IND vs ENG: ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు.. భరత్‌ బదులు ధ్రువ్‌.. సర్ఫరాజ్‌ వెయిటింగ్‌లోనేనా!

ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు కోసం భారత్ తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తోంది. రాజ్‌కోట్‌ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది.

Published : 12 Feb 2024 18:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గురువారం నుంచి రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌ - ఇంగ్లాండ్ (IND vs ENG) జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే మిగతా మూడు టెస్టులకు భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. స్పిన్నర్లకు, బ్యాటర్లకు సమానంగా సహకరించే రాజ్‌కోట్‌ పిచ్‌పై భారత్‌కు మంచి రికార్డే ఉంది. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లోనూ ఓటమి చూడలేదు. ఒక డ్రా, ఒక భారీ విజయంతో ఉంది. అయితే, తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. 

బ్యాటింగ్‌లో విఫలమవుతున్న వికెట్ కీపర్‌ కేఎస్ భరత్‌ను (KS Bharat) తప్పించి యువ ఆటగాడు ధ్రువ్‌ జురెల్‌ను తీసుకొనే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. మొదటి టెస్టులో కాస్త పోరాటపటిమ చూపిన భరత్‌.. సొంత మైదానం వైజాగ్‌లో మాత్రం తేలిపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలం కావడం మేనేజ్‌మెంట్‌ను నిరుత్సాహానికి గురి చేసింది. దీంతో అతడిని పక్కన పెట్టేందుకు ఓ నిర్ణయానికొచ్చినట్లు క్రీడా వర్గాల సమాచారం. రెండో టెస్టులో సెంచరీ చేసిన గిల్‌ వేటు నుంచి బయటపడ్డాడు. పెద్దగా ఆకట్టుకోని రజత్‌కూ మరో అవకాశం ఖాయమే.  ఒకవేళ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఫిట్‌నెస్‌ నిరూపించుకోకపోతే మాత్రం సర్ఫరాజ్‌, కుల్‌దీప్‌ తుది జట్టులోకి వస్తారు. 

నాలుగో టెస్టుకు బుమ్రాకి విశ్రాంతి?

మూడో టెస్టులో భారత్ విజయం సాధిస్తే అప్పుడు సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధిస్తుంది. దీంతో పని ఒత్తిడి నుంచి జస్‌ప్రీత్ బుమ్రాకి (Bumrah) కాస్త విరామం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రాంచీ వేదికగా జరిగే నాలుగో టెస్టుకు విశ్రాంతినిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆకాశ్ దీప్‌ను ఎంపిక చేసినప్పటికీ తుది జట్టులో అవకాశం రావడం కష్టమే. ముకేశ్‌ కుమార్‌, సిరాజ్‌ పేసర్లుగా దిగుతారు. భారత పిచ్‌లపై ఇద్దరి కంటే ఫాస్ట్‌ బౌలర్లను ఆడించే సందర్భాలూ చాలా తక్కువ. ధర్మశాల వేదికగా జరిగే చివరి మ్యాచ్‌ నాటికి బుమ్రా వస్తాడు. భారత క్రికెట్‌కు సేవలు అందించినందుకు సొంత మైదానం రాజ్‌కోట్‌ వేదికగా జరగనున్న మూడో టెస్టు సందర్భంగా జడేజా, పుజారాకు బీసీసీఐ సన్మానం చేయనుంది. 

భారత్‌ తుది జట్టు (అంచనా): 

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, రజత్‌ పటీదార్‌, కేఎల్ రాహుల్ (ఫిట్‌నెస్‌ సాధిస్తే), ధ్రువ్‌ జురెల్, రవీంద్ర జడేజా (ఫిట్‌నెస్‌ సాధిస్తే), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్‌/ముకేశ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని