GT vs CSK: 19వ ఓవర్‌ ఫోబియా.. మళ్లీ పునరావృతమవుతోందా..?

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2023) 16వ సీజన్‌ తొలి మ్యాచ్‌ను చూశాక అభిమానుల్లో మెదిలే తొలి ప్రశ్న ఒకటే.. అంతర్జాతీయ మ్యాచుల్లో భారత బౌలర్లను ఆందోళనకు గురి చేసిన ఆ ఫోబియా మరోసారి వచ్చేసిందా..? ఎందుకంటే కీలక సమయంలో పరుగులు ఇవ్వడంతో అనుమానం రావడం సహజమే కదా.. ఇంతకీ ఏంటంటే..?

Updated : 01 Apr 2023 11:26 IST

ఇంటర్నెట్ డెస్క్: 11 ఓవర్లకు 106/2... ఇదీ ఐపీఎల్‌ 16వ సీజన్‌లో (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ (GT vs CSK) స్కోరు. లక్ష్యం 179 పరుగులే కావడంతో 9 ఓవర్లలో 73 పరుగులంటే పెద్ద ఇబ్బందేం కాదు. అయితే చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేయడంతో గుజరాత్‌ లక్ష్యం 18 బంతుల్లో 30 పరుగులకు చేరింది. 18వ ఓవర్‌ వేసిన యువ బౌలర్‌ హంగార్గేకర్‌ కేవలం 7 పరుగులే ఇచ్చి వికెట్‌ తీశాడు. దీంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 23కి చేరింది. అనుభవజ్ఞుడైన దీపక్ చాహర్‌ కీలకమైన 19వ ఓవర్‌ వేయడానికి వచ్చాడు. ఆ సమయంలో క్రీజ్‌లో రషీద్ ఖాన్‌, రాహుల్‌ తెవాతియా ఉన్నారు. 

🏏 తొలి బంతిని అద్భుతంగా వేసిన దీపక్‌ పరుగులేమీ ఇవ్వలేదు. 

🏏 అయితే రెండో బంతి లెగ్‌సైడ్‌ వేయడంతో తెవాతియా ప్యాడ్లను తాకి లెగ్‌బైస్‌ రూపంలో బౌండరీకి వెళ్లిపోయింది. 

🏏 మూడో బంతికి సింగిల్‌ మాత్రమే ఇచ్చాడు. దీంతో రషీద్‌ ఖాన్‌ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. హమ్మయ్య... మ్యాచ్‌పై చెన్నై పట్టు సాధించేలా ఉందని అంతా అనుకున్నారు.

🏏 తీరా ఈ మ్యాచ్‌లో ఎదుర్కొన్న మొదటి బాల్‌నే రషీద్‌ ఖాన్‌ సిక్స్‌గా మలిచాడు. చెన్నై అభిమానుల్లో నిరాశ మొదలైంది.

🏏 ఐదో బంతిని కూడా రషీద్‌ బౌండరీ బాదేశాడు. దీంతో మ్యాచ్‌పై ఆశలు కరిగిపోయాయి. అయితే చివరి బంతికి పరుగులేమీ రాలేదు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

దీంతో కీలకమైన 19వ ఓవర్‌లో ఏకంగా 15 పరుగులు వచ్చేయడంతో విజయానికి ఇంకా 6 బంతుల్లో కేవలం 8 రన్స్‌ మాత్రమే గుజరాత్‌కు అవసరం. దీంతో చెన్నైపై ఒత్తిడి పెరిగిపోయింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన తుషార్‌ దేశ్‌ పాండే బౌలింగ్‌లో తెవాతియా సిక్స్‌, ఫోర్‌ బాదేసి గుజరాత్‌ను గెలిపించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లోనూ బౌలర్లను 19వ ఓవర్‌ ఫోబియా వెంటాడుతుందా..? అనే అనుమానాలు అభిమానుల్లో మెదిలాయి. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ భారత బౌలర్లు ఇలా 19వ ఓవర్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇదే కొనసాగితే మాత్రం భారీ స్కోరు సాధించినా సరే జట్టును గెలిపించడంలో విఫలం కావడం ఖాయం. చెన్నై బ్యాటింగ్‌ చేసినప్పుడు 19వ ఓవర్‌ వేసిన షమీ 10 పరుగులు ఇచ్చినప్పటికీ.. కీలకమైన శివమ్‌ దూబే వికెట్‌ తీశాడు. అయితే, లక్ష్య ఛేదన సమయంలో కీలకమైన 19వ ఓవర్‌లో భారీగా పరుగులు ఇవ్వడం సరైంది కాదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీపక్‌ చాహర్‌ వంటి సీనియర్‌ బౌలర్‌ మరింత బాధ్యతగా బౌలింగ్‌ చేయాల్సిన అవశ్యకత ఉంది. ఈ ఓవర్‌కు ముందు దీపక్ చాహర్‌ వేసిన 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చాడు. వికెట్‌ తీయకపోయినా కట్టుదిట్టంగానే బౌలింగ్‌ వేశాడు. కానీ, ఆ 19వ ఓవర్‌లో 15 పరుగులు ఇవ్వడంతో అప్పటివరకు చేసిన ప్రదర్శన వెనుకబడిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని