ENG vs IND: ఆ ‘తుపాన్‌’ మన మీదకొస్తే..!

ఒకదాని తరవాత మరొక ఇన్నింగ్స్‌..అలా క్రీజ్‌లోకి వచ్చి ఎడాపెడా బౌండరీలు బాదేయడం..స్కోరు బోర్డును పరుగులు పెట్టించడం ..అలవోకగా శతకం పూర్తిచేయడం..ఇది వన్డే మ్యాచో, టీ20నో కాదు..సుదీర్ఘంగా ఆట సాగే టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో బ్యాటింగ్‌ శైలి. 

Published : 30 Jun 2022 01:59 IST

ఒకదాని తరవాత మరొక ఇన్నింగ్స్‌..అలా క్రీజ్‌లోకి వచ్చి ఎడాపెడా బౌండరీలు బాదేయడం..స్కోరు బోర్డును పరుగులు పెట్టించడం ..అలవోకగా శతకం పూర్తిచేయడం..ఇది వన్డే మ్యాచో, టీ20నో కాదు..సుదీర్ఘంగా ఆట సాగే టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో బ్యాటింగ్‌ శైలి. 

అన్ని మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లే...

టెస్టు క్రికెట్‌లో 50 స్ట్రెక్‌రేట్‌ ఉండటమే గొప్ప విషయం. అలాంటిది  బెయిర్‌ స్టో 100కి  పైగా స్ట్రెక్‌రేట్‌తో పరుగులు చేస్తున్నాడు. వాస్తవానికి టెస్టు క్రికెట్‌లో బ్యాటర్‌  క్రీజ్‌లో కుదురుకుంటేనే రన్స్‌ చేయగలడు. కానీ బెయిర్‌స్టో  స్టైల్‌ వేరు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అతడి ఇన్నింగ్స్‌లే దీనికి నిదర్శనం. లీడ్స్‌లోని హెడింగ్లే వేదికగా మూడో టెస్ట్‌‌లో తొలుత న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ చేసి 329 పరుగులు ఆలౌట్‌ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 55పరుగులకే 6వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక అప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన  జానీ బెయిర్ స్టో బౌండరీలు బాదుతూ న్యూజిలాండ్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. జేమీ ఓవర్టన్ (97పరుగులు)తో కలిసి ఇంగ్లాండ్ స్కోరు  360పరుగులకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే జానీ 162 (24 ఫోర్లు) భారీ స్కోరు సాధించాడు.

44 బంతుల్లో 71

రెండో ఇన్నింగ్స్‌లో 296పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు 39ఓవర్లకు 2వికెట్లు 183పరుగులు చేసింది. ఇంకా 113పరుగులు చేస్తే ఇంగ్లాండ్ గెలుస్తుంది. ఈ దశలో చివరి రోజు వర్షం కారణంగా లంచ్ తర్వాత ఆట ప్రారంభమైంది.  పోప్ ఔటయినా.. తరవాత  జానీ షో మొదలైంది. జానీ  (44 బంతుల్లో  9ఫోర్లు ,3సిక్సర్లు 71నాటౌట్) చెలరేగడంతో ఇంగ్లాండ్ 7వికెట్ల తేడాతో విజయం సాధించింది.

92 బంతుల్లో 136

న్యూజిలాండ్‌తో జరిగిన రెండోటెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ లక్ష్యం 300 పరుగులు. 93 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఐదో రోజు ఆటలో ఇంగ్లాండ్‌కు పరాభవం ఖాయం అనుకున్నారు. గట్టిగా పోరాడితే డ్రా అవుతుంది. ఇదే అందరి ఆలోచన. అయితే అప్పుడే మొదలైంది బెయిర్‌ ‘స్ట్రోమ్‌’.. 92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 136 పరుగులు చేసి డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను అనూహ్యంగా గెలిపించాడు.

ఈ తుపాన్‌ మనపై విరుచుకుపడితే...

120.12 స్ట్రెక్‌రేట్‌తో 3 మ్యాచ్‌ల్లో 394 పరుగులు. ఇవి  న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌లో  బెయిర్‌ స్టో గణాంకాలు. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో జానీ 4 సెంచరీలు చేసి సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. టీమ్‌ఇండియా జులై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో కీలక మ్యాచ్‌ ఆడుతుంది. ఇటువంటి ఆటగాడిని భారత్‌ నిలువరించకపోతే క్షణాల్లో మ్యాచ్‌ ఫలితాన్ని  మార్చేస్తాడు. భారత్‌కు చారిత్రక సిరీస్‌ దక్కకుండా పోతుంది.

భారత్‌పై బెయిర్‌ స్టో ప్రదర్శన ( 30 ఇన్నింగ్స్‌లలో 803 పరుగులు , అత్యధిక స్కోరు 93). గత సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై  భారత బౌలర్లు బుమ్రా, షమీ, సిరాజ్‌  ఆధిపత్యం, బెయిర్‌స్టోకు భారత్‌ మీద రికార్డు చూస్తే ఆ తుపాను మనల్ని ఏమీ చేయలేదు అనుకోవచ్చు. ఇది గతం.  అయితే బెయిర్‌స్టోని ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేం. వేస్తే అంతే సంగతులు. న్యూజిలాండ్‌ను 3-0 ఇంగ్లాండ్‌ క్లీన్‌స్వీప్‌ చేసిదంటే ..దానికి కారణం  బెయిర్‌ స్టో విధ్వంసాలే.

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని