Updated : 28 Jun 2022 19:39 IST

Eoin Morgan: ఆ ‘గన్‌’ ఇక పేలదు.. రిటైర్మెంట్‌ ప్రకటించిన మోర్గాన్‌

బ్యాటింగ్‌తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చగల ధీరుడు..

తనదైన రోజు ఏ ప్రత్యర్థినైనా చిత్తు చేయగల సమర్థుడు..

ఒక వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 17 సిక్సులు బాదిన ఏకైక ఆటగాడు..

క్రికెట్‌ పుట్టినిల్లు ఇంగ్లాండ్‌ జట్టు దశాబ్దాల కలను నిజం చేసిన నాయకుడు..

ఇదంతా ఇంగ్లాండ్‌ ‘గన్‌’ ఇయాన్‌ మోర్గాన్‌ ట్రాక్‌ రికార్డు. 

కొంతకాలంగా పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతున్న మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సహచర ఆటగాళ్లంతా చెలరేగుతుంటే నెదర్లాండ్స్‌ లాంటి చిన్న జట్టుపైనా మోర్గాన్‌ వరుసగా రెండుసార్లు డకౌటయ్యాడు. ఆపై గాయం బారిన పడటంతో ఇక ఆటకు దూరమవ్వాలనుకున్నాడు. కెరీర్‌ చరమాంకంలో ఇలా చేశాడంటే ఓకే.. కానీ 35 ఏళ్ల వయసులోనే క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. 

ఐర్లాండ్‌ ఆటగాడి నుంచి ఇంగ్లాండ్‌ కెప్టెన్‌గా..

మోర్గాన్‌ స్వదేశం ఐర్లాండ్‌. ఆ జట్టు తరఫున 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. స్కాట్లాండ్‌తో ఆడిన తొలి వన్డేలోనే 99 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే శతకానికి ఒక్క పరుగు దూరంలో రనౌటయ్యాడు. దీంతో డెబ్యూ మ్యాచ్‌లో ఇలా 99 వద్ద ఔటైన తొలి ఆటగాడిగా నిలిచాడు. అనంతరం 2007లో కెనాడపై తొలి శతకం సాధించాడు. అదే ఏడాది టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైనా సరిగ్గా ఆకట్టుకోలేకపోయాడు. మొత్తానికి ఐర్లాండ్‌ జట్టుతో మూడేళ్ల ప్రయాణంలో 23 వన్డేలు ఆడి 744 పరుగులు చేశాడు. అయితే, తర్వాత 2009లో ఇంగ్లాండ్‌ జట్టుకు మారిపోయి సరిగ్గా పదేళ్ల తర్వాత చరిత్ర సృష్టించాడు. 2012 వరకు ఆ జట్టుకు మూడు ఫార్మాట్లో ప్రాతినిధ్యం వహించిన మోర్గాన్‌ తర్వాత కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమయ్యాడు.

ఈ క్రమంలోనే మెల్లి మెల్లిగా తన ఆటను మెరుగుపర్చుకుని ఏకంగా కెప్టెన్‌ అయ్యాడు. అయితే, 2015 వన్డే ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లాండ్‌ సారథ్య బాధ్యతలు స్వీకరించిన అతడు ఇండియా, ఆస్ట్రేలియాతో జరిగిన ట్రై సిరీస్‌లో విఫలమయ్యాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శతకం బాదినా తర్వాత సరిగ్గా ఆడలేకపోయాడు. తర్వాత ప్రపంచకప్‌లోనూ మోర్గాన్‌ బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే ఆ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు మాత్రమే విజయం సాధించి అనూహ్యరీతిలో ఇంటిముఖం పట్టింది.

ఏ ఇంగ్లాండ్‌ సారథికి సాధ్యం కాని ఘనత..

ఇక ఆ వైఫల్యం తర్వాత మోర్గాన్‌ జట్టులో పెను మార్పులు తెచ్చాడు. స్పష్టమైన ప్రణాళికతో ముందుకొచ్చాడు. ఎలాగైనా 2019 వన్డే ప్రపంచకప్‌లో విజయం సాధించాలనే కసితో జట్టును నిర్మించాడు. అందుకు అవసరమైన ఆటగాళ్లను ఎంపిక చేశాడు. వారిని ప్రోత్సహిస్తూ ప్రపంచంలోనే ఇంగ్లాండ్‌ను మేటి జట్టుగా తీర్చిదిద్దాడు. దీంతో ఆ జట్టు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో వరుస విజయాలు సాధించడం మొదలుపెట్టింది. వన్డేల్లో నిలకడగా 300 పైచిలుకు స్కోర్లు సాధించడం అలవాటుగా చేసుకుంది. ఈ క్రమంలోనే 2019 వన్డే ప్రపంచకప్‌ నాటికి ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా నిలిచింది. అనుకున్నట్లే మోర్గాన్‌ ఆ జట్టును విజయపథంలో నడిపించాడు. ఇంగ్లాండ్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లడమే కాకుండా న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ను గెలిపించాడు.

దీంతో నాలుగు దశాబ్దాల ఇంగ్లాండ్‌ ప్రజల కోరికను నిజం చేశాడు. ఏ గొప్ప ఇంగ్లాండ్‌ సారథికి సాధ్యంకాని ఘనతను తన కీర్తికిరీటంలో పొందుపర్చుకున్నాడు. అందరి చేతా శెభాష్‌ అనిపించుకున్నాడు. అయితే, మోర్గాన్‌ కూడా ధోనీలాగే ప్రశాంతంగా ఉంటూ జట్టును నడిపిస్తాడు. ఒత్తిడిలోనూ ఎలాంటి భావోద్వేగాలకు లోనవ్వకుండా ఎంతో సంయమనం పాటిస్తాడు. అలా ఇంగ్లాండ్‌ను వన్డేల్లో అత్యంత ప్రమాదకర జట్టుగా తీర్చిదిద్దాడు.

ఇక మొత్తంగా మోర్గాన్‌ 248 వన్డేలు ఆడి.. 39.29 సగటుతో 7,701 పరుగులు చేశాడు. అందులో 14 శతకాలు, 47 అర్ధశతకాలు సాధించాడు. మరోవైపు పొట్టి ఫార్మాట్‌లో 115 మ్యాచ్‌లు ఆడి.. 28.58 సగటుతో 2,458 పరుగులు చేశాడు. 14 అర్ధశతకాలు నమోదు చేశాడు. అలాగే టెస్టుల్లో 16 మ్యాచ్‌లు ఆడి 30.43 సగటుతో 2 శతకాలు, 3 అర్ధశతకాలతో 700 పరుగులు చేశాడు. 

* పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు మోర్గానే. వన్డేలు, టీ20లు కలిపి మొత్తం 10,159 పరుగులు చేశాడు.

* వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుకు సారథిగా ఉన్నాడు. ఇటీవల నెదర్లాండ్స్‌పై ఇంగ్లాండ్‌ 498 పరుగులు చేసింది అతడి కెప్టెన్సీలోనే.

* అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ధోనీతో సమానంగా మోర్గాన్‌ 72 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు.

* అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు జట్ల తరఫున ఆడి వన్డేల్లో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు మోర్గానే.

* ఫార్మాట్లకు అతీతంగా 99, 199, 299 పరుగుల వద్ద ఔటైన ఆటగాడు కూడా అతడే నిలిచాడు.

భారత టీ20 లీగ్‌లో అంతంతే..

ఇక మోర్గాన్‌ భారత టీ20 లీగ్‌లో సుమారు దశాబ్దకాలం ఆడగా వివిధ ఫ్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే, ఇక్కడ అంత గొప్పగా రాణించలేదు. కేవలం 2020 సీజన్‌లోనే చెప్పుకొదగ్గ బ్యాటింగ్‌ చేశాడు. మిగతా అన్ని సీజన్లలోనూ పెద్దగా రాణించలేదు. 2010లో తొలిసారి బెంగళూరు తరఫున బరిలోకి దిగిన అతడికి కొన్ని మ్యాచ్‌ల్లోనే అవకాశం వచ్చింది. ఇక 2011లో కోల్‌కతా టీమ్‌ కొనుగోలు చేయడంతో తర్వాతి మూడేళ్లు అక్కడికి వెళ్లాడు. అయితే, 2014లో స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌ ఉండటంతో ఆ సీజన్‌లో ఆడలేదు. మళ్లీ 2015లో హైదరాబాద్‌ కొనుగోలు చేయడంతో రెండేళ్లు అక్కడ ఆడాడు. తర్వాత 2017లో పంజాబ్‌ టీమ్‌ దక్కించుకుంది.

అయితే తర్వాతి రెండు సీజన్లలో మోర్గాన్‌ భారత టీ20 లీగ్‌లో ఆడలేదు. కానీ, 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ను గెలిపించడంతో తర్వాతి ఏడాదికి కోల్‌కతా రూ.5.25 కోట్లకు దక్కించుకుంది. అయితే, ఆ సీజన్‌లో దినేశ్‌ కార్తీక్‌ పగ్గాలు వదులుకోవడంతో మోర్గాన్‌ నాయకత్వం స్వీకరించాడు. అప్పుడొక్కటే 418 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే 2021లోనూ కోల్‌కతాకు కెప్టెన్సీ చేసిన అతడు బ్యా్ట్స్‌మన్‌గా విఫలమైనా జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అయితే, ఇటీవల అతడి ప్రదర్శన అంత బాగోలేకపోవడంతో ఈ సీజన్‌లో ఏ జట్టూ తీసుకోలేదు. దీంతో భారత టీ20 లీగ్‌లో మోర్గాన్‌ కథ ముగిసింది.

మోర్గాన్‌ వారసుడు బట్లర్‌

ఇక మోర్గాన్‌ తర్వాత ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా జోస్‌ బట్లర్‌ పగ్గాలు అందుకునే అవకాశం ఉంది. ఆ జట్టు ఇద్దరు సారథుల పంథాను అనుసరిస్తుండటంతో టెస్టుల్లో ఇంతకుముందే జోరూట్‌ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నాక బెన్‌స్టోక్స్‌ ఆ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బట్లర్‌ భీకరఫామ్‌లో ఉండటంతో పాటు కొన్నాళ్లుగా వైస్‌ కెప్టెన్‌గానూ కొనసాగుతున్నాడు. దీంతో మోర్గాన్‌ తర్వాత అతడినే పరిమిత ఓవర్ల సారథిగా ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయించే వీలుంది.   


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని