Rohit Sharma: దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్‌ మండిపాటు

స్టార్‌ స్పోర్ట్స్‌పై రోహిత్‌ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.

Published : 20 May 2024 00:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మైదానంలో ఆటగాళ్ల మధ్య ఏ చిన్న విషయం చోటుచేసుకున్నా.. కెమెరాలు రికార్డు చేస్తున్నాయి. ఈ విషయం లైవ్‌లో బయటకి వస్తుండటంతో ఆటగాళ్లు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై ముంబయి మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని ఎక్స్‌(ట్విటర్‌)లో అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌కు ఈ విషయం వివరించినా.. రికార్డ్ చేసి ప్రసారం చేసిందని రోహిత్‌ మండిపడ్డాడు. ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్‌ ఇవ్వాలని చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు.. అభిమానులు, క్రికెటర్ల మధ్య బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని పేర్కొన్నాడు. లఖ్‌నవూతో ఇటీవల జరిగిన మ్యాచ్‌ సందర్భంగా  కెమెరామెన్‌కు ఈ విషయాన్ని తెలిపినట్లు రోహిత్ వెల్లడించాడు.

మైదానంలో కోల్‌కతా అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌తో రోహిత్‌ జరిపిన సంభాషణ ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అందులో ముంబయి జట్టుతో తన రిలేషన్‌షిప్‌ గురించి మాట్లాడుతూ ‘‘భాయ్‌ నాదేముంది.. ఇదే చివరిది’’ అన్నట్లు వినిపించింది. దీంతో రోహిత్‌ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం జరిగింది. చివరికి ఆ వీడియోను కేకేఆర్‌ సోషల్‌ మీడియా ఖాతా నుంచి డిలీట్‌ చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇటీవల లఖ్‌నవూతో ఆడిన చివరి లీగ్‌ మ్యాచ్‌కు ముందు భారత మాజీ ఆటగాడు ధవళ్ కులకర్ణితో మాట్లాడుతూ రోహిత్ కనిపించాడు. ఈ క్రమంలో కెమెరామెన్‌ వీడియో తీయడాన్ని గమనించాడు. ఇప్పటికే కోల్‌కతా కోచ్ అభిషేక్ నాయర్‌తో సంభాషణ వైరల్‌గా మారిన సంగతి గుర్తుకొచ్చి.. సదరు కెమెరామన్‌కు రోహిత్ ఓ విజ్ఞప్తి చేశాడు. ‘‘బ్రదర్‌ ప్లీజ్‌ ఆడియోను క్లోజ్‌ చేయి. ఇప్పటికే ఒకటి నెట్టింట వైరల్‌గా మారిపోయింది. దీంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి’’ అని అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు