IND vs PAK: వన్డే వరల్డ్ కప్‌లోనే హై-ఓల్టేజీ మ్యాచ్‌.. షాక్‌ కొట్టేలా టికెట్‌ ధర ₹ 57 లక్షలు.. నెట్టింట ట్రోలింగ్‌!

వన్డే ప్రపంచకప్‌లో భారత్ - పాకిస్థాన్‌ (ODi World Cup 2023) మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని భావించే అభిమానులకు షాక్‌ తగిలేలా టికెట్ల ధరలు ఉన్నాయి. అయితే, ఇది సెకండరీ మార్కెట్‌లోనే సుమా. దీనిపై అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Updated : 05 Sep 2023 11:47 IST

ఇంటర్నెట్ డెస్క్: సోషల్‌ మీడియాలో ఓ వార్త తెగ హల్‌చల్‌ చేసేస్తోంది. దాయాదుల పోరును చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వన్డే ప్రపంచకప్‌లో భారత్ -పాకిస్థాన్‌ (IND vs PAK) మధ్య మ్యాచ్‌ హైఓల్టేజీ పోరనే విషయం అందరికీ తెలిసిందే. అక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ఆగస్టు 29, సెప్టెంబర్ 3న అధికారికంగా టికెట్ల విక్రయాలు నిర్వహించగా.. గంట వ్యవధిలోనే ‘సోల్డ్‌ ఔట్‌’ బోర్డులు దర్శనమివ్వడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో సెకండరీ మార్కెట్‌లో టికెట్లకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. సౌత్‌ ప్రీమియమ్‌ వెస్ట్ బే టికెట్‌ రేటు రూ.19.5 లక్షలు కాగా.. అప్పర్‌ టైర్‌లోని రెండు టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లుగా స్పోర్ట్స్‌ టికెట్ల ఎక్ఛ్సేంజ్, రీసేల్‌ వెబ్‌సైట్‌ ‘వయాగోగో’లో చూపిస్తోంది. అయితే, ఒక్కో టికెట్‌ రూ.57 లక్షలు ఉండటం గమనార్హం.

భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌కే కాకుండా.. టీమ్‌ఇండియా ఆడనున్న మిగతా మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ ధరలు కూడా సెకండరీ మార్కెట్‌లో భారీగా ఉన్నాయి. ఉదాహరణకు భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల రేంజ్‌ రూ.41 వేలు నుంచి రూ. 3 లక్షల వరకు పెరిగింది. అదే భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్‌కు అయితే రూ. 2.3 లక్షల వరకూ టికెట్లను విక్రయించారు. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఐసీసీ, బీసీసీఐలను ట్రోల్‌ చేస్తూ కామెంట్లు పెట్టారు. 

‘‘అసలేం జరుగుతోంది? వరల్డ్‌ కప్‌లోని భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ టికెట్ల ధర రూ. 65 వేల నుంచి రూ. 4.15 లక్షలు వరకు వయాగోగో వెబ్‌సైట్‌లో చూపిస్తోంది. పట్టపగలే దోపిడీ చేసేలా ఉన్నారు’’

‘‘నిన్న ఒక టికెట్‌ రూ. 15 లక్షలు ఉన్నట్లు చూశా. ఇప్పుడు అదే సోల్డ్‌ ఔట్ అని పెట్టారు. వయాగోగో నుంచి తొలగించారు’’

‘‘వయాగోగో వెబ్‌సైట్‌లో దాయాదుల పోరుకు సంబంధించి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ధరలను చూస్తే మైండ్‌బ్లాక్‌ అయిపోవాల్సిందే’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని