Team India: యువ టాలెంట్‌కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్‌కు సవాల్‌: మాజీ క్రికెటర్

ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తలపడేందుకు టీమ్‌ఇండియా (IND vs SA) సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది పొట్టి కప్‌ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లు అత్యంత కీలకం.

Published : 08 Dec 2023 17:13 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2023) కోసం టీమ్‌ఇండియా ఇప్పటికే సమాయత్తమవుతోంది. ఆసీస్‌పై ఐదు టీ20ల సిరీస్‌ను 4-1 తేడాతో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది. ఆ తర్వాత అఫ్గానిస్థాన్‌తో మరో మూడు టీ20లలో మాత్రమే తలపడనుంది. అంతర్జాతీయంగా ఆరు మ్యాచ్‌లనే భారత్‌ ఆడుతుంది. ఇక ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు ఆడతారు. అయితే, టీ20 ప్రపంచ కప్‌లో జట్టు కూర్పే భారత్‌కు ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ పార్థివ్‌ పటేల్ వ్యాఖ్యానించాడు. ఇప్పట్నుంచే ఆటగాళ్ల షార్ట్‌ లిస్ట్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించాడు. 

‘‘భారత్‌ విషయంలో జట్టు కూర్పే నాకు అసలైన సవాల్‌. మరీ ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో ఈ సమస్య ఎక్కువ. ఈసారి అంతర్జాతీయంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం లేదు. ఒకవేళ అఫ్గాన్‌తో పొట్టి సిరీస్‌లో విరాట్, రోహిత్, బుమ్రా బరిలోకి దిగుతారా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. వారి ఆటతీరును పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాలి. అలా కాకుండా ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ, వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు మధ్యలోనే టీ20 ప్రపంచ కప్‌ కోసం జట్టును ప్రకటించాల్సి ఉంటుంది. అప్పుడు మరింత సవాల్‌ అవుతుంది. అఫ్గాన్‌తో సిరీస్‌కు ముందే ఎవరెవరు అందుబాటులో ఉంటారు? ఎవరిని తీసుకోవాలనే అంచనాకు బీసీసీఐ వచ్చేస్తుందని అనిపిస్తోంది. 

అత్యుత్తమ టాలెంట్‌ కలిగిన యువకులు భారత జట్టులో చాలా మంది ఉన్నారు. ఇందులో ఎలాంటి లోటు లేదు. అయితే, టీమ్‌ఇండియాకు ఉన్న ఏకైక సమస్య స్క్వాడ్‌ ఎంపిక. సరైన కాంబినేషన్‌ను ఎంచుకోవడం చాలా క్లిష్టంగా మారింది. ఎలాంటి టోర్నమెంట్‌ అయినా.. భారత్‌ వ్యూహాత్మకంగా విఫలమవుతోంది. 2023 వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లోనూ ఇదేపరిస్థితి. టీ20 ప్రపంచకప్‌ 2021లోనూ పాతకాలంనాటి పొట్టి క్రికెట్‌ను ఆడింది. ఇక 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో నాలుగో స్థానం అతిపెద్ద సమస్యగా మారిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని