INDw vs ENGw: ఇంగ్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్.. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత్

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్‌ 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

Updated : 06 Dec 2023 22:44 IST

ముంబయి: ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను భారత్ పేలవంగా ఆరంభించింది. ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లాండ్ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో షఫాలీ వర్మ (52; 42 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించగా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (26), రిచా ఘోష్ (21) పరుగులు చేశారు. స్మృతి మంధాన (6), జెమీమా రోడ్రిగ్స్‌ (4) తీవ్ర నిరాశపర్చారు. కనికా అహుజా (15), పుజా వస్త్రాకర్‌ (11*) పరుగులు చేశారు. సోఫీ ఎకిల్‌స్టోన్ (3/15) భారత్‌ను గట్టిదెబ్బ కొట్టింది. నాట్ సీవర్‌, సారా గ్లెన్, ఫ్రెయా కెంప్‌లకు తలో వికెట్ దక్కింది. 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే సోఫియా డంక్లీ (1), కాప్సీ (0)ని రేణుకా సింగ్ వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపింది. రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా.. డేనియల్‌ వ్యాట్‌ (75; 47 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), నాట్‌ సీవర్‌ (77; 53 బంతుల్లో 13 ఫోర్లు) అర్ధ శతకాలతో విరుచుకుపడి ఇంగ్లాండ్‌కు భారీ స్కోరు అందించారు. చివర్లో అమీ జోన్స్‌ (23; 9 బంతుల్లో 1 సిక్స్‌, 3 ఫోర్లు) మెరుపులు మెరిపించింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ (3/27) అద్భుతంగా బౌలింగ్ చేయగా, శ్రేయాంక పాటిల్ 2, సైకా ఇషాక్‌ ఒక వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని