T20 World Cup: టీ20 ప్రపంచకప్‌.. ధోనీ సేన ‘మెరుపులు’ రోహిత్‌ సేన మరిపించేనా..?

టీ20 ఫార్మాట్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన ప్రపంచకప్‌ టైటిల్‌ను టీమ్‌ఇండియా కైవసం చేసుకొంది. ఇక ఆ తర్వాత గత టీ20 ప్రపంచకప్‌ వరకు ఒక్కసారి కూడానూ మన ఖాతాలో వచ్చి చేరలేదు. మరోసారి ఆసీస్‌ వేదికగా పొట్టి కప్‌ కోసం భారత్‌ బరిలోకి దిగింది. 

Updated : 21 Oct 2022 16:58 IST

టీమ్‌ఇండియా తొలి పొట్టి ప్రపంచకప్‌ను నెగ్గి 15 వసంతాలను పూర్తి చేసుకొంది. కొత్త కెప్టెన్‌.. కొంగొత్త ఫార్మాట్‌.. పదిహేను మంది సభ్యులు కలిగిన జట్టులో కేవలం ఐదుగురికి మాత్రమే కాస్త ఎక్కువ అంతర్జాతీయ అనుభవం ఉంది. కానీ అంతకుముందే జరిగిన వన్డే ప్రపంచకప్‌లో సచిన్‌-దాదా-ద్రవిడ్‌-లక్ష్మణ్‌ వంటి దిగ్గజాలతో కూడిన భారత్‌ ఘోర పరాభవం ఎదుర్కొంది. వాటన్నింటినీ అధిగమించి ‘కెప్టెన్‌ కూల్‌’ ధోనీ నాయకత్వంలో పాకిస్థాన్‌ను చిత్తు చేసి మరీ టైటిల్‌ను ఖాతాలో వేసుకొని భారత్‌ సంచలనం సృష్టించింది. దక్షిణాఫ్రికా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి క్రికెట్‌ పండగొచ్చింది. ఆసీస్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమైంది. 22వ తేదీ నుంచి సూపర్‌ 12 దశలో మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

‘‘ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలిచి.. కప్‌ను స్వీకరించే వరకూ ధోనీ మా కెప్టెన్‌ అని ప్రత్యేకంగా అనుకోలేదు. ఎందుకంటే ప్రతి ఆటగాడు చెప్పే సూచన, సలహాలను హుందాగా స్వీకరించేవాడు’’..  అని నాటి చిరస్మరణీయ విజయాలను గుర్తు చేసుకుంటూ హర్భజన్‌ సింగ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. అందుకే ధోనీని కెప్టెన్‌ కూల్ అని పిలిచేది. తొలిసారి కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచి సారథిగా ఆఖరి మ్యాచ్‌ వరకు ఎంఎస్ ధోనీ జట్టును నడింపించిన విధానం మారలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు మరే భారత సారథికి సాధ్యం కాని విధంగా రెండు ప్రపంచకప్‌లను (టీ20, వన్డే) అందించిన ఘనత ధోనీ సొంతం. 

ఎప్పుడో పదిహేనేళ్ల కిందట టీ20 ప్రపంచకప్‌ గెలిచి చరిత్ర సృష్టించిన భారత్‌.. తాజాగా టైటిల్‌ వేటలో వెనుకబడిపోయింది.  కెప్టెన్‌ రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ కోసం బరిలోకి దిగింది. తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో తలపడనుంది. తొలిసారి ప్రపంచకప్‌ను అందుకొన్న జట్టులో సభ్యుడైన రోహిత్ శర్మ.. ఈసారి కెప్టెన్‌గా వ్యవహరిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.  బుమ్రా, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు లేకపోవడం భారత్‌కు కాస్త ఇబ్బందిగాకరంగా మారే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడున్న జట్టులో స్టార్లకు కొదవేంలేదు.  2007 టీ20 ప్రపంచకప్‌ విజేత జట్టుతో పోలిస్తే ప్రస్తుత స్క్వాడ్‌ కాస్త పైచేయి సాధిస్తుంది. కానీ, ధోనీ నాయకత్వంలోని జట్టుకు.. ఇప్పటి రోహిత్ సేనకు మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకుంటే కప్‌ను సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.

అప్పట్లో అలా.. 

2007 వన్డే ప్రపంచకప్‌.. భారత క్రికెట్‌ చరిత్రలో పీడకల వంటిది. దిగ్గజాలు సచిన్ తెందూల్కర్, సౌరభ్‌ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ ఉన్నప్పటికీ.. బంగ్లాదేశ్‌పైనా ఓడిపోయి గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది. దీంతో సమూలంగా మార్పులు చేస్తూ కొత్త ఫార్మాట్‌కు యువకులు ఎక్కువగా ఉన్న టీమ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. అందులో భాగంగానే సీనియర్‌ అయిన యువరాజ్‌ను కాదని.. ధోనీకి కెప్టెన్సీ అప్పగించింది. యువీని డిప్యూటీ నియమించింది. అప్పటి వరకు టీమ్‌ఇండియా ఆడింది కేవలం నాలుగైదు టీ20లు మాత్రమే. దూకుడుగా ఆడే వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, రాబిన్‌ ఉతప్ప, యూసఫ్‌ పఠాన్‌ తదితరులను ఎంపిక చేసింది. ఫైనల్‌లో కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడింది గౌతమ్‌ గంభీర్‌. పాకిస్థాన్‌ అంటే పూనకం వచ్చినట్లు చెలరేగేవాడు. యువకులు కూడా తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొన్నారు. 

రోహిత్ సేనలో అంతా స్టార్లే.. 

తొలి టీ20 ప్రపంచకప్‌ను నెగ్గిన తర్వాత 2008లో భారత టీ20 లీగ్‌ వచ్చాక.. ఈ ఫార్మాట్‌లో కొత్త స్టార్లు పుట్టుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా లీగుల్లోనే పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లను ఆడేశారు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ ఏడాది రోహిత్‌ నాయకత్వంలో భారీగా పొట్టి మ్యాచ్‌లను ఆడటం విశేషం. టీ20 ప్రపంచకప్‌-2022కు వేదిక ఆస్ట్రేలియా. ఫాస్ట్‌ పిచ్‌లతోపాటు బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా ఉంటాయి. దీంతో రోహిత్, రాహుల్, విరాట్, సూర్యకుమార్‌, దినేశ్‌ కార్తిక్‌, రిషభ్‌ పంత్‌, దీపక్ హుడా.. వంటి హిట్టర్లతోపాటు హార్దిక్‌ పాండ్య, అశ్విన్‌, అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్లతో టీమ్‌ఇండియా బరిలోకి దిగుతోంది. అయితే ప్రదర్శనలో నిలకడలేమి ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. స్థిరంగా టోర్నీ ఆద్యంతం ఆడేది ఒకరిద్దరు మాత్రమే. మిగతావారు ఎప్పుడు ఎలా ఆడతారో అంచనా వేయడం కష్టం. 

బౌలింగ్‌లో ప్రధాన తేడా అదే..

ధోనీ నాయకత్వంలోని బౌలింగ్‌ దళం విభిన్న మేళవింపులతో ఉంది. అజిత్‌ అగర్కార్‌, హర్భజన్‌ సింగ్‌ మాత్రమే సీనియర్లు. వీరిద్దరి నేతృత్వంలో యువ బౌలర్లు శ్రీశాంత్, ఇర్ఫాన్‌ పఠాన్‌, జోగిందర్‌ శర్మ అద్భుతంగా బౌలింగ్‌ వేశారు. కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థులను వణికించారు. దక్షిణాఫ్రికా పిచ్‌లు బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లోనూ బౌలర్లు సమష్టిగా రాణించారు. లీగ్‌ దశలో ఒక్క మ్యాచ్‌ రద్దు కాగా.. ఒక మ్యాచ్‌లో మాత్రమే భారత్ ఓడింది. ఫైనల్‌ సహా అన్ని మ్యాచుల్లోనూ బౌలర్లు సమష్టిగా రాణించారు. ఎంతో ఒత్తిడి ఉండే తుదిపోరులో భారత బ్యాటర్లు చేసిన 157 పరుగులను కాపాడటం సాధారణ విషయం కాదు. అప్పటికే పాక్‌ ఒకసారి మనపై ఓడిపోవడంతో కాస్త ఆవేశంగానే ఉంది. అలాంటి సమయంలోనూ బౌలర్లు దాయాది దేశంపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ బంతులను సంధించారు. 

మరిప్పుడో.. 

ప్రస్తుత టీమ్‌ఇండియా జట్టుకు ఏకైక ఫోబియా.. 19వ ఓవర్.. ఇన్నింగ్స్‌లోని అన్ని ఓవర్లను అద్భుతంగా వేసే స్టార్‌ బౌలర్లు సైతం ఈ ఓవర్‌ వచ్చేసరికి ఎందుకో ధారాళంగా పరుగులు ఇచ్చేస్తారు. అది బుమ్రా, సిరాజ్‌, హర్షల్‌, భువనేశ్వర్‌, అర్ష్‌దీప్‌ అయినా సరే బాదుడు మాత్రం తప్పడంలేదు. ఈ ప్రపంచకప్‌నకు బుమ్రా దూరం కాగా.. పేస్‌ బౌలింగ్‌ దళం హర్షల్‌ పటేల్, భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌, షమీ/సిరాజ్‌ చేతుల మీదుగా దాడి చేయనుంది. వీరంతా మ్యాచ్‌ విన్నర్లే.. కానీ, 19వ ఓవర్‌ వేయనంతవరకే సుమా.. ఎందుకంటే ఇటీవల ఆసియా కప్‌ నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ల వరకు పరిశీలిస్తే నిజమేనని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. డెత్‌ ఓవర్ల సమస్యను అధిగమిస్తేనే భారత్‌ కప్‌ వేటలో ముందుండే అవకాశం ఉంది. మరి ఆ బౌలర్‌ ఎవరు అవుతారో తెలియాలంటే వేచి చూడాలి. అంతేకాకుండా ఇటీవల నోబాల్స్ వేయడం యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌కు పరిపాటిగా మారింది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఒకే ఓవర్‌లో రెండు నోబాల్స్‌ వేయడం గమనార్హం. 

ఫీల్డింగ్‌లో మెరు‘పులులే’.. 

టీ20ల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఎంత కీలకమో.. ఫీల్డింగ్‌ అంతే ముఖ్యం. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఓటమి తప్పదు. 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు కలిసొచ్చిన అంశాల్లో ఫీల్డింగ్‌ ఒకటి. ఒక వైపు యువరాజ్‌ సింగ్‌ ఉన్నాడంటే.. అక్కడ గోడ కట్టినట్టే. బంతి అతడిని దాటి ముందుకెళ్లడం దాదాపు అసాధ్యం. మరోవైపు రాబిన్‌ ఉతప్ప, ఇర్ఫాన్‌ పఠాన్‌, శ్రీశాంత్‌ చాలా చురుగ్గా ఉండేవారు. బంతిని వదిలేవారు కాదు. అలా ఫైనల్ మ్యాచ్‌లో శ్రీశాంత్‌ క్యాచ్‌ గుర్తుంది కదా. మిస్బా కొట్టిన బంతిని వెనక్కి పరుగెడుతూ ఒడిసి పట్టిన తీరు అభిమానుల ఎప్పటికీ కళ్లల్లో మెదులుతూనే ఉంటుంది.  పొరపాటున ఆ క్యాచ్‌ మిస్‌ అయితే మాత్రం.. గత ఆసియా కప్‌లో అర్ష్‌దీప్‌పై వచ్చిన విమర్శలు కంటే భారీగా వచ్చి ఉండేవి. కీలకమైన సమయంలో అర్ష్‌దీప్‌ పాక్‌ బ్యాటర్‌ క్యాచ్‌ను చేజార్చడంతో మ్యాచ్‌లో ఓడిపోవాల్సి వచ్చింది. 

‘‘శ్రీశాంత్‌ పట్టింది కేవలం క్యాచ్‌ మాత్రమే కాదు.. టీమ్‌ఇండియాకు ప్రపంచకప్‌’’ ఇవి ఇర్ఫాన్‌ పఠాన్‌ వ్యాఖ్యలు.. 

ఘోర వైఫల్యం.. కోహ్లీనే నయం..?

గత కొన్ని మ్యాచ్‌లను పరిశీలిస్తే రోహిత్‌ నాయకత్వంలోని టీమ్‌ఇండియా ఫీల్డింగ్ ప్రమాణాలు దారుణంగా ఉన్నాయి. చురుగ్గా ఉండే రవీంద్ర జడేజా దూరం కావడం భారత్‌ను మరింత కష్టాల్లో నెట్టినట్లే. యువ ఆటగాళ్లు కూడా బంతిని ఆపడంలో బాగా వెనుకబడిపోయారు. తొలి పొట్టి ప్రపంచకప్‌ జట్టుతో పోలిస్తే ఇప్పుడున్న ఆటగాళ్ల సగటు వయసును ఊహించలేం. ఎందుకంటే అప్పుడు సగటు కేవలం 23 ఏళ్లు మాత్రమే. అందులో ఒక్కరు కూడా 30 ఏళ్లు దాటిన ఆటగాడు లేకపోవడం గమనార్హం. కానీ, ఈసారి మాత్రం ఐదుగురు తప్పితే మిగతా అందరి వయసు 30కిపైనే. మొదటి టీ20 ప్రపంచకప్‌లో సభ్యులైన రోహిత్ శర్మ కెప్టెన్ కాగా.. దినేశ్‌ కార్తిక్‌ హార్డ్‌ హిట్టర్‌.. టీమ్‌ఇండియా సగటు వయసును చూస్తే ఆశ్చర్య పోవడం మీ వంతవుతుంది. ఎందకంటారా..? అది 30.6 కావడం విశేషం. అయితే ఇందులో ఫిట్‌నెస్‌పరంగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ మాత్రమే ముందుంటారు. అందుకే గత ‘మెరుపులు’.. ఈసారి మాత్రం పెద్దగా ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అక్కడ ధోనీ ఉన్నాడు..

ధోనీ గురించి హర్భజన్‌ చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా..  అందరి అభిప్రాయాలను, సలహాలను తీసుకొని సరైన నిర్ణయం వెల్లడించేవాడే మంచి నాయకుడు. అలాగే తన సొంత నిర్ణయం కూడా జట్టుకు మేలు చేసేలా ఉండాలి.  అప్పట్లో జాతీయ జట్టుకు కెప్టెన్సీ తొలిసారి స్వీకరించిన ధోనీకి.. కెరీర్‌ చరమాంకంలో సారథి ధోనీకి పెద్దగా తేడాలేదు. వేగంగా.. కచ్చితత్వంతో కూడిన నిర్ణయాలను తీసుకొనేవాడు. లేకపోతే అనుభవం ఉన్న బౌలర్లను కాదని.. పాక్‌తో ఫైనల్‌లో చివరి ఓవర్‌ను జోగిందర్‌ శర్మ వంటి మీడియం పేసర్‌కు బంతిని ఇవ్వడం సాహసమే. ఆటగాడిపై నమ్మకం ఉంచి ఫలితం రాబట్టడం ధోనీ ప్రత్యేకత. అలాగే మైదానంలో సహచరులపై కస్సుబస్సులాడిన సందర్భాలూ చాలా తక్కువ. పొరపాటున క్యాచ్‌ మిస్‌ అయినా ఆగ్రహం వ్యక్తం చేయడు. కీపర్‌ కావడంతో బంతిని ఎక్కడ వేస్తే బ్యాటర్‌ ఇబ్బంది పడతాడనే దానిపై పూర్తి అవగాహన ఉన్న కెప్టెన్‌.. ప్లేయర్‌.. బ్యాటర్‌.. స్టార్‌.. ఎంఎస్ ధోనీ.. అందుకే తన బౌలర్లకు స్వేచ్ఛనిస్తూనే కీలకమైన సూచనలు ఇస్తుంటాడు. 

దూకుడు ఉన్నా.. నిర్ణయాల్లో కనిపించదు!

ఇటీవల రోహిత్ శర్మ మైదానంలో ప్రవర్తించే తీరును చూస్తే.. సగటు అభిమాని కూడా కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నాడు. ఎందుకంటే సొంత జట్టు సభ్యులపైనే అసహనం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఏదైనా క్యాచ్‌ను వదిలిపెట్టినా.. ఫీల్డింగ్‌లో, డీఆర్‌ఎస్‌ తీసుకోవడంలో తప్పిదం జరిగినా.. వెంటనే తన ముఖ కవళికలు మారిపోతున్నాయి. ఇటీవల ఆసియా కప్‌లో అర్ష్‌దీప్‌ క్యాచ్‌ డ్రాప్‌ ఘటననే తీసుకొందాం.. వెంటనే తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది. కీలకమైన క్యాచ్‌ అయినప్పటికీ.. అలా ప్రవర్తిస్తే సదరు ఆటగాడి ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే తర్వాత జరిగిన ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌లో అర్ష్‌దీప్‌పై జరిగిన ట్రోలింగ్‌ను తప్పుబడుతూ.. యువ బౌలర్‌కు మద్దతుగా నిలిచాడు. ప్రత్యర్థులపై దూకుడుగా ఉంటే ఫర్వాలేదు కానీ.. సొంత ఆటగాళ్లపై ఇలా కస్సుబుస్సులాడితే మాత్రం జట్టు ప్రదర్శనపైనే ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.

-ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని