Virat Kohli: మా విజయ సంకల్పానికి ఇంధనం వారి మద్దతే: విరాట్ కోహ్లీ

రెండు వారాల్లో మెగా సమరం ప్రారంభం కానుంది. అయితే, ఆ లోపు ట్రైలర్‌గా ఆసీస్‌తో భారత్‌ మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకొని మూడో వన్డేనాటికి విరాట్ కోహ్లీ వచ్చేస్తాడు. 

Published : 20 Sep 2023 14:11 IST

ఇంటర్నెట్ డెస్క్: రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌ఇండియా (Team India).. మరోసారి స్వదేశం వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. కపిల్ సారథ్యంలో (1983) తొలిసారి, ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2011లో మరోసారి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మరో పదిహేను రోజుల్లోనే మెగా సమరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) , రవీంద్ర జడేజా (Ravindra Jadeja) వరల్డ్ కప్‌ క్యాంపెయిన్‌ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచకప్ ముందు ఆసీస్‌తో టీమ్‌ఇండియా వన్డే సిరీస్‌ను ఆడనుంది. అయితే, తొలి రెండు వన్డేలకు విరాట్, రోహిత్, హార్దిక్‌కు మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఇటీవలే ఆసియా కప్‌ను గెలిచిన ఊపులో భారత్‌ ఉంది.

‘‘వచ్చే వరల్డ్ కప్‌లో మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తాం. భారత అభిమానుల పదేళ్ల ఐసీసీ టైటిల్‌ కలను నెరవేర్చేందుకు శ్రమిస్తాం. దాదాపు 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరగనున్న టోర్నీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. ఆట పట్ల అభిరుచి కలిగిన అభిమానుల మద్దతే మా విజయ సంకల్పానికి ఇంధనం. 2011లో వరల్డ్ కప్‌ విజేతగా నిలవడం ఇప్పటికీ మరిచిపోలేం. తప్పకుండా అభిమానుల కోసం మరోసారి అలాంటి అనుభూతిని కల్పిస్తామనే విశ్వాసం ఉంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఇక వరల్డ్‌ కప్‌ పోటీల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు’’ అని విరాట్ వ్యాఖ్యానించాడు. 

అంతకంటే మరేమీ అవసరం లేదు: జడేజా

‘‘క్రికెటర్‌గా కోట్లమంది అభిమానులు వెనుక ఉండి మద్దతు ఇస్తే అంతకంటే వచ్చే స్ఫూర్తి మరొకటి ఉండదు. వరల్డ్‌ కప్‌ విజేతగా చూడాలనుకునే అభిమానుల కోసం మా శాయశక్తులా కృషి చేస్తాం. ఇప్పుడీ వరల్డ్‌ కప్‌ క్యాపెయిన్‌ కూడా అదే చెబుతోంది. మొత్తం దేశంతో కలిసి మేము ప్రారంభించే ప్రయాణం. మైదానంలో మా ప్రదర్శనలతో అభిమానులను గర్వపడేలా చేయాలని నిశ్చయించుకున్నాం’’ అని రవీంద్ర జడేజా అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని