IND vs AUS: 10 పరుగులే చేసినా రికార్డు సృష్టించాడు.. వాళ్లు ఈ సిరీస్‌లో ప్రభావం చూపారు: వేడ్

ఆసీస్‌తో జరిగిన ఐదో టీ20లో భారత బ్యాటర్ రుతురాజ్‌ గైక్వాడ్ (Ruturaj Gaikwad) 10 పరుగులే చేసినా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

Published : 04 Dec 2023 10:56 IST

ఇంటర్నెట్ డెస్క్:  ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌ను టీమ్ఇండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి టీ20లో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ (Matthew Wade) మాట్లాడాడు. భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశామని, కానీ బ్యాటింగ్‌లో చివరి ఓవర్లలో ధాటిగా ఆడలేకపోయామని వేడ్ పేర్కొన్నాడు. ‘‘మేము చాలా బాగా బౌలింగ్ చేశాం.  భారత్‌ను భారీ స్కోరు చేయకుండా నిలువరించాం. కానీ, బ్యాటింగ్‌లో చివరి ఐదారు ఓవర్లు నిరాశపరిచాం. ఈ సిరీస్‌ను మేం 3-2తో ముగిస్తే బాగుండేది. మేం మంచి క్రికెట్ ఆడాం. కొన్ని తప్పిదాలు చేశాం. ఈ సిరీస్‌తో చాలా నేర్చుకున్నాం. తన మొదటి మ్యాచ్‌లో విఫలమైన మెక్‌డెర్మట్‌ ఈ మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. బెరెండార్ఫ్‌, డ్వార్షిస్‌, తన్వీర్ సంఘా వంటి కుర్రాళ్లు ఈ సిరీస్‌లో ప్రభావాన్ని చూపారు. టీ20 ప్రపంచ కప్ కోసం ఎదురుచూస్తున్నా. నేను ఎక్కువగా టిమ్ డేవిడ్, స్టాయినిస్‌తో కలిసి ఆడాల్సి ఉంటుంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం నా బాధ్యత’’ అని మాథ్యూ వేడ్ వివరించాడు.


రికార్డు సృష్టించిన రుతురాజ్ 

ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత బ్యాటర్ రుతురాజ్‌ గైక్వాడ్ (Ruturaj Gaikwad) అదరగొట్టాడు. చివరి మ్యాచ్‌లో గైక్వాడ్ 10 పరుగులకే ఔటైనా మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన కనబర్చాడు. ఈ సిరీస్‌లో మొత్తం 55.75 సగటుతో 223 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఆసీస్‌పై ఓ టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2021లో మార్టిన్ గప్తిల్‌ (న్యూజిలాండ్) ఐదు మ్యాచ్‌ల్లో 218 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తర్వాత ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా రుతురాజ్‌ గైక్వాడ్ నిలిచాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని