వచ్చే పదేళ్లు క్రికెట్‌ ప్రపంచాన్ని ఎంటర్‌టైన్‌ చేసేది వీరిద్దరే..!: డేల్‌ స్టెయిన్‌

ట్రిస్టన్‌ స్టబ్స్‌..డెవాల్డ్ బ్రెవిస్...ఇటీవల ముగిసిన భారత టీ20లీగ్‌లో ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువ బ్యాటర్లు.

Updated : 28 Jul 2022 13:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్రిస్టన్‌ స్టబ్స్‌, డెవాల్డ్ బ్రెవిస్.. ఇటీవల ముగిసిన భారత టీ20లీగ్‌లో ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువ బ్యాటర్లు వీరు. బ్రెవిస్‌ తన మెరుపు ఇన్నింగ్స్‌లతో క్రికెట్ ప్రేమికులను అలరించాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌ మాత్రం ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలం అయ్యాడు. దీంతో ఈ కుర్రాడికి  ప్రత్యేక గుర్తింపు రాలేదు. 21 ఏళ్ల స్టబ్స్‌ ఇటీవల భారత్‌తో దిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20ల్లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అయితే బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడంతో స్టబ్స్‌ తన టాలెంట్ నిరూపించుకోవడానికి ఎదురుచూస్తూ.. వస్తున్నాడు. ఎట్టకేలకు ఇంగ్లాండ్‌తో బుధవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో తన ఆట ఎలా ఉంటుందో క్రికెట్‌ ప్రపంచానికి పరిచయం చేశాడు. కేవలం 28 బంతుల్లోనే 8 సిక్సర్లు, 2 ఫోర్లతో 72 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన  దక్షిణాఫ్రికా 86 పరుగులే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టబ్స్.. ఆరంభం నుంచి బౌండరీలు బాదుతూ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 19 బంతుల్లేనే తన తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు.

మరోవైపు సీనియర్ల బ్యాటర్‌ మిల్లర్‌ ఔట్‌ అయినా స్టబ్స్‌ దూకుడు తగ్గలేదు. వచ్చిన బంతిని వచ్చినట్టుగా స్టాండ్స్‌లోకి పంపిస్తూ ఇంగ్లిష్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఒక దశలో తన జట్టును గెలిపించేలా కనిపించాడు. అయితే సహచర బ్యాటర్లు నుంచి సహకారం అందకపోవడంతో  స్టబ్స్‌ ఒంటరి పోరాటం 19 ఓవర్లో ముగిసింది. దీంతో ఇంగ్లాండ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఉన్నంత సేపూ అభిమానులను ఎంటర్‌టైన్‌ చేసిన స్టబ్స్‌ 257.14 స్ట్రెక్‌రేట్‌తో 72 పరుగులు చేయడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌కు ఫిదా అయినా దక్షిణాఫ్రికా మాజీ స్పీడ్‌ స్టార్‌ డేల్‌ స్టెయిన్‌ కీలక దక్షిణాఫ్రికా యువ క్రికెటర్లు బ్రెవిస్‌, స్టబ్స్‌ను ఉద్దేశించి ట్విటర్‌లో ‘రాబోయే పదేళ్లు, ఆ తర్వాత కూడా క్రికెట్‌ ప్రపంచానికి ఈ ఇద్దరు వినోదాన్ని అందిస్తారు’ అని ట్వీట్‌ చేశాడు. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైఖేల్‌ వాన్‌ కూడా స్టబ్స్‌ని అభినందించాడు. స్టబ్స్‌ అర్ధశతకం చేసిన తర్వాత ముంబయి అభిమానులు సోషల్ మీడియాలో వచ్చే ఏడాది భారత టీ20 లీగ్‌లో విధ్వంసమే అని ట్వీట్లు చేశారు.

ఇప్పటికే బేబీ ఏబీగా పేరుపొందిన 19 ఏళ్ల బ్రెవిస్‌ అండర్‌-19 ప్రపంచకప్‌లో పరుగుల వరద పారించడంతో ముంబయి జట్టు మెగా వేలంలో రూ.3 కోట్లు పెట్టి మరీ అతడ్ని దక్కించుకొంది. ఇక ఇంగ్లాండ్ పేసర్‌ టైమల్‌ మిల్స్‌ గాయపడటంతో అతడి స్థానంలో స్టబ్స్‌ను ముంబయి తమ జట్టులోకి తీసుకొంది. స్టబ్స్‌ దిల్లీతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో డకౌట్‌ కాగా.. చెన్నైతో 2 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అట్టగడున నిలవడంతో నిరాశపడిన ముంబయి అభిమానులు.. వచ్చే సీజన్‌లో స్టబ్స్, బ్రెవిస్‌, టిమ్‌ డేవిడ్‌ వంటి యువ బ్యాటర్లు రాణిస్తే మరోసారి తమ జట్టు టైటిల్‌ నెగ్గుతుందని భావిస్తున్నారు.










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని