూడా ఫైనల్‌లో విజయంతోనే ముగిస్తానని అంటూ ఉన్నాడు. అతడి నమ్మకం అసాధారణమైంది. ప్రతి గేమ్‌లోనూ మన భాగస్వామ్యం అంటూ ఉండాలి. ఇదే సింపుల్‌ గేమ్‌ ప్లాన్. తప్పకుండా మేం బాగా ఆడతామని తెలుసు. ఫైనల్‌లో విజయం సాధించడానికి ప్రతి ఒక్కరి సహకారం ఉంది’’ అని దీపక్ అన్నాడు.

రాయుడు కోసం...: రుతురాజ్‌

‘‘గత సీజన్‌ పరిస్థితిని మరోసారి గుర్తుకు తెచ్చుకుంటే.. ఈసారి విజేతగా నిలవడం ప్రత్యేకంగా అనిపిస్తోంది. మా శైలిలో పుంజుకొని ఛాంపియన్‌గా అవతరించాం. చెపాక్‌తోపాటు బయటి మైదానాల్లోనూ విజయం సాధించాం. ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించారు. డేవన్ కాన్వే, జింక్స్ (అజింక్య రహానె).. ఇలా అందరం రాణించాం. అంబటి రాయుడుకు తగినన్ని బంతులు రాలేదు. అయినా సరే, మేం ఈ కప్‌ను రాయుడుకు అంకితమిస్తున్నాం. ఛేదనలో శుభారంభం లభించడంతో సులువుగా 12 లేదా 13 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేస్తామని అనిపించింది’’ అని రుతురాజ్‌ తెలిపాడు.

ఈ క్రెడిట్ వారికే: అజింక్య రహానె

‘‘ఈ సీజన్‌ను నేను చాలా ఎంజాయ్‌ చేశా. ఇదంతా సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌తోపాటు మహీ భాయ్‌ వల్లే. నాకు అవకాశం ఇచ్చి ఆడేలా చేయడంలో మద్దతుగా నిలిచారు. సీజన్‌ ప్రారంభానికి ముందే నా పాత్ర ఏంటో చెప్పారు. ఆ తర్వాత ఎందులోనూ కలగజేసుకోకుండా స్వేచ్ఛ ఇచ్చారు. నేను ఆడిన తీరుపట్ల ఎంతో సంతోషంగా ఉన్నా. ఫైనల్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌ ఆడటం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఎంఎస్ ధోనీ కోసం కప్‌ను గెలవడం బాగుంది’’ అని అజింక్య రహానె చెప్పాడు.

ఇంతకంటే ఏం అవసరం లేదు: అంబటి రాయుడు

‘‘నా ఐపీఎల్ కెరీర్‌ వీడ్కోలుకు ఇంతకంటే మించిన ముగింపు అవసరం లేదు. ఐపీఎల్‌లో ఆయా జట్ల తరఫున ఆడటం ఎప్పుడూ అదృష్టమని భావిస్తా. నా జీవితాంతం ఈ విజయం గుర్తుండిపోతుంది. నా కోసం గత ముప్పై ఏళ్లుగా కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా కుటుంబానికి రుణపడి ఉంటా. మరీ ముఖ్యంగా మా నాన్నకు. ఆయన లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చుండేవాడిని కాదు’’ అని అంబటి రాయుడు పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు