Team India: ధోనీలాంటి కెప్టెనే రోహిత్.. వారికి ఎల్లవేళలా అండగా ఉంటాడు: శ్రీశాంత్

వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2024) భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన రోహిత్ శర్మ నాయకత్వంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి కెప్టెన్సీని ధోనీతో పోలుస్తూ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

Updated : 06 Dec 2023 16:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత క్రికెట్‌లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) కెప్టెన్సీ చిరస్మరణీయం. టీమ్ఇండియాకు పొట్టి కప్‌తోపాటు రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను అందించింది అతడి నాయకత్వమే. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని ధోనీ సారథ్యంలోనే భారత్‌ సాధించింది. అయితే ట్రోఫీలు గెలవలేకపోయినా..  ప్రస్తుతం టీమ్‌ఇండియాను రోహిత్‌.. ధోనీ బాటలోనే నడిపిస్తున్నాడు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ (Rohit Sharma) నాయకత్వంలోని టీమ్‌ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. అయితే, విజేతగా నిలవడంలో విఫలమైనప్పటికీ భారత్ ఆడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌లోనూ రోహిత్ కెప్టెన్‌గా ఉంటాడనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్ సారథ్యాన్ని టీమ్ఇండియా (Team India) మాజీ ఆటగాడు శ్రీశాంత్ ‘కెప్టెన్ కూల్’ ధోనీతో పోలుస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

👉 Follow EENADU WhatsApp Channel

‘‘ఆట పట్ల పూర్తిస్థాయి అవగాహన, నైపుణ్యం కలిగిన ఆటగాడు రోహిత్ శర్మ. అద్భుతమైన కెప్టెన్సీ సామర్థ్యం కూడా ఉంది. అచ్చం ధోనీ భాయ్‌లా జట్టును నడిపించే నాయకుడు రోహిత్. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఒక్కోసారి మెరుగైన ప్రదర్శన లేకపోయినా ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తాడు. ఇలా చేయడం వల్ల ఆటగాళ్లు మానసికంగా దృఢంగా మారేందుకు అవకాశం ఉంటుంది. వన్డే వరల్డ్‌ కప్‌లోనూ (ODI World Cup 2023) మీరు చూసే ఉంటారు. ఒక్కోసారి ఫీల్డర్లు బంతిని చేజార్చినప్పుడు.. బౌలింగ్‌ లేదా బ్యాటింగ్‌లో కాస్త విఫలమైనా సరే ఆయా ప్లేయర్లకు అండగా నిలిచాడు. అలాగే తుది జట్టులో లేని ఆటగాళ్ల నుంచి సూచనలు, సలహాలు కూడా తీసుకున్నాడు. 

రోహిత్ శర్మ కెప్టెనే అయినప్పటికీ.. జట్టులోని సహచరులకు స్నేహితుడిగా, సోదరుడిగా ఉంటాడు. ఇది అత్యంత కీలకం. ఎందుకంటే వారితో అలా ఉన్నప్పుడే మెరుగైన ప్రదర్శనకు అవసరమైన సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఆటగాళ్లందరినీ సరైన మార్గంలో నడిపించడంతోపాటు వారి సత్తాను వెలికితీయడమే నాయకుడి బాధ్యత. ఈ విషయంలో రోహిత్, ధోనీ ఒకేలా ఆలోచిస్తారు’’ అని శ్రీశాంత్ (Sreeshant) వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు