IPL 2023 : ఈ ఆటగాళ్లకు ఇదే చివరి ఐపీఎల్‌ సీజనా..?

పలువురి ఆటగాళ్లకు ఈ ఐపీఎల్‌(IPL 2023) చివరి సీజన్‌ అయ్యే అవకాశం ఉంది. వీరిలో ధోనీ(MS Dhoni) పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా.. మిగతా ఆటగాళ్లెవరో తెలుసుకుందామా..

Updated : 18 Apr 2023 15:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఈ ఐపీఎల్‌(IPL 2023) సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్‌ మ్యాచ్‌కు ఉత్కంఠ పెంచుతూ.. అసలుసిసలు క్రికెట్‌ మజాను పంచుతోంది. ఇక ఆయా ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన చూసి.. వారి అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. మరోవైపు పలువురు ఆటగాళ్ల రిటైర్మెంట్‌ వార్తలు.. అభిమానులను కలవరపెడుతున్నాయి. ఎందుకంటే.. ఇటీవల ప్రతి సీజన్‌కు ముందు చెన్నై సారథి ధోనీకి ఇదే చివరి ఐపీఎల్‌ అంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.

ఈ వార్తల వెనక ప్రధాన కారణం.. ఆటగాళ్ల వయసు. వయసు పెరుగుతున్న కొద్దీ.. వారికి ఫిట్‌నెస్‌తోపాటు.. మునుపటి ఫామ్‌ను కొనసాగించడం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ధోనీతోపాటు ఇదే చివరి ఐపీఎల్‌ అయ్యే అవకాశమున్న పలువురు ప్రముఖ ఆటగాళ్లపై ఓ లుక్కేస్తే..

  1. ఎంఎస్‌ ధోనీ (MS Dhoni)..  భారత క్రికెట్‌ చరిత్రలో ఈ పేరే ఓ సంచలనం. ఇటు ఐపీఎల్‌లోనూ నాలుగు ట్రోఫీలు తన జట్టుకు అందించి ఉత్తమ సారథిగా కొనసాగుతున్నాడు. గత సీజనే చివరిదంటూ వార్తలు వచ్చాయి. అయితే.. 41 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్‌గా ఉండి, అద్భుతమైన వ్యూహాలతో చెన్నై జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. వయసు రీత్యా.. ఇదే చివరి ఐపీఎల్‌ అంటూ పలువురు మాజీలు పేర్కొంటున్నారు. అయితే.. ధోనీ లేని చెన్నై జట్టును ఊహించుకోవడం అభిమానులకు కష్టమే.
  2. అమిత్‌ మిశ్రా(Amit Mishra).. బంతులను సుడులు తిప్పుతూ.. బ్యాటర్లను ఇబ్బంది పెట్టే లెగ్‌ స్పిన్నర్లలో అమిత్‌ మిశ్రా ఒకరు. ప్రస్తుత సీజన్‌లో లఖ్‌నవూకు ఆడుతున్న అమిత్‌.. అద్భుత ప్రదర్శనలు ఎన్నోసార్లు ఇచ్చాడు. ఇప్పటి వరకూ 156 మ్యాచ్‌ల్లో 169 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో మూడు సార్లు హ్యాట్రిక్‌ వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఏ జట్టుకు ఆడినా.. మంచి ప్రదర్శనే ఇస్తాడు. ప్రస్తుతం 40 ఏళ్లకు చేరిన మిశ్రాకు ఇదే చివరి ఐపీఎల్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
  3. దినేశ్‌ కార్తిక్‌(Dinesh Karthik).. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నప్పటికీ.. గత  సీజన్లలో మంచి ప్రదర్శనే ఇచ్చాడు బెంగళూరు వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తిక్‌. ఫినిషర్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. కోల్‌కతా జట్టుకు కెప్టెన్‌గా కూడా కొంత కాలం వ్యవహరించాడు. 37 ఏళ్ల ఈ ఆటగాడు వచ్చే సీజన్‌ నుంచి ఆడకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వ్యాఖ్యాతగా మారిన డీకే.. అదే కొనసాగించే అవకాశాలు లేకపోలేదు.
  4. ఇషాంత్‌ శర్మ(Ishant Sharma).. దిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడైన ఇషాంత్‌ శర్మ.. చివరి సారిగా ఆ జట్టుకు 2021 సీజన్‌లో ఆడాడు. ఆ తర్వాత కూడా అతడు దిల్లీ జట్టులో భాగమైనప్పటికీ.. తుది జట్టులోకి మాత్రం రావడం లేదు. గత సీజన్‌లో అతడిని రూ.50 లక్షలకు వేలంలో దక్కించుకుంది. ఇప్పటి వరకూ 93 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్‌.. 72 వికెట్లు పడగొట్టాడు. బహుశా ఈ సీజనే అతడికి ఆఖరిదయ్యే అవకాశం ఉంది.
  5. అంబటి రాయుడు(Ambati Rayudu).. అద్భుతమైన ప్రదర్శనలతో చెన్నైకి ఎన్నో విజయాలను అందించాడు అంబటి రాయుడు. 180 ఇన్నింగ్స్‌లు ఆడి నాలుగు వేలకుపైగా పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, 22 అర్ధ శతకాలు ఉన్నాయి. గత ఐపీఎల్‌ సీజన్‌లోనే తన రిటైర్మెంట్‌పై ట్వీట్‌ చేసి.. ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే.. అతడి మదిలో రిటైర్మెంట్‌పై ఆలోచనలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం అతడి ప్రదర్శన చూస్తుంటే.. ఈ సీజనే అతడికి ఆఖరిది కానున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అతడి వయసు 37 ఏళ్లు. రాజకీయరంగ ప్రవేశం చేస్తాడనే వార్తలూ వచ్చాయి. అయితే వీటిపై రాయుడు అధికారికంగా స్పందించలేదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు