IPL-CSK: ఉదయం 9 గంటల వరకు సంబరాలు.. కొందరికి ఫ్లైట్స్‌ కూడా మిస్‌: డేవన్ కాన్వే

ఐపీఎల్ చరిత్రలో (IPL) ఐదు టైటిళ్లను గెలిచిన రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. పటిష్ఠమైన జట్లన ఓడించి మరీ ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే ఛాంపియన్‌గా నిలిచింది.

Published : 15 Jun 2023 16:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఎలాంటి అంచనాలు లేకుండానే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో హేమాహేమీ జట్లను ఓడించి ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ 2023 (IPL 2023) సీజన్‌ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) ఎగరేసుకుపోయింది. ఐపీఎల్ ముగిసి పక్షం రోజులు దాటినా.. ఇప్పటికీ సీఎస్‌కే ఆటగాళ్లు కప్‌ను సొంతం చేసుకున్న క్షణాలను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. కివీస్ వికెట్‌ కీపర్‌ డేవన్ కాన్వే (Devon Conway) సీఎస్‌కే ఓపెనర్‌గా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే తరఫున ఆడటం ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పిన కాన్వే.. టైటిల్‌ నెగ్గిన  రోజు కొందరు ఆటగాళ్లు తాము వెళ్లాల్సిన విమానాలను మిస్‌ చేసుకున్నారని తెలిపాడు. 

‘‘టైటిల్‌ను నెగ్గడం ఉత్సాహం కలిగించింది. అయితే, కొందరు ఆటగాళ్లు తమ గమ్య స్థానాలకు వెళ్లాల్సిన విమానాలను మిస్‌ అయ్యారు. మొయిన్‌ అలీ కుటుంబం తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంది. బౌలింగ్‌ కన్సల్టెంట్‌ ఎరిక్‌ సిమన్స్ తన ఫ్లైట్‌ను రద్దు చేసుకున్నాడు. డ్వేన్‌ ప్రిటోరియస్‌కు  విమానం మిస్ అయింది. అతడి కుటుంబ సభ్యులు మాత్రమే సమయానికి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని వెళ్లిపోయారు. టైటిల్‌ను గెలిచిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో మేమంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాం. మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు కొనసాగాయి. ధోనీ మాకు మధ్యలో ఉన్నాడు. మేమంతా నేరుగా టిఫిన్‌ చేసేశాం. కొంతమంది నిద్ర పోవడానికి వారి రూమ్‌కు వెళ్లిపోయారు.  

ధోనీతో ఎక్కువ సమయం గడిపినందుకు అదృష్టంగా భావిస్తా. అతడి పట్ల గౌరవం మాటల్లో చెప్పలేనిది. ప్రతిసారి అతడు రూమ్‌లోకి వస్తుంటే ఏదో తేజస్సు ధోనీ చుట్టూ ఉన్నట్లు అనిపిస్తుంది. క్రికెట్‌లో అతడు సాధించిన ఘనతలు అపూర్వం’’  అని కాన్వే పేర్కొన్నాడు. చెన్నై - గుజరాత్ మధ్య మ్యాచ్‌ రిజర్వ్‌డేకు (మే 29) వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్‌ అర్ధరాత్రి వరకు జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం సాధించి సీఎస్‌కే తన ఖాతాలో ఐదో ఐపీఎల్‌ టైటిల్‌ను వేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు