CWG 2022: టీమ్‌ఇండియాకు కఠిన పరీక్ష..సెమీస్‌లో నెగ్గాలంటే ఏం చేయాలి?

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత మహిళా క్రికెట్‌ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. 

Updated : 06 Aug 2022 11:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత మహిళా క్రికెట్‌ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. శనివారం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఫైనల్‌ బెర్త్‌కోసం బలమైన ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. ఒకవైపు టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ చేతిలో అనూహ్య పరాజయం తరవాత వరుసగా రెండు భారీ విజయాలతో జోరు మీదుండగా.. మరోవైపు ఈ టోర్నీలో ఓటమి రుచి చూడని ఇంగ్లిష్‌ జట్టు సూపర్‌ఫామ్‌లో కనిపిస్తోంది. దీంతో ఈ రెండు జట్లు మధ్య సెమీస్‌పోరు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరీ ఏ జట్టుకు విజయావకాశాలు ఎలా ఉన్నాయో చుద్దాం..!

టీమ్‌ఇండియా బలం ఎవరు..!

భారత్‌ జట్టు సెమీస్‌కు చేరిందంటే ప్రధాన కారణం రేణుకా సింగ్‌. ఎందుకంటే 3 మ్యాచ్‌ల్లో  4.00 ఎకానమీతో 9 వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడిచేసింది. ఆస్ట్రేలియాపై నిప్పులు చెరిగిన రేణూ వారి టాప్‌ఆర్డర్‌ను పవర్‌ప్లే లోనే పెవిలియన్‌కు పంపింది. ఇక చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బార్బడోస్‌ బ్యాటర్లను బెంబేలెత్తించి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. పవర్‌ప్లే ఓవర్లలో ఇన్‌స్వింగ్‌ బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో రేణూ నేర్పరి. ఇంగ్లాండ్‌ జట్టులో ఓపెనర్లు పెద్దగా ఫామ్‌లో లేరు. దీంతో రేణూ పదునైన బంతులతో వారిని ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. బౌలింగ్‌లో టీమ్‌ఇండియా అతిపెద్ద బలం రేణుకా సింగ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమెకు తోడు దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, స్నేహ రాణా, మేఘనా సింగ్ కూడా ఫామ్‌లోనే ఉన్నారు. వీళ్లంతా సమష్టిగా రాణిస్తే ఇంగ్లాండ్‌ బ్యాటర్లను అడ్డుకోవచ్చు.

ఇక బ్యాటింగ్‌లో నిలకడలేమి కనిపిస్తోంది.  తొలి మ్యాచ్‌లో అర్ధశతకం చేసిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ బార్బడోస్‌పై డకౌట్‌ అయింది. పాక్‌పై 63 పరుగులతో రాణించిన స్మృతి మంధాన, బార్బడోస్‌పై కీలకపోరులో ఆరంభంలోనే పెవిలియన్‌ చేరింది. జెమిమా రోడ్రిగ్స్ సైతం వీరిలానే బార్బడోస్‌పై అర్ధశతకం సాధించిన, ఆసీస్‌పై విఫలమైంది. ఈ ముగ్గురు స్టార్‌ బ్యాటర్లు ఒక్కొక్కరు ఒక్కో మ్యాచ్‌లో రాణించారు. అయితే, సెమీస్‌ లాంటి కీలక మ్యాచ్‌లో సమష్టిగా ఆడితేనే స్కోరు బోర్డుపై అనుకున్న పరుగులు వస్తాయి. అయితే, యువ ఓపెనర్‌ షెపాలీ వర్మ 3 మ్యాచ్‌ల్లో 157.35 స్ట్రెక్‌రేట్‌తో 107 పరుగులు సాధించి టీమ్‌ఇండియా తరఫున టాప్‌స్కోరర్‌గా ఉంది. ఆమె పవర్‌ప్లేలో ధాటిగా ఆడటం టీమ్‌ఇండియాకు కలిసొచ్చే అంశం. బ్యాటింగ్‌లో భారత జట్టు బలం ఈ నలుగురే. వీరు ఇంగ్లాండ్‌ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారనే దానిపై టీమ్‌ఇండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ఇంగ్లాండ్‌తో అంత వీజీ కాదు..!

సొంత గడ్డపై మ్యాచ్‌లు జరుగుతుండటం ఇంగ్లాండ్‌కు అతిపెద్ద బలం. శ్రీలంక, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా ఇలా ప్రత్యర్థి ఎవరైనా ఇంగ్లాండ్‌దే ఆధిపత్యం. లీగ్‌దశలో ఈ మూడు జట్లపై అలవోకగా నెగ్గి ఇప్పుడు భారత్‌కు సవాల్ విసురుతోంది. ఇంగ్లాండ్‌ జట్టు బౌలర్లు కేథరిన్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, ఇస్సీ వాంగ్ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందిపెడుతున్నారు. ఇంగ్లాండ్‌ బౌలర్లు న్యూజిలాండ్‌ లాంటి బలమైన జట్టునే 71 పరుగులకు పరిమితం చేశారంటే వారి బౌలింగ్‌ ఎలా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా పవర్‌ ప్లేలో పేసర్‌ కేథరిన్ బ్రంట్ పేస్‌ను ఎదుర్కొవడం భారత్‌కు సవాలే. ఆమె న్యూజిలాండ్‌పై 3 ఓవర్లు వేసి కేవలం నాలుగు పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టింది. ఇందులో ఒక మెయిడిన్‌ కూడా ఉంది. సీనియర్‌ స్పిన్నర్‌ ఎక్లెస్టోన్ మిడిల్‌ ఓవర్లలతో పాటు డెత్‌లో కూడా బౌలింగ్‌ చేయగలదు. ఈ టోర్నీలో 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ తరఫున టాప్‌ వికెట్‌ టేకర్‌గా ఉంది. వీరికి తోడు కెంప్, వాంగ్ లాంటి బౌలర్లలున్నారు. దీంతో ఇంగ్లాండ్‌కు బౌలింగ్‌లో ఎటువంటి సమస్యా లేదు. మరి వీరిని భారత్‌ బ్యాటర్లు ఎలా ఆడుతారో చుడాలి.

ఆలిస్ క్యాప్సేతో డేంజర్‌!

ఇంగ్లాండ్‌ జట్టు లీగ్‌దశలో బౌలింగ్‌తోనే మ్యాచ్‌లను గెలిచేసింది. బ్యాటర్లు స్వల్ప లక్ష్యాన్ని నెమ్మదిగా ఛేదించేవారు. అయితే, ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ ఆలిస్ క్యాప్సే మాత్రం ప్రతి మ్యాచ్‌లోనూ రాణించింది. 3 మ్యాచ్‌ల్లో (44,50,23) మొత్తం  117 పరుగులు చేసి టోర్నీలో రెండో టాప్‌స్కోరర్‌గా ఉంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు విఫలం అయినప్పటికీ వన్‌డౌన్‌లో క్యాప్సే అదరగొడుతుంది. మిగిలిన బ్యాటర్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతుంది. దీంతో టీమ్‌ఇండియా ఈమెను నిలువరించకపోతే మ్యాచ్‌ చేజారే అవకాశం ఉంది. కెప్టెన్‌ నటాలీ స్కివర్ మూడు మ్యాచ్‌ల్లో కలిపి 36 పరుగులే చేసింది. కీలక మ్యాచ్‌లో ఆమె ఫామ్‌లోకి వస్తే భారత్‌కు ప్రమాదమే.

తుదిజట్లు అంచనా:

ఇంగ్లాండ్‌: డానియెల్ వ్యాట్, సోఫియా డంక్లీ, ఆలిస్ క్యాప్సే, నటాలీ స్కివర్ (కెప్టెన్‌), అమీ జోన్స్ (వికెట్‌ కీపర్‌), మైయా బౌచియర్, కేథరీన్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, ఫ్రెయా కెంప్, ఇస్సీ వాంగ్, సారా గ్లెన్

భారత్‌: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), తానియా భాటియా (వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, స్నేహ రాణా, మేఘనా సింగ్, రేణుకా సింగ్



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని