CWG 2022: తండ్రి చేసిన త్యాగమే.. నీతూ కలకు ప్రాణం..!

  ఓ యువ మహిళా బాక్సర్‌  ఎంతో ఆత్మవిశ్వాసంతో పంచ్‌లు కొడుతుంటే.. ప్రతి మ్యాచ్‌లోనే గెలవాలన్న కసి ఆమె కళ్లల్లో కనిపిస్తుందంటే...

Updated : 08 Aug 2022 14:51 IST

ఆయన లేకుండా నేను ఇక్కడ ఉండను.. 

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఓ యువ మహిళా బాక్సర్‌ ఎంతో ఆత్మవిశ్వాసంతో పంచ్‌లు కొడుతుందంటే.. ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాలన్న కసి ఆమె కళ్లల్లో కనిపిస్తుందంటే.. అందుకు ఆమె తండ్రి చేసిన త్యాగమే కారణం. అదే కామన్వెల్త్ గేమ్స్‌లో భారత యువ బాక్సర్ నీతూ ఘంఘాస్‌ తొలి స్వర్ణం గెలిచేలా చేసింది. అందుకే ఆమె పసిడి గెలిచాక తన తండ్రి జై భగవాన్‌కు పతకాన్ని అంకితం చేసింది.

ఆయన చేసిన త్యాగం ఏంటి..!

(ఫొటో : నీతూ ఇన్‌స్టా)

నీతూ తండ్రి హరియాణా సెక్రటేరియట్‌లో ఓ సాధారణ ఉద్యోగి. అయితే కుమార్తెను ప్రపంచ ఛాంపియన్‌ చేయాలన్న కోరిక ఆయన్ను ఉద్యోగం సరిగాచేయనివ్వలేదు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడేళ్లు జీతం లేని సెలవులో ఉండి.. నీతూకు శిక్షణ ఇచ్చాడు. ఎట్టకేలకు.. ఆదివారం నీతూ మెడలో బంగారు పతకంతో పోడియంపై నిల్చున్నప్పుడు ఆయన త్యాగానికి ప్రతిఫలం దక్కింది. ఇంతకముందు రెండుసార్లు  ప్రపంచ యూత్ ఛాంపియన్ అయిన నీతూ.. తండ్రికి ఇలాంటి వేదిక( కామన్వెల్త్‌)పై భారత్‌కు పతకాన్ని అందిస్తాననే భరోసా ఎప్పుడో ఇచ్చింది.

నా చిరకాల కోరిక

మ్యాచ్‌ అనంతరం నీతూ మాట్లాడుతూ ‘త్రివర్ణ పతాకాన్ని చూడటం గొప్ప అనుభూతి, నా చిరకాల కోరికలలో ఒకటి ఈరోజు నెరవేరింది. అందరి ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞురాలిని.. ఈ పతకం మన తోటి దేశస్థులకు, మా నాన్నకు అంకితం. ఆయన నా కోసం ఎంతో కష్టపడ్డారు. అనేక కష్టాలను అనుభవించారు. ఎన్నో ప్రార్థనలు చేశారు.  నాకు అన్నివేళాల అండగా ఉన్నారు. ఆయన లేకపోతే నేను ఇక్కడ ఉండను’ అని నీతూ చెప్పింది. 

గబ్బర్ షెర్ని ఆఫ్ ది రింగ్‌ 

(ఫొటో : నీతూ ఇన్‌స్టా)

నీతూ చాలా తక్కువుగా మాట్లాడుతుంది. క్యాంప్‌లో, బయట కూడా ఆమె వాయిస్ వినబడదు. కానీ రింగ్‌లోపల మాత్రం ఆమె ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంది. అందుకే కోచ్‌ భాస్కర్‌ భట్‌ మాట్లాడుతూ ‘రింగ్ లోపల ఆమె గబ్బర్ షెర్నీలా ఉంటుంది. ప్రపంచ వేదికపై భారతీయ బాక్సింగ్‌కు మేరికోమ్‌ గుర్తింపు తీసుకొచ్చింది. అయితే, నీతూ బాక్సింగ్‌లో అడుగుపెట్టిన తర్వాత నాకు ‘తర్వాతి మేరికోమ్‌’గా కనిపించింది. ఆమె రింగ్‌ బయట సైలెంట్‌గా ఉన్నా రింగ్‌లో మాత్రం సింహంలానే గర్జిస్తుంది’ అని భట్‌ ప్రశంసించాడు.

జ్వరంతో బాధ పడుతూ..

నీతూ ఘంఘాస్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ లోనే విజేతగా నిలుస్తుందని అంతా భావించారు. అయితే, జ్వరం కారణంగా క్వార్టర్‌ ఫైనల్‌ సమయంలో పూర్తి ఫిట్‌నెస్‌తో లేదు. అయినా మ్యాచ్‌కు సిద్ధం అయింది. క్వార్టర్స్‌లో కజకిస్థాన్‌కు చెందిన అలువా బల్కిబెకోవాతో 2-3తో ఓడిపోయినా.. చివరివరకూ పోరాడింది.  ఈ సారి కామన్వెల్త్‌లో స్వర్ణం గెలిచాక ఆమె మాట్లాడుతూ ‘ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో కీలక మ్యాచ్‌ జరిగే ముందు నాకు రాత్రంతా జ్వరం వచ్చి.. నిద్రపట్టలేదు. కానీ అదృష్టవశాత్తూ ఈసారి అలాంటిదేమీ లేదు’ అని చెప్పింది. కామన్వెల్త్‌ సెమీస్‌లో రిఫరీ-స్టాప్స్-కాంటెస్ట్ ద్వారా గెలిచిన నీతూ.. ఆ తర్వతా 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కాంస్య విజేత డెమీ-జాడే రెజ్టన్‌ను ఓడించగలిగింది.

అద్భుతమైన వ్యక్తిత్వం..

ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీకోమ్‌ స్థానంలో కామన్వెల్త్‌ క్రీడలకు ఎంపికైనా నీతూ.. తొలి ప్రయత్నంలోనే స్వర్ణం గెలిచాక .. ‘మేరీకోమ్‌కు పూర్తిగా భిన్నమైన స్థానం ఉంటుంది. ఆమె విశ్వ విజేత. నేను ఆమెకు సరితూగను’అని తన వినయాన్ని చాటుకుంది. నీతూ ఇదే పంథాలో తన బాక్సింగ్‌ పయనాన్ని సాగిస్తూ, తన తండ్రికి, దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆశిద్దాం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని