AUS vs PAK: తొలి టెస్టులో పాక్‌ ఘోర పరాజయం.. ఆసీస్‌ను ఢీకొట్టే సత్తా టీమ్‌ఇండియాకే..: మైకెల్ వాన్‌

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌ (AUS vs PAK) ఓడిపోవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో భారత్‌ దూసుకొచ్చింది. పాక్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

Published : 18 Dec 2023 11:05 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో (AUS vs PAK) పాకిస్థాన్ ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే. 360 పరుగుల తేడాతో పాక్‌ను ఆసీస్‌ చిత్తు చేసింది. పేసర్లకు అనుకూలంగా ఉండే పెర్త్‌ పిచ్‌పై ఆసీస్‌ను నిలువరించడంలో పాక్‌ బౌలర్లు విఫలం కావడం గమనార్హం. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైకెల్ వాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో ఆసీస్‌కు సవాల్‌ విసరగలిగే జట్టు భారత్‌ మాత్రమేనని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐపై ప్రశంసల జల్లు కురిపించాడు. 

‘‘ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. నాథన్‌ లైయన్ 500 వికెట్ల క్లబ్‌లోకి చేరడం అభినందనీయం. ఆసీస్‌ను వారి స్వదేశంలో ఢీకొట్టగలిగే జట్టు ఏదైనా ఉందంటే అది టీమ్‌ఇండియానే. బీసీసీఐ నాణ్యమైన క్రికెటర్లను అందిస్తోంది’’ అని ఎక్స్‌ వేదికగా మైకెల్ వాన్‌ పోస్టు చేశాడు. దీంతో అతడు చేసిన ట్వీట్‌కు క్రికెట్‌ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. 

‘‘పోటీ అనేదానికంటే ‘ఓడించగలదు’ అనే పదం వాడితే బాగుంటుంది. గత రెండు పర్యటనల్లో ఆసీస్‌ను టీమ్‌ఇండియా చిత్తు చేసింది’’

‘‘పాక్‌ను ఓడించడం ఆసీస్‌కు కొత్తేమీ కాదు. అన్ని విభాగాల్లో పాక్‌పై ఆధిపత్యం ప్రదర్శించడం సర్వసాధారణం. ఇక పాక్‌ కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టే ఆడింది’’

‘‘పాకిస్థాన్‌ జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వకుండా లొంగిపోయింది. ఆసీస్‌ అద్భుతంగా ఆడింది. మరీ ముఖ్యంగా డేవిడ్‌ వార్నర్‌ చివరి సిరీస్‌లో అదరగొట్టాడు’’

బాక్సింగ్‌ డే టెస్టుకు ఆసీస్‌ జట్టులో ఒక్క మార్పు

పాకిస్థాన్‌తో మెల్‌బోర్న్‌ వేదికగా రెండో టెస్టు మ్యాచ్‌ డిసెంబర్ 26 నుంచి డిసెంబర్‌ 30 వరకు జరగనుంది. దీనిని బాక్సింగ్‌ డే టెస్టుగా పిలుస్తారు. ఈ మ్యాచ్‌ కోసం 13 మందితో కూడిన జట్టును ఆసీస్‌ ప్రకటించింది. తొలి టెస్టు జట్టులో ఉన్న అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ లాన్స్‌ మోరిస్‌ను తప్పించింది. దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు అతడిని వదిలిపెట్టింది. 

జట్టు ఇదే: ప్యాట్ కమిన్స్‌ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్‌ కేరీ,  కామెరూన్ గ్రీన్, జోష్‌ హేజిల్‌వుడ్, ట్రావిస్‌ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్‌ లబుషేన్, నాథన్‌ లైయన్, మిచెల్ మార్ష్‌, స్టీవ్‌ స్మిత్, మిచెల్‌ స్టార్క్‌, డేవిడ్ వార్నర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని