Vizag: అంధుల ప్రపంచకప్‌ జట్టుకు మన్యం బాలిక ఎంపిక

భారత మహిళల అంధుల క్రికెట్‌ టీమ్‌కు ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన బాలిక ఎంపికైంది. జిల్లాలోని బాతుగుడబ మండలం గుమ్మ లక్ష్మీపురం మండలం బాతుగుడబా గ్రామానికి చెందిన చెల్లకి సంధ్య (12) భారత అంధుల క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది.

Published : 08 Jul 2023 21:54 IST

గుమ్మ లక్ష్మీపురం(పార్వతీపురం మన్యం): భారత మహిళల అంధుల క్రికెట్‌ టీమ్‌కు ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన బాలిక ఎంపికైంది. జిల్లాలోని బాతుగుడబ మండలం గుమ్మ లక్ష్మీపురం గ్రామానికి చెందిన చెల్లకి సంధ్య (12) భారత అంధుల క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. ఆగస్టు 17 నుంచి 25 వరకు ఇంగ్లాండ్‌లో జరగనున్న ఐబీఎస్‌ పోటీల్లో సంధ్య పాల్గొననుంది. ప్రస్తుతం విశాఖపట్నంలోని చినజీయర్‌ స్వామి నేత్రాలయం పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఇంగ్లాండ్‌లో జరగనున్న పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు.

బాలిక కుటుంబ నేపథ్యం.. 

సంధ్య తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. తెలిసిన వారి సలహా మేరకు చదువుకొనేందుకు చినజీయర్‌ స్వామి నేత్రాలయం పాఠశాలలో తల్లిదండ్రులు సంధ్యను చేర్పించారు. అక్కడ బ్రెయిలీ లిపి నేర్చుకునే క్రమంలో క్రికెట్, ప్రముఖ క్రికెటర్ల గురించి తెలుసుకున్న సంధ్యకు క్రీడలపై ఆసక్తి కలిగింది. అప్పటికే ఆశ్రమంలోని సత్యవతి, రవణి.. ఇద్దరూ క్రికెటర్లుగా రాణిస్తున్నారు. ఇది తెలుసుకున్న సంధ్య వారితో క్రికెట్ ఆడడం ప్రారంభించింది. అలా మొదలైన ఆమె క్రికెట్ ప్రస్థానం చిన్న వయస్సులోనే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకుంది.

 సంధ్య కుడి చేతి వాటం మీడియం పేస్ బౌలర్‌. గత నెలలో చండీఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు తీసి ఆంధ్ర జట్టును గెలిపించింది. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకుంది. భారత జట్టుకు ఎప్పటికైనా కెప్టెన్ కావాలనే లక్ష్యంతో ప్రయాణం కొనసాగిస్తోన్న సంధ్య ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని