INDW vs ENGW: అప్పటికే డీన్‌ని హెచ్చరించాం.. నిబంధనల ప్రకారమే అలా చేశాం: దీప్తి శర్మ

ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ ఛార్లీ డీన్‌ను రనౌట్‌ చేసి ఉత్కంఠభరిత పోరులో భారత మహిళల జట్టు విజయం సాధించిన విషయం...

Published : 26 Sep 2022 16:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ ఛార్లీ డీన్‌ను రనౌట్‌ చేసి ఉత్కంఠభరిత పోరులో భారత మహిళల జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. సీనియర్‌ బౌలర్‌ ఝులన్‌ గోస్వామికి ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే డీన్‌ను భారత బౌలర్‌ దీప్తి శర్మ రనౌట్ చేసిన విధానం (మన్కడింగ్‌) మరోసారి వివాదస్పదమైంది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఇంగ్లాండ్‌కు మద్దతుగా పలువురు వ్యాఖ్యానించారు. అయితే దీప్తి చేసిన దాంట్లో తప్పేమీ లేదని మరికొందరు వాదించారు. ఈ క్రమంలో గత శనివారం జరిగిన సంఘటనపై దీప్తి శర్మ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ వివరణ ఇచ్చింది. 

‘‘ఇది మా ప్రణాళికలో ఓ భాగం. ఎందుకంటే అప్పటికే చాలాసార్లు ఛార్లీ డీన్‌  క్రీజ్‌ను వదిలేసి బయటకు వస్తోంది. బౌలర్‌ బంతిని విడుదల చేయకముందే దాదాపు రెండు అడుగులు వెళ్లిపోయింది. దీంతో ఆమెను హెచ్చరించాం. అంపైర్లకు కూడా పరిస్థితిని వివరించాం. అయినప్పటికీ మళ్లీ ఛార్లీ అలా ముందుకు వెళ్లడంతో మరో అవకాశం లేక రనౌట్‌ చేశా. ఇదంతా నియమ నిబంధనలతోనే చేశాం‘’ అని దీప్తి శర్మ స్పష్టం చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌ తొలుత 169 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 118 పరుగులకే 9 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఛార్లీ డీన్‌ (47) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. ఈ క్రమంలో బౌలింగ్‌ చేసేటప్పుడు పదే పదే క్రీజ్‌ను వదిలి బయటకు వస్తుండటంతో దీప్తి శర్మ రనౌట్‌ చేసింది. దీంతో 156 పరుగులకే ఆలౌటైన ఇంగ్లాండ్‌ ఓడిపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ 3-0 తేడాతో కైవసం చేసుకొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని