Virat-Gambhir: విరాట్-గంభీర్‌ మధ్య తేడా అదే.. నా బెస్ట్‌ కెప్టెన్‌ అతడే: పార్థివ్‌ పటేల్

విరాట్ కోహ్లీ, గౌతమ్‌ గంభీర్‌ (Virat Kohli - Gautam Gambhir) మైదానంలో దూకుడుగా ఉంటారు. తమ జట్టు విజయం కోసం తుది వరకు పోరాడతారు. కానీ, వీరిద్దరిలో ఓ వ్యత్యాసం ఉందంటాడు మాజీ క్రికెటర్ పార్థివ్‌ పటేల్. 

Published : 17 Dec 2023 11:00 IST

ఇంటర్నెట్ డెస్క్: దిల్లీకి చెందిన ఇద్దరు బ్యాటర్లు టీమ్‌ఇండియాలో కలిసి ఆడారు. ఒకరు ఆటకు వీడ్కోలు పలికేసిన గౌతమ్‌ గంభీర్‌ కాగా.. మరొకరు కింగ్‌ విరాట్ కోహ్లీ. గత ఐపీఎల్‌ సీజన్‌ సందర్భంగా వీరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్‌ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వీరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గంభీర్-విరాట్ మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటో వివరించాడు. అలాగే బెస్ట్‌ కెప్టెన్‌ ఎవరనేది తెలిపాడు. 

‘‘విరాట్ కోహ్లీ, గౌతమ్‌ గంభీర్‌ గౌరవంగా ప్రవర్తించేవారే. అయితే, మైదానంలోకి దిగిన తర్వాత మాత్రం వీరు తమ జట్టు గెలవాలని బలంగా కోరుకుంటారు. దేశం కోసం ఆడేటప్పుడూ వారిలో చాలా దూకుడు కనిపిస్తుంది. అయితే, విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకొనే విధానం నచ్చుతుంది. సహచరుల్లో స్ఫూర్తి నింపుతాడు. నేను విరాట్‌తో కలిసి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులోనూ ఆడా. అలాగే గంభీర్‌తో కలిసి చాలా ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడా. వారిద్దరిని దగ్గర నుండి గమనించా. గంభీర్‌ కంటే విరాట్ ఇంకాస్త ఎక్కువ దూకుడుగా ఉంటాడు’’ అని  పార్థివ్‌ వ్యాఖ్యానించాడు.

ధోనీ అద్భుతం.. కానీ, గంగూలీనే నాకు బెస్ట్‌

ధోనీ నాయకత్వంలో భారత్‌  జట్టుకు, సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహించిన పార్థివ్‌ పటేల్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టింది మాత్రం సౌరభ్ గంగూలీ కెప్టెన్సీలోనే. ధోనీ సారథ్యం అద్భుతమని కొనియాడుతూనే గంగూలీ కెప్టెన్సీకే పార్థివ్‌ మొగ్గు చూపాడు. ‘‘ఇప్పటికీ నా అత్యుత్తమ కెప్టెన్‌ గంగూలీనే. మనకు ధోనీ, విరాట్‌ కూడా విజయవంతమైన కెప్టెన్లే. ధోనీ సారథ్యం అద్భుతం. కానీ, నా తొలి సారథి అంటే కాస్త అధిక ప్రేమ ఉండటం సహజమే కదా. అందుకే, ధోనీని కాకుండా గంగూలీ వైపు మొగ్గు చూపా. సీఎస్‌కేలో మూడేళ్లు ఆడా. నా టెస్టు, వన్డే అరంగేట్రం గంగూలీ సారథ్యంలో చేశా. నా ఆటతీరు బాగుండటంతో ధోనీ సీఎస్‌కే జట్టులోకి తీసుకున్నాడు’’ అని పార్థివ్‌ తెలిపాడు. పార్థివ్‌ పటేల్ 2002లో 17 ఏళ్ల వయసులో భారత జట్టులోకి వచ్చాడు. గంగూలీ నాయకత్వంలో 15 టెస్టులు, 10 వన్డేలు ఆడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని