IPL 2024: కామెరూన్‌ గ్రీన్‌ ట్రేడింగ్‌.. ఆర్‌సీబీకి గొప్ప ఛాయిస్‌ కాదు: బ్రాడ్ హాగ్‌

కామెరూన్‌ గ్రీన్‌ను భారీ మొత్తం వెచ్చించి ముంబయి ఇండియన్స్‌ నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Published : 05 Dec 2023 15:55 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్‌ గ్రీన్‌ను ముంబయి ఇండియన్స్‌ (MI) నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) కొనుగోలు చేసింది. దాదాపు రూ. 17.5 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకోవడం ఐపీఎల్ (IPL) వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముంబయి కూడా హార్దిక్‌ను తీసుకునేందుకు అవసరమైన మొత్తం కోసం గ్రీన్‌ను ఇచ్చేసింది. అయితే, గ్రీన్‌ను ఆర్‌సీబీ తీసుకోవడంపై ఆసీస్‌ మాజీ స్టార్‌ స్పిన్నర్ బ్రాడ్ హాగ్‌ స్పందించాడు. గ్రీన్‌ కొనుగోలు గొప్ప నిర్ణయం కాదని వ్యాఖ్యానించాడు. 

‘‘గ్రీన్‌ అంత విలువైన ఆటగాడా? ఆర్‌సీబీ లైనప్‌ను చూస్తే వారు తీసుకున్న నిర్ణయం గొప్పదేమీ కాదు. అయితే, ఇక్కడ కామెరూన్‌ గ్రీన్‌ టాలెంట్‌ను తక్కువ చేయడం లేదు.  ముంబయి ఇండియన్స్‌ తరఫున గతేడాది మంచి ప్రదర్శన చేశాడు. అయితే, ఆర్‌సీబీలో ఆటగాళ్ల జాబితాను తీసుకుంటే.. ఇప్పటికే బ్యాటింగ్‌ లైనప్‌ కోసం భారీగా ఖర్చు పెట్టింది. కానీ, నాణ్యమైన బౌలర్ల కోసం తగినంత నిధులు వారి వద్ద లేవు. మీరు (ఆర్‌సీబీ) ఐపీఎల్‌ విజేతగా నిలవాలని భావిస్తే.. బౌలర్లపైనా దృష్టిపెట్టాలి. భారీ లక్ష్యాలను కాపాడుకోవాలంటే బౌలర్ల పాత్ర అత్యంత కీలకం. కామెరూన్‌ గ్రీన్‌ ఆర్‌సీబీకి సరిపోయే ఆటగాడు కాదనిపిస్తోంది. 

ముంబయి ఇండియన్స్‌ హార్దిక్‌ పాండ్యను దక్కించుకొనేందుకు గ్రీన్‌ను వదిలేసింది. ఇదంతా సజావుగానే సాగింది. గ్రీన్‌ను వేలంలోకి పంపించాలని అనుకోలేదు. కాస్త ఎక్కువైనా సరే ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలని బెంగళూరు భావించింది’’ అని బ్రాడ్ హాగ్‌ తెలిపాడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో  16 మ్యాచ్‌లు ఆడిన కామెరూన్‌ 452 పరుగులు చేశాడు. ఆరు వికెట్లు పడగొట్టాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని