IND vs SA: దక్షిణాఫ్రికాతో సిరీస్‌.. వారిద్దరి మధ్య డైరెక్ట్‌ షూటౌట్: భారత మాజీ క్రికెటర్

భారత జట్టులో (Team India) ఓపెనర్లకు కొదవేం లేదు. అయితే, తుది జట్టులో ఎవరికి స్థానం దక్కుతుందనేది ఆసక్తికరం. టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్ కెప్టెన్సీ చేపడతాడని తెలుస్తోంది. దీంతో అతడికి జోడీగా ముగ్గురు ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అందులోనూ ఇద్దరికి దక్షిణాఫ్రికాతో సిరీస్‌ అత్యంత కీలకం కానుంది.

Updated : 07 Dec 2023 12:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో (IND vs AUS) టాప్‌ స్కోరర్‌ అయిన రుతురాజ్‌ గైక్వాడ్‌కు దక్షిణాఫ్రికా పర్యటనలోనూ (IND vs SA) చోటు దక్కింది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ జట్టులో స్థానం సంపాదించాలంటే దక్షిణాఫ్రికాతో సిరీస్‌ అత్యంత కీలకం. అయితే, అతడికి పోటీగా మరో యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ కూడా బరిలోకి దిగుతున్నాడు. దీంతో తుది జట్టులో ఎవరికి అవకాశం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్‌ వీరిద్దరి మధ్య ‘షూట్‌ ఔట్’లాంటిదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.

‘‘రుతురాజ్‌ గైక్వాడ్‌కు గిల్ నుంచి తీవ్ర పోటీ తప్పదు. ఎందుకంటే గిల్ అన్ని ఫార్మాట్లలో ఆడే సత్తా ఉన్న ప్లేయర్. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా టీ20 వరల్డ్‌ కప్‌లో ఆడతాడని తెలుస్తోంది. కాబట్టి, అతడికి జోడీగా ఎవరిని తీసుకుంటారనే ప్రశ్న తలెత్తడం సహజమే. అందుకే, ప్రతి మ్యాచ్‌లోనూ రాణించాల్సిన అవసరం గిల్, రుతురాజ్‌కు ఉంది. పరుగులు చేస్తూ ఉంటేనే వరల్డ్ కప్‌ స్క్వాడ్‌లో చోటు దక్కే అవకాశాలు మెరుగువుతూ ఉంటాయి. వచ్చే టీ20 సిరీస్‌లో రుతురాజ్‌-గిల్‌ మధ్య షూటౌట్‌ తప్పదు’’ అని చోప్రా విశ్లేషించాడు.

వరల్డ్‌ కప్‌ను కోల్పోవడం బాధాకరమే.. కానీ: గిల్

‘‘ఈ ఏడాది వ్యక్తిగతంగా మంచి ప్రదర్శనే చేశా. కానీ, వరల్డ్‌ కప్‌ను మిస్‌ కావడం అత్యంత బాధాకరం. కానీ, ఆ బాధను పోగొట్టేలా చేయడానికి మరి కొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్‌ రానుంది. తప్పకుండా విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తాం. అలాగే కీలకమైన టెస్టు సిరీస్‌లు ఉన్నాయి. దక్షిణాప్రికా పర్యటనకు సిద్ధమవుతున్నాం. ఆసీస్‌, ఇంగ్లాండ్‌తోనూ ఆడాల్సి ఉంది. ఆ జట్ల నుంచి కఠిన సవాల్‌ తప్పదు. ఇక ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌ కావడం ఆనందంగానే ఉంది. అదే సమయంలో మరింత బాధ్యతలు నా మీద ఉన్నాయి. జట్టులోని అనుభవజ్ఞుల నుంచి నేర్చకుంటూ ముందుకు సాగుతా’’ అని శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని