MS Dhoni: అప్పుడు జట్టులో ధోనీ ఉండాలని గంగూలీకి చెప్పాను.. కానీ : సబా కరీమ్‌

మహేంద్ర సింగ్‌ ధోని గురించి భారత మాజీ కీపర్‌ సబా కరీమ్‌ ఆస్తకికరమైన విషయాలు పంచుకున్నాడు.

Published : 05 Aug 2023 12:40 IST

ఇంటర్నెనెట్ డెస్క్‌: ప్రపంచ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు మహేంద్రసింగ్‌ ధోనీ (Mahendra Singh Dhoni). జార్ఖండ్‌ డైనమైట్‌, ‘కెప్టెన్‌ కూల్’, ది ఫినిషర్‌గా గుర్తింపు పొందిన ధోనీ టీమ్‌ఇండియాకు రెండు ప్రపంచకప్‌లను అందించాడు. ఇలా ప్రతి అభిమాని మదిలో నిలిచిపోయాడు. ధోనీ గురించి బీసీసీఐ మాజీ సెలెక్టర్ సబా కరీమ్‌ (Saba Karim) తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అతడిని తొలిసారి రంజీ మ్యాచ్‌ (Ranji Trophy) సందర్భంగా కలిసినట్లు గుర్తు చేసుకున్నాడు. అతడి నైపుణ్యాలను చూసి అబ్బురపడినట్లు పేర్కొన్నాడు.

‘‘ధోని తన 15 సంవత్సరాల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్‌లో చెరగని ముద్ర వేశాడు. కెప్టెన్‌ కూల్‌.. ద ఫినిషర్‌గా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో ఒక దగ్గర మలుపు ఉంటుంది. మొదటిసారిగా ధోనిని రంజీ ట్రోఫీ సందర్భంగా కలిశా. బిహార్‌కు రెండో ఏడాది ఆడుతున్న సమయంలో మొదటిసారి అతడిని కలిశా. రంజీ ట్రోఫీ ఆడే సమయంలో అతడు బ్యాటింగ్‌, కీపింగ్‌ చేయడం చూశాను. అతడు ఆడే తీరులో నాకు బాగా నచ్చే అంశం లాఫ్టెడ్‌ షాట్లు. అది స్పిన్నర్‌, పేసర్‌ ఎవరైనా సరే అద్భుతంగా భారీ షాట్లను కొట్టేవాడు. వికెట్‌ కీపింగ్‌లో అతడి నైపుణ్యాలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆ సమయంలో మేమిద్దరం ఎన్నో విషయాలపై చర్చించుకునేవాళ్లం. ఇప్పటికీ ధోనీ ఆ విషయాలను గుర్తు పెట్టుకున్నాడు.

ధోనీ కెరీర్‌లో తొలి టర్నింగ్‌ పాయింట్ అక్కడే మొదలైంది. అతడి పవర్‌ఫుల్‌ బ్యాటింగ్‌తో వేగంగా పరుగులు రాబట్టేవాడు. ఇక ఆ ప్రదర్శనతో భారత్‌ A జట్టులోకి అడుగు పెట్టిన ధోనీ కెన్యా, పాకిస్థాన్‌తో ఆడే అవకాశాలు దక్కించుకున్నాడు. దినేశ్‌ కార్తీక్‌ ( Dinesh Karthik)కు జాతీయ జట్టులో అవకాశం రావడంతో ధోనీ ఆ స్థానంలోకి వచ్చాడు. వికెట్ల వెనుక ఎంతో చురుగ్గా ఉండే మహీ బ్యాటింగ్‌లోనూ రాణించాడు. ఇక అప్పటి నుంచి జాతీయ జట్టు కోసం పరిగణనలోకి తీసుకోవడం ప్రారంభమైంది. 2004లో పాకిస్థాన్‌ పర్యటనకు ఎంపికయ్యే అవకాశం వచ్చినా కాస్తలో చేజారింది. అప్పుడు కెప్టెన్‌గా ఉన్న గంగూలీకి (Sourav Ganguly) ధోనీ గురించి చెప్పా. వికెట్‌ కీపర్ - బ్యాటర్‌గా ధోనీ సరిగ్గా సరిపోతాడని వివరించా. అయితే, గంగూలీ మాత్రం ధోనీ ఆటను చూడకపోవడంతో పాకిస్థాన్ (Pakistan) పర్యటనకు ఎంపిక కాలేకపోయాడు. అయితే, ఆ తర్వాత మాత్రం భారత్‌ జట్టులోకి వచ్చి సంచనాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే’’ అని సబా కరీమ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని