Deepak Chahar: ఆయన్ను సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాం: దీపక్ చాహర్

వైద్యపరమైన అత్యవసర పరిస్థితి కారణాలతో దీపక్ చాహర్ (Deepak Chahar) ఆసీస్‌తో ఐదో టీ20లో ఆడలేదు. దీంతో అభిమానులంతా ఏమైందోనని కంగారు పడ్డారు. దానికి దీపక్ చాహర్ స్పందించాడు.

Updated : 06 Dec 2023 13:46 IST

ఇంటర్నెట్ డెస్క్: చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి భారత ఆటగాడు దీపక్ చాహర్‌ (Deepak Chahar) పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లోకి వచ్చాడు. మూడు, నాలుగో మ్యాచ్‌లను ఆడాడు. అనూహ్యంగా ఐదో టీ20కి దూరమయ్యాడు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్‌ మ్యాచ్‌కు ముందు చెప్పాడు. తన తండ్రిని ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చిందని తాజాగా దీపక్ చాహర్ వెల్లడించాడు. పదో తేదీ నుంచి దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్‌ఇండియా వెళ్లనుంది. తొలుత టీ20 సిరీస్‌ను ఆడనుంది. దీపక్ చాహర్‌ కూడా ఈ సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే, భారత జట్టుతో కలిసి వెళ్లే స్థితిలో దీపక్ చాహర్‌ లేడు. ప్రస్తుతం ఆసుపత్రిలో తండ్రి వద్ద దీపక్‌ చాహర్‌ ఉన్నాడు.

‘‘మేం సరైన సమయానికి మా నాన్నను ఆసుపత్రికి తీసుకెళ్లాం. లేకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారేది. ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. చాలా మంది అభిమానులు ఆసీస్‌తో ఐదో టీ20 ఎందుకు ఆడకుండా మధ్యలోనే వెళ్లిపోయావు? అని అడిగారు. కారణం ఇదే. మా నాన్న ఆరోగ్యం చాలా ముఖ్యం. నన్ను ప్లేయర్‌ను చేయడానికి ఆయన ఎంతో శ్రమ పడ్డారు. అలాంటి తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే మైదానంలో మనసు పెట్టి ఆడలేను. అందుకే, వెంటనే ఇక్కడికి వచ్చేశా. ఆయన్ను వదిలి ఎక్కడికీ వెళ్లలేను. ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడిన తర్వాత దక్షిణాఫ్రికా వెళ్లేందుకు ప్రయాణమవుతా. ఇప్పటికే కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్, సెలక్టర్లతో మాట్లాడా’’ అని దీపక్ చాహర్‌ తెలిపాడు. 

డిసెంబర్‌ 10 నుంచి జనవరి 7వ తేదీ వరకు దక్షిణాఫ్రికాలో భారత్‌(SA vs IND) పర్యటించనుంది. తొలుత మూడు టీ20ల సిరీస్‌ జరగనుంది. ఆ తర్వాత వన్డే, టెస్టు సిరీస్‌లు ఉంటాయి. టీ20 సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపడతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని