Sunrisers Hyderabad: ఈ సీజన్‌ మాకు కలిసి రాలేదు.. హైదరాబాద్‌ హెడ్‌ కోచ్‌

Eenadu icon
By Sports News Team Updated : 06 May 2025 10:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌  డెస్క్‌: ఐపీఎల్‌ (IPL) 2025 సీజన్‌లో భాగంగా సోమవారం ఉప్పల్‌ వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. తర్వాత వరుణుడి రాకతో హైదరాబాద్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాలేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్‌ కేవలం మూడింట్లో మాత్రమే విజయం సాధించి ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌ అనంతరం జట్టు ప్రధాన కోచ్‌ డానియల్‌ వెటోరి (Daniel Vettori) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘మేం ప్రతి మ్యాచ్‌ దూకుడుగా ఆడాలని అనుకోలేదు. ఈ సంవత్సరం పరిస్థితులు మేం ఊహించిన విధంగా లేవు. గత సంవత్సరం మనం చాలా హైస్కోరింగ్‌ మ్యాచ్‌లు చూశాం. కానీ ఈసారి కాస్త భిన్నంగా ఉంది. హైదరాబాద్‌ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలించలేదు. రెండు పిచ్‌లు 250+ స్కోర్లకు వీలుగా ఉంటే.. నాలుగు పిచ్‌లు ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలంగా ఉన్నాయి. అదే సమయంలో స్పిన్నర్లకు సహకరించలేదు. కొత్త బంతిని కొట్టడం బ్యాటర్లకు ఇబ్బందిగా మారింది. బంతి బ్యాట్‌ మీదకు రాలేదు’’ అని వెటోరి వివరించాడు.

అలాగే సోమవారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ విషయాన్ని కూడా ప్రస్తావించాడు. ‘‘దిల్లీతో మ్యాచ్‌కు ముందు మేం 10 మ్యాచుల్లో కేవలం మూడు మాత్రమే గెలిచాం. కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల్లో సోమవారం జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. మా టీమ్‌ అద్భుతంగా దిల్లీని 133 పరుగులకు కట్టడి చేసింది. కానీ వరుణుడు మా ఆశలపై నీళ్లు చల్లాడు. మొత్తానికి ఈ సీజన్‌ మాకు కలిసిరాలేదు. మా ఆటగాళ్ల ప్రదర్శనలో నిలకడ లోపించింది. మహ్మద్‌ షమీకి (Mohammed Shami) ఇది నిజంగా కఠినమైన సీజన్‌. కానీ అతడు మంచి ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నించాడు’’ అని డానియల్‌ వెటోరి తెలియజేశాడు.

Tags :
Published : 06 May 2025 10:27 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు