David Warner: మిచెల్‌కు కౌంటర్‌.. నా తల్లిదండ్రుల గొప్ప పెంపకంలో ఎదిగా: వార్నర్

ఒకప్పుడు ఆసీస్‌ జట్టు (Cricket Australia) కోసం కలిసి ఆడిన వారిద్దరూ తాజాగా మాటల యుద్ధానికి దిగారు. ప్రస్తుతం ఒకరు మాజీ కాగా.. మరొకరు ఓపెనర్‌గా కొనసాగుతున్నారు.

Updated : 08 Dec 2023 15:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసీస్‌ మాజీ ఆటగాడు మిచెల్ జాన్సన్ తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ జట్టు ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ స్పందించాడు. ‘‘ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉంది. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముందుకు సాగడమే నాకు తెలుసు. తప్పకుండా అద్భుతమైన టెస్టు ముగింపు లభిస్తుందని భావిస్తున్నా. నా తల్లిదండ్రుల గొప్ప పెంపకంలో ఎదిగాను. ప్రతి రోజూ కష్టపడుతూనే ఉన్నాను. వారు అదే నేర్పారు. అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాక.. చాలా విమర్శలు ఎదుర్కోక తప్పదు. అందులోనూ కొన్ని సానుకూల అంశాలు ఉంటాయి. ఏది ముఖ్యమైందనేది తెలుసుకోవాలి. క్రికెట్‌కు మద్దతుగా నిలిచే అభిమానులు చాలా మంది ఉంటారు. ఇది అద్భుతమైన అనుభవం’’ అని వార్నర్‌ వ్యాఖ్యానించాడు. 

టెస్టులకు వీడ్కోలు చెబుతానని గతంలోనే వార్నర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అతడికి ‘హీరో సెండాఫ్‌’ ఇవ్వడానికి పాక్‌తో తొలి టెస్టుకు వార్నర్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. అయితే, ఇలాంటి ఘనతను అందుకోవడానికి బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన వార్నర్‌కు అర్హత లేదంటూ మిచెల్ జాన్సన్ వ్యాఖ్యానించాడు. ఇంతకుముందు వార్నర్‌ను ఉద్దేశిస్తూ ఓ పత్రికలో జాన్సన్ వ్యాసం కూడా రాశాడు. వార్నర్‌ తనకు వ్యక్తిగతంగా పంపించిన మెసేజ్‌ వల్ల ఆ కథనం రాయాల్సి వచ్చిందని మిచెల్‌ వెల్లడించాడు. దీంతో అతడికి వార్నర్‌ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు. 

వార్నర్‌కు మద్దతుగా ప్యాట్ కమిన్స్‌..

డేవిడ్ వార్నర్‌కు ఆసీస్‌ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ మద్దతుగా నిలిచాడు. గతేడాది కమిన్స్‌పైనా మిచెల్‌ జాన్సన్ విమర్శలు గుప్పించడం గమనార్హం. ‘‘మేం ఒకరికొకరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. గత కొన్నేళ్లుగా కలిసి ఆడాం. డేవిడ్‌ వార్నర్ లేదా స్టీవ్‌ స్మిత్‌కు సుదీర్ఘమైన కెరీర్‌ ఉంది. మిచెల్‌ జాన్సన్‌ వ్యాఖ్యల వెనుక మర్మమేంటో తెలియదు. అతడే చెప్పాలి. ఇప్పుడు ఆసీస్‌ క్రికెట్‌కు సంబంధించి అద్భుతమైన క్షణాలను ఆస్వాదించాల్సిన సమయం’’ అని కమిన్స్‌ తెలిపాడు. 

వారిద్దరు చర్చించుకోవాలి: పాంటింగ్‌

ఎలాంటి వివాదామైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ తెలిపాడు. మిచెల్-డేవిడ్ కలిసి మాట్లాడుకోవాలని సూచించాడు. దాని కోసం తాను మధ్యవర్తిగా ఉండటానికైనా సిద్ధమని వెల్లడించాడు. ‘‘ ఇద్దరి వ్యవహారంలో ఏదొక దశలో నేను కలగజేసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. మీడియా వేదికగా కాకుండా.. వారిద్దరిని ఓ రూమ్‌లో కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం నడిపి సమస్యను పరిష్కరించేందుకు నేను సిద్ధమే. ఇదంతా గత ఆరేడు నెలల కిందట యాషెస్ సిరీస్‌ ఎంపిక సమయంలో జరిగిన వివాదంలా కనిపిస్తోంది. వారిద్దరూ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటే చాలు’’ అని రికీ పాంటింగ్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని