MS Dhoni: ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?

ధోనీ ఒంటి చేత్తో సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌లను ఎన్నోసార్లు గెలిపించాడు. అయితే.. ఆర్సీబీతో కీలకమైన మ్యాచ్‌లో అతడు కొట్టిన ఓ భారీ సిక్సే ఆ జట్టు ఓటమికి దారి తీసిందంటూ పలువురు విశ్లేషిస్తున్నారు.

Published : 19 May 2024 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో.. ఆర్సీబీ vs చెన్నై మ్యాచ్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఫైనల్‌ను తలపించేలా సాగిన ఈ పోరులో చివరికి బెంగళూరు విజయం సాధించి.. ప్లేఆఫ్స్‌లోకి అగుడుపెట్టింది. దీంతో ఐదు సార్లు టైటిల్‌ గెలిచిన జట్టు.. ఈ సారి టాప్‌ 4లోకి చేరకుండానే వెనుదిరిగింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపు, చెన్నై ఓటమికి మధ్య ఓ ఆసక్తికర అంశం చర్చలోకి వచ్చింది.

20వ ఓవర్‌లో ధోని కొట్టిన సిక్స్‌ కారణంగానే బెంగళూరు గెలిచిందా..? అంటే పలువురు అవుననే అంటున్నారు. మహీ సిక్స్‌ కొడితే మ్యాచ్‌ గెలవాలి.. కానీ ఓటమికి కారణమేంటని అనుకుంటున్నారా.. ఇక్కడే ఓ విషయం ఉంది. చెన్నై క్వాలిఫై కావడానికి ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు కొట్టాలి. చివరి ఓవర్‌ను యశ్‌ దయాల్‌ వేశాడు. తొలి బంతిని యార్కర్‌ వేయడానికి ప్రయత్నించాడు. అయితే బంతి తడిగా ఉండటంతో అది లోఫుల్‌టాస్‌గా పడింది. ధోనీ తన బలాన్నంతా ఉపయోగించి దానిని 110 మీటర్ల భారీ సిక్స్‌గా మలిచాడు. అది ఫైన్‌లెగ్‌లో స్టేడియం రూఫ్‌టాప్‌పైకి వెళ్లింది. దీంతో మరో బంతితో ఓవర్‌ను కొనసాగించారు.

ఇదే ఆర్సీబీకి మేలు చేసింది. ఆ బంతి డ్రైగా ఉండటంతో యశ్‌ దయాల్‌కు పట్టు దొరికింది. మొదటి బంతికంటే మెరుగ్గా ఆ తర్వాత బాల్స్‌ సంధించగలిగాడు. దీంతో రెండో బంతికే ధోనీ వికెట్‌ దక్కింది. ఆ తర్వాత ఒక్క పరుగు మాత్రమే ఇవ్వడంతో.. చెన్నై 191 వద్దే ఆగిపోయింది. విజయం బెంగళూరు వైపు నిలిచింది. 

ఇదే అంశంపై మ్యాచ్‌ అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో దినేశ్‌ కార్తిక్‌ స్పందించాడు. ‘ధోని స్టేడియం ఆవలకు కొట్టిన సిక్సే ఈ మ్యాచ్‌లో గొప్ప విషయం. ఆ కారణంగానే మేం కొత్త బంతిని పొందాం. మెరుగ్గా బంతులు వేశాం’’ అంటూ వెల్లడించాడు. ఇక టోర్నీ మొదట్లో ప్లేఆఫ్స్‌పై ఎలాంటి ఆశలు లేని బెంగళూరు.. చివర్లో పుంజుకుని అనూహ్యంగా టాప్‌ 4లోకి చేరడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని