T20 World Cup 2024: రోహిత్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం అతడికే: మాజీ క్రికెటర్

టీ20 ప్రపంచ కప్‌ మరో నాలుగున్నర నెలల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే జట్లన్నీ తమ ఆటగాళ్లను సిద్ధం చేసుకొనే పనిలో పడ్డాయి.

Published : 20 Jan 2024 10:30 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ముందు టీమ్‌ఇండియా చివరి అంతర్జాతీయ పొట్టి సిరీస్‌ను ఆడేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ బాధ్యతలు చేపట్టి జట్టును విజయపథంలో నడిపించాడు. అతడికి జోడీగా యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్ బరిలోకి దిగారు. జూన్‌ నుంచి మొదలయ్యే ప్రపంచ కప్‌ ముందు భారత్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడనున్నారు. ఇప్పటికే జట్టులోని 10 స్థానాలపై ఓ అవగాహనకు వచ్చినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అయితే, అతడితో కలిసి మెగా సమరంలో ఎవరు ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారనేది ఆసక్తికరంగా మారింది. యశస్వి, గిల్‌తోపాటు రుతురాజ్‌ గైక్వాడ్ కూడా రేసులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘యశస్వి జైస్వాల్ అందరికంటే ముందున్నాడు. శుభ్‌మన్‌ గిల్ ఇటీవల ఫామ్‌ను చూస్తే గొప్పగా లేదు. అందుకే యశస్వి కంటే గిల్ వెనుకబడిపోయాడు. అఫ్గాన్‌తో తొలి మ్యాచ్‌లో ఆడిన గిల్‌ను తర్వాతి రెండు టీ20లకు బెంచ్‌కే పరిమితం చేశారు. యశస్వి జైస్వాల్‌ రెండు మ్యాచుల్లో ఓపెనర్‌గా వచ్చాడు. సూపర్‌ ఓవర్‌లోనూ ఆడాడు. అతడి బ్యాటింగ్‌ విధానం అతడిని పక్కన పెట్టేలా లేదు. ఇందౌర్‌లో అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే, అతడిని జట్టు నుంచి తప్పించడం కష్టంగా మారింది’’ అని చెప్పాడు.

నేనైతే వారిద్దరిని తీసుకుంటా..

‘‘యువరాజ్‌ సింగ్‌ను శివమ్‌ దూబె గుర్తు చేశాడు. అతడి బ్యాటింగ్‌ తీరు అలా ఉంది. బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించడం అద్భుతం. అఫ్గాన్‌తో సిరీస్‌లో శివమ్‌ ఆట తీరు చూశాం. అతడిని ఇదే స్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తే మంచి ప్రదర్శన చేస్తాడు. తొలి రెండు మ్యాచుల్లో క్లిష్ట సమయాల్లోనూ సూపర్‌ సిక్స్‌లు కొట్టాడు. నేనైతే ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్యతోపాటు శివమ్‌ దూబెను ఎంపిక చేస్తా. ఐపీఎల్‌లో అతడి ప్రదర్శన మెరుగ్గా ఉంటే తప్పకుండా ప్రపంచ కప్‌ జట్టులో స్థానం దక్కించుకుంటాడు’’ అని చోప్రా అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని