CWG 2022: ఐస్‌క్రీం ఇప్పుడు తినొచ్చు.. ఇదే అమ్మకు బర్త్‌డే గిఫ్ట్‌..!

తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ పేరు దేశమంతా మారు మోగుతుంది.

Updated : 08 Aug 2022 12:10 IST

తన విజయంపై నిఖత్‌ జరీన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ పేరు దేశమంతా మారు మోగుతుంది. మేరీకోమ్‌ పోటీ పడే విభాగంలో ఆడుతూ రెండు నెలల కిందటే ప్రపంచ ఛాంపియన్‌ అయిన నిఖత్‌.. కామన్వెల్త్‌ క్రీడల్లో పసడి సాధించి మళ్లీ మెరిసింది. దీంతో దేశంలో ప్రస్తుతం అత్యుత్తమ మహిళా బాక్సర్‌ నిఖత్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఆమె స్వర్ణం అంత సులువుగా గెలవలేదు. దీనికోసం ఎంతో శ్రమించింది. స్ట్రాంజా మెమొరియల్‌లో 52 కేజీల ఈవెంట్‌లో పసిడి నెగ్గిన నిఖత్‌.. కామన్వెల్త్‌ కోసం రెండు కేజీలు తగ్గి 50 కిలోల విభాగంలో బరిలోకి దిగింది. ఇలా ఆమె శరీర బరువును విభాగానికి అనుగుణంగా మార్చుకోవడానికి చాలా కష్టపడింది. ఇప్పుడు ఆమె లక్ష్యమంతా  2024 పారిస్ ఒలింపిక్స్. ఇక్కడా స్వర్ణం కొల్లగొట్టేందుకు మళ్లీ 50 కేజీల విభాగంలో పోటీపడతానని ఆమె చెబుతుంది.

ఐస్‌క్రీం ఇప్పుడు తినొచ్చు...

కొంతకాలంగా బ్యాక్-టు-బ్యాక్ టోర్నమెంట్‌లు, ట్రయల్స్‌లో పోరాడుతూ.. జరీన్‌  విశ్రాంతి లేకుండా గడిపింది. ఆదివారం బంగారు పతకాన్ని గెలుచుకున్న అనంతరం నిఖత్‌ అక్కడే ఉన్న ఓ వ్యక్తిని ఐస్‌క్రీమ్‌ అడిగిందంటే అర్థం అవుతోంది.. ఆమె ఇష్టమైన వాటికి ఎంతకాలంగా దూరంగా ఉందో..! ఎందుకంటే జరీన్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో  బరువు తగ్గించుకోవాల్సి రావడంతో ఐస్‌క్రీం తినాలనే కోరికను విరమించుకుంది. అయితే ఇప్పుడు తనకు ఇష్టమైన ఐస్‌క్రీంతో పాటు నిజామాబాద్‌లోని తీపి కబురులన్నీ ఆస్వాదించవచ్చు.

ఈ క్షణాన్ని ఆస్వాదిస్తా..

"జనవరి నుంచి తీరిక లేకుండా ఛాంపియన్‌షిప్‌లలో పోరాడుతూ.. శిక్షణ పొందుతున్నాను. అయితే, ఇప్పుడు నేను ఈ క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. ఇప్పటివరకు నా విజయానికి ఎప్పుడూ సంబరాలు జరుపుకోలేదు. అయితే.. ఈసారి కాస్త విశ్రాంతి తీసుకోని ఈ విజయాన్ని ఎంజాయ్‌ చేద్దాం అనుకుంటున్నా’ అని నిఖత్‌ స్వర్ణం నెగ్గాక చెప్పింది.

అమ్మకు బర్త్‌డే గిఫ్ట్‌..

నిఖత్ మూడు రోజుల క్రితం.. తన తల్లి పుట్టినరోజున ఆమెతో ​​ఉండాలనుకున్నా కుదరలేదు. కానీ ఇప్పుడు కామన్వెల్త్‌లో గెలిచిన గోల్డ్‌ మెడల్‌ని బహుమతిగా ఇవ్వడం ద్వారా ఆ లోటును భర్తీ చేయాలని భావిస్తోంది. పతకాల వేడుక నుంచి తిరిగి వచ్చిన తర్వాత జరీన్ తన కోచ్ భాస్కర్ భట్ మెడలో మెడల్‌ వేసి ఆశీస్సులు తీసుకోవడం విశేషం. "బితియా హై మేరీ. మా బంధం తండ్రీ కూతుళ్ల లాంటిది. ఇంతకంటే మంచి అనుభూతి మరొకటి ఉండదు" అని భట్ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని