IND vs AUS: ‘డెత్‌’ భయం పోవాలి.. సిరీస్‌ రేస్‌లో నిలవాలి!

టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఎలాంటి ఫలితం రాకూడదని క్రికెట్ అభిమానులు భావించారో... అలాంటిదే టీమ్‌ఇండియాకు ఎదురైంది. ఆసీస్‌తో స్వదేశంలో...

Updated : 22 Sep 2022 20:30 IST

రేపే ఆసీస్‌-భారత్‌ మధ్య కీలకమైన రెండో టీ20

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఎలాంటి ఫలితం రాకూడదని క్రికెట్ అభిమానులు భావించారో... అలాంటిదే టీమ్‌ఇండియాకు ఎదురైంది. ఆసీస్‌తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌లో ఆధిపత్యం ప్రదర్శించి ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాల్సిన భారత్‌ జట్టు.. పేలవమైన బౌలింగ్‌ ప్రదర్శనతో భారీ స్కోరు సాధించినా ఆసీస్‌ చేతిలో చిత్తవ్వక తప్పలేదు. ఆసియా కప్‌ నుంచి కొనసాగుతున్న ‘డెత్‌’ ఓవర్ల ఆందోళనను అధిగమించాలి. అయితే స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం పెద్ద లోటుగా భావిస్తున్న క్రమంలో రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆసీస్‌ 1-0 ఆధిక్యం సాధించిన మూడు టీ20ల సిరీస్‌ రేసులో నిలవాలంటే  శుక్రవారం జరిగే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా గెలిచి తీరాల్సిందే.

డెత్‌ ఓవర్లు పెద్ద మైనస్‌.. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 208 పరుగులు చేసినా.. ఓటమి తప్పలేదంటే బౌలింగ్‌ ప్రదర్శన ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లోనూ భారత పరిస్థితి ఇదే. బ్యాటర్లు కష్టపడి సాధించిన దానికి ప్రతిఫలం దక్కకుండా చేశారు. మరీ ముఖ్యంగా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌తోపాటు భారీ అంచనాలు పెట్టుకొన్న హర్షల్‌ పటేల్ ఘోరంగా విఫలమయ్యారు. వీరిద్దరూ కలిసి తమ ఎనిమిది ఓవర్లలో 101 పరుగులను సమర్పించారు. అక్షర్‌ పటేల్ మినహా మిగతా బౌలర్లు ఉమేశ్‌ యాదవ్‌, చాహల్,  హార్దిక్‌ పెద్దగా రాణించలేదు. ఉమేశ్‌ రెండు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసినా.. 27 పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలో కీలక బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా రెండో మ్యాచ్‌లో బరిలో దిగితే పేస్ దళం కాస్త బలోపేతమవుతుంది. మిడిల్‌, డెత్‌ ఓవర్లలో కట్టుదిట్టంగా ఒకరు బౌలింగ్‌ చేసినా ప్రయోజనం భారీగా ఉంటుంది. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చేందుకు బుమ్రా సిద్ధంగా ఉన్నాడని టీమ్‌ఇండియా బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్ తెలిపాడు. 

ఫీల్డింగూ మారాలి..

ప్రపంచకప్‌లో ప్రతి విభాగం రాణిస్తేనే కప్‌ సాధించే అవకాశం దక్కుతుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ అద్భుతంగా ఉన్నప్పటికీ ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు, అనవసర పరుగులు ఇచ్చేస్తే ఫలితం శూన్యం. ఆసీస్‌తో తొలి టీ20లోనూ ఇలానే మూడు క్యాచ్‌లను టీమ్‌ఇండియా ఫీల్డర్లు వదిలేశారు. అందులోనూ కీలక ఇన్నింగ్స్‌లను ఆడిన కామెరూన్ గ్రీన్ (61), స్టీవ్‌ స్మిత్ (35), మ్యాథ్యూ వేడ్‌ (45*) క్యాచ్‌లను నేలపాలు చేశారు. అక్షర్‌ పటేల్, కేఎల్ రాహుల్, హర్షల్‌ చేతిలో పడిన క్యాచ్‌లను వదిలేశారు. మ్యాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను హర్షల్‌ వదిలేయడంతో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. అదీనూ హర్షల్‌ బౌలింగ్‌లోనే కావడం విశేషం. అంతకుముందు బంతికే సిక్స్‌ కొట్టిన వేడ్ కీలకమైన 18వ ఓవర్‌లో మొత్తం 22 పరుగులను రాబట్టి.. విజయాన్ని తమ వైపు తిప్పుకొన్నాడు. అందుకే ప్రతి పరుగు, ప్రతి మ్యాచ్‌ చాలా కీలకం.. అలాగే డీఆర్‌ఎస్‌ను తీసుకోవడంలోనూ సీనియర్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్ వెనకడుగు వేయడం సరైంది కాదని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఓవరాల్‌గా బ్యాటింగ్‌ ఓకే.. కానీ

ఆసీస్‌తో తొలి టీ20లో భారత్‌ భారీ స్కోరే సాధించింది. జట్టు పరంగా ప్రదర్శన ఓకే కానీ.. వ్యక్తిగతంగా అయితే కెప్టెన్‌ రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (2), దినేశ్‌ కార్తిక్ (6) అక్షర్‌ పటేల్ (6) నిరాశపరిచారు. మరీ ముఖ్యంగా దినేశ్‌ కార్తిక్‌ హార్డ్‌హిట్టర్‌ పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. చివర్లో 16వ ఓవర్‌ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కార్తిక్‌.. దూకుడుగా ఆడలేకపోయాడు. కేవలం ఐదు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసి వికెట్ల ముందు దొరికిపోయాడు. రెండో మ్యాచ్‌లోనైనా అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే సంజూ శాంసన్‌ను తీసుకోకుండా కార్తిక్‌, పంత్‌ను తీసుకోవడంపై విమర్శలు ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. రోహిత్ కూడా కాస్త సంయమనం పాటించి క్రీజ్‌లో నిలదొక్కుకొని బ్యాటింగ్‌ చేయాలని పలువురు మాజీలు సూచించారు. విరాట్‌ కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉంది. పాండ్య, సూర్యకుమార్‌, కేఎల్ రాహుల్‌ రాణించడం సానుకూలాంశం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని