IPL 2024: ఐపీఎల్‌ విజేత ఆ జట్టేనా? గత ఆరు సీజన్లను గమనిస్తే..!

ఐపీఎల్ 17వ సీజన్‌ నాకౌట్ దశ సాగుతోంది. ఇప్పటికే తొలి క్వాలిఫయర్‌లో గెలిచిన కోల్‌కతా ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు సన్‌రైజర్స్‌కు రెండో క్వాలిఫయర్‌ రూపంలో మరో అవకాశం ఉంది.

Published : 22 May 2024 14:42 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ముగిసింది. హైదరాబాద్‌ను చిత్తు చేసి కోల్‌కతా నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కేకేఆర్‌ ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ఐపీఎల్ టైటిల్‌ను నెగ్గింది. చివరిగా 2014లో విజేతగా నిలిచింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ముంగిట ఉంది. కచ్చితంగా తమ జట్టే ఫైనల్‌లోనూ విజేతగా నిలుస్తుందని కేకేఆర్‌ ఫ్యాన్స్‌ ఘంటాపథంగా చెబుతున్నారు. దానికి తమ వద్ద ఓ లెక్క ఉందని అంటున్నారు. 2018 సీజన్‌ నుంచి తొలి క్వాలిఫయర్‌గా గెలిచిన జట్టే టైటిల్‌ను దక్కించుకుందనేది వారి వాదన. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన   ఆ గణాంకాలు ఏంటో చూసేద్దాం.. 

2018లో..: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అద్భుత ప్రదర్శన చేసిన సీజన్‌. హేమాహేమీ జట్లను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. రెండో స్థానంలో సీఎస్కే ఉంది. వీరి మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్‌లో చెన్నైనే విజయం వరించింది. ఇక రెండో క్వాలిఫయర్‌లో గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఫైనల్‌లో అడుగుపెట్టింది. అయితే, అక్కడా చెన్నై చేతిలో చుక్కెదురైంది.

2019లో..: ఈసారి కూడా తొలి క్వాలిఫయర్‌లో పోటీపడిన జట్లే ఫైనల్‌కు వచ్చాయి. అక్కడ గెలిచిన టీ ఛాంపియన్‌గా నిలవడం గమనార్హం. ముంబయి - చెన్నై మధ్య ఫైనల్‌ హోరాహోరీగా సాగింది. కేవలం ఒక్క పరుగు తేడాతోనే సీఎస్కేపై ముంబయి గెలిచింది.  

2020లో..: ఈ సీజన్‌ తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ముంబయి - దిల్లీ జట్ల మధ్య జరిగింది. ముంబయి భారీ విజయంతో ఫైనల్‌కు చేరింది. రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌ను ఓడించిన దిల్లీ తుది పోరుకు వచ్చింది. కానీ, మరోసారి ముంబయి ఆధిపత్యం ప్రదర్శించి విజేతగా నిలిచింది. 

2021లో..: దిల్లీతో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో చెన్నై విజేతగా నిలిచి ఫైనల్‌కు చేరుకుంది. పాయింట్ల పట్టికలో డీసీదే అగ్రస్థానం అయినప్పటికీ.. సీఎస్కే తుది పోరుకు చేరింది. ఎలిమినేటర్, క్వాలిఫయర్‌ 2లో కోల్‌కతా గెలిచి ఫైనల్‌కు వచ్చింది. అక్కడ కేకేఆర్‌ను ఓడించిన చెన్నై ఛాంపియన్‌ అయింది.

2022లో: తొలిసారి అరంగేట్రం చేసిన గుజరాత్‌ టైటాన్‌ విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది. కెప్టెన్ పాండ్య నాయకత్వంలో జీటీ ఛాంపియన్‌గా అవతరించింది. తొలి క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌తో (18) గుజరాత్ (20) తలపడింది. ఫైనల్‌లోనూ వీరి మధ్య పోరు. కానీ, జీటీ గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

2023లో..: చెన్నై సూపర్ కింగ్స్‌ 2023 సీజన్‌ విజేతగా నిలిచింది. పాయింట్ల పట్టికలో గుజరాత్ (20), చెన్నై (17) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. తొలి క్వాలిఫయర్‌లో జీటీపై సీఎస్కే గెలిచింది. మళ్లీ ఫైనల్‌ వీరి మధ్య పడినపప్పటికీ.. చెన్నై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు