CSK vs RCB: ధోనీ పాత్ర ఏంటి..? ఆర్సీబీ వ్యూహమేంటి?

చెపాక్‌ వేదికగా సీఎస్కే-ఆర్సీబీ (CSK vs RCB) జట్ల మధ్య ఐపీఎల్ 17వ సీజన్‌ తొలి మ్యాచ్‌ జరగనుంది. 

Updated : 22 Mar 2024 15:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్ అభిమానుల కోసం ఐపీఎల్ (IPL) సందడి వచ్చేసింది. ఐదుసార్లు ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌ ఈసారి కొత్త కెప్టెన్‌ నాయకత్వంలో బరిలోకి దిగింది. ప్రతి సీజన్‌లోనూ ‘ఈసాలా కప్‌ నమదే’ నినాదంతో వచ్చే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలి మ్యాచ్‌కు సై అంటోంది. మరి ఈ జట్టు వ్యూహమేంటి? కెప్టెన్సీ పగ్గాలను వదిలేసిన ధోనీ పాత్ర ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా తమకు అచ్చొచ్చిన చెపాక్‌ వేదికపై చెలరేగేందుకు సీఎస్కే అస్త్రాలను సిద్ధం చేసుకుంది. నూతన సారథి రుతురాజ్‌ గైక్వాడ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుని జట్టును ముందుకు నడిపిస్తాడనేది ఆసక్తిగా మారింది. ఓపెనర్‌గా అతడితో ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు న్యూజిలాండ్ బ్యాటర్ డేవన్‌ కాన్వే అందుబాటులో లేడు. గత వన్డే వరల్డ్‌ కప్‌లో అదరగొట్టిన కివీస్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్ర ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. అజింక్య రహానె, డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్‌ దూబె, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజాతో కూడిన బ్యాటింగ్‌ లైనప్‌ బలంగానే ఉంది. భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన సమీర్‌ రిజ్వీని బరిలోకి దింపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక బౌలింగ్‌ విషయంలో ఇప్పటికే మొయిన్ అలీ, జడేజా రూపంలో స్పిన్‌ ఆల్‌రౌండర్లు ఉన్నారు. రెండేళ్ల తర్వాత మళ్లీ సీఎస్కేకు ఆడుతున్న శార్దూల్‌ ఠాకూర్‌తోపాటు దీపక్ చాహర్ కూడా బ్యాటింగ్‌ చేయగల పేస్‌ బౌలర్లు. పతిరణ గైర్హాజరీలో తుషార్‌ పాండేతో కలిసి సీనియర్లు ఇద్దరూ పేస్‌ దళాన్ని నడిపించాల్సి ఉంది.

ధోనీ.. వికెట్‌ కీపర్‌గా వస్తాడా?

ధోనీ కెప్టెన్సీని త్యజించాక ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా ఆడతాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. కొన్ని మ్యాచ్‌లకు అతడు పూర్తిస్థాయిలో ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే, ప్రస్తుతం ఉన్న సీఎస్కే స్క్వాడ్‌లో ఏకైక సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ధోనీనే. గాయం కారణంగా కాన్వే కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు యువ వికెట్‌ కీపర్ అవనీశ్ ఆరవిల్లేను గత మినీ వేలంలో సీఎస్కే ఎంపిక చేసుకుంది. ధోనీ ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా బ్యాటింగ్‌ మాత్రమే చేసి.. వికెట్‌ కీపింగ్‌ను కుర్రాడికి అప్పగించే అవకాశం లేకపోలేదు. యువ టాలెంట్‌ను ప్రోత్సహించడంలో మన ‘కెప్టెన్‌ కూల్’ ఎప్పుడూ ముందుంటాడు.

అమ్మాయిల స్ఫూర్తితో.. ఆర్సీబీ

ఇప్పటి వరకూ ఒక్క టైటిల్‌ను బెంగళూరు నెగ్గని విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇటీవల WPL కప్‌ను ఆర్సీబీ మహిళా జట్టు గెలిచింది. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో డుప్లెసిస్ నాయకత్వంలోని పురుషుల జట్టు సత్తా చాటేందుకు బరిలోకి దిగుతోంది. డుప్లెసిస్‌తోపాటు స్టార్‌ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్‌ కార్తిక్ కీలక ప్లేయర్లు. డీకే ఫినిషర్‌గా గత సీజన్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ఈసారి ఆ పాత్ర సమర్థంగా పోషిస్తాడని ఆర్సీబీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. భారీ మొత్తం వెచ్చించి మరీ దక్కించుకున్న కామెరూన్ గ్రీన్‌ తన ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆర్సీబీని గెలిపించాల్సిన అవసరం ఉంది. చెపాక్‌ వేదిక బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. స్పిన్నర్లకు సహకారం లభిస్తుంది. ఇలాంటి సమయంలో బ్యాటర్లపైనే కాకుండా నాణ్యమైన స్పిన్‌ ఎటాక్‌తో బరిలోకి దిగాలి. స్టార్‌ పేసర్‌ సిరాజ్‌తోపాటు లాకీ ఫెర్గూసన్, యువ బౌలర్ ఆకాశ్‌ దీప్‌, గ్రీన్‌తో పేస్‌ దళం బలంగా ఉంది. స్పిన్‌ బౌలింగ్ విభాగంలో మ్యాక్స్‌వెల్‌పైనే ఎక్కువగా ఆధారపడక తప్పని పరిస్థితి. కర్ణ్‌ శర్మ లెగ్‌ స్పిన్‌తో ఏమాత్రం రాణిస్తాడో చూడాలి. 

తుది జట్లు (అంచనా): 

సీఎస్కే: రుతురాజ్‌ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానె, డారిల్ మిచెల్, మొయిన్‌ అలీ, శివమ్‌ దూబె, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ముకేశ్‌ చౌదరి/తుషార్‌ దేశ్‌ పాండే

ఆర్సీబీ: ఫాఫ్‌ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్‌ పటీదార్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్‌ కార్తిక్‌ (వికెట్ కీపర్), లామ్రోర్‌, లాకీ ఫెర్గూసన్, సిరాజ్, కర్ణ్‌ శర్మ, ఆకాశ్‌ దీప్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని