IND vs NZ: భారత్-కివీస్‌ తొలి సెమీస్‌.. వీరి ఆటపై ఓ కన్నేయండి!

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) నాకౌట్ దశకు సమయం ఆసన్నమవుతోంది. బుధవారం ముంబయిలోని వాంఖడే వేదికగా తొలి సెమీఫైనల్‌ జరగనుంది. 

Published : 14 Nov 2023 19:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) తొలి సెమీస్‌కు భారత్-న్యూజిలాండ్‌ (IND vs NZ) జట్లు సన్నద్ధమవుతున్నాయి. అజేయంగా టీమ్‌ఇండియా నాకౌట్‌ దశకు చేరుకోగా.. మరో మూడు జట్లతో పోటీపడి మరీ కివీస్‌ నాలుగో స్థానంతో సెమీఫైనల్‌ బెర్తును దక్కించుకుంది. లీగ్‌ దశలో ఇప్పటికే న్యూజిలాండ్‌ను భారత్‌ ఓడించిన సంగతి తెలిసిందే. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు అదరగొట్టేస్తున్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా పలువురి మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది.

రోహిత్ శర్మ VS ట్రెంట్ బౌల్ట్‌

ఇప్పటి వరకు ఈ వరల్డ్‌ కప్‌లో భారత ఓపెనర్‌, కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శిస్తూ వస్తున్నాడు. వేగంగా పరుగులు చేస్తూ మంచి ఆరంభం ఇవ్వడం వల్ల మిగతా బ్యాటర్లపై ఒత్తిడి తగ్గించాడు. ఇలానే 9 మ్యాచుల్లో 503 పరుగులు చేసేశాడు. మరోవైపు అతడికి కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ నుంచి ప్రమాదం పొంచి ఉంది. లెఫ్ట్‌ఆర్మ్‌ పేసర్‌ అయిన బౌల్ట్‌ 13 వికెట్లు తీశాడు. పవర్‌ప్లేలో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన చేయగలడు. ఇలాంటి బౌల్ట్‌ను రోహిత్ ఇన్నింగ్స్‌ ప్రారంభంలో అడ్డుకోగలిగితే చాలు టీమ్‌ఇండియా ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయం. 


విరాట్ కోహ్లీ VS మిచెల్ శాంట్నర్‌

వన్డే ప్రపంచకప్‌లో టాప్‌ స్కోరర్‌ విరాట్ కోహ్లీ. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 99 సగటుతో 594 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ ఇచ్చే శుభారంభాలను కొనసాగించే బాధ్యతను విరాట్ కోహ్లీ తీసుకుంటున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలు, ఐదు అర్ధశతకాలు సాధించాడు. ప్రస్తుతం వన్డేల్లో 49 శతకాలతో కొనసాగుతున్న విరాట్ మరో సెంచరీ బాదేస్తే చూడాలనేది అభిమానుల ఆకాంక్ష. అయితే, కోహ్లీకి కివీస్‌ లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్‌ నుంచి సవాల్‌ తప్పదు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎడమచేతివాటం బౌలర్ వాండర్‌ మెర్వ్‌ బౌలింగ్‌లోనే కోహ్లీ ఔటయ్యాడు. సెమీస్‌లో కివీస్‌ బౌలర్‌ నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే శాంట్నర్ 16 వికెట్లు పడగొట్టాడు. 


రచిన్‌ రవీంద్ర VS బుమ్రా

భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ జస్‌ప్రీత్ బుమ్రా. తొమ్మిది మ్యాచుల్లో 17 వికెట్లు పడగొట్టాడు. ఆరంభంలో వికెట్లు తీసి జట్టుకు బ్రేక్‌ ఇస్తూ వచ్చాడు. ఇక సెమీస్‌లోనూ ఇదే ప్రదర్శనను అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, కివీస్‌ ఓపెనర్లు డేవన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్రను ఎలా అడ్డుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. అత్యధిక పరుగుల జాబితాలో రచిన్‌ రవీంద్ర 565 పరుగులు సాధించాడు. మూడు సెంచరీలూ ఉన్నాయి. మరో ఓపెనర్‌ డేవన్ కాన్వే పెద్దగా ఫామ్‌లో లేకపోయినా.. డేంజరస్‌ బ్యాటర్ అనడంలో సందేహం లేదు. ఐపీఎల్‌లో ఆడిన అనుభవమూ అతడి సొంతం. 

డారిల్‌ మిచెల్ VS రవీంద్ర జడేజా

పేసర్లు ఆరంభంలో వికెట్లు తీయగా.. మిడిల్ ఓవర్లలో కుల్‌దీప్‌తో కలిసి రవీంద్ర జడేజా వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. ఈ వరల్డ్‌ కప్‌లో ఇప్పటికే 16 వికెట్లు తీశాడు. కీలక భాగస్వామ్యాలను విడగొడుతూ బ్రేక్‌ ఇస్తూ ఉంటాడు. అయితే, న్యూజిలాండ్‌ టాప్‌ ఆర్డర్‌లో డారిల్ మిచెల్ కీలక ఆటగాడు. దూకుడుగా ఆడుతూ పరుగులు రాబడతాడు. 9 మ్యాచుల్లో 418 పరుగులు నమోదు చేశాడు. మిచెల్‌ బ్యాటింగ్‌కు జడేజా స్పిన్‌ బౌలింగ్‌ మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. అదేవిధంగా గ్లెన్‌ ఫిలిప్స్‌, టామ్‌ లేథమ్‌ను కూడా నిలువరించాల్సిన బాధ్యత కుల్‌దీప్‌-జడ్డూ స్పిన్‌ ద్వయం మీదనే ఉంది. 


కేఎల్ రాహుల్, శ్రేయస్‌ VS లాకీ ఫెర్గూసన్‌

భారత మిడిలార్డర్‌ ఈ టోర్నీలో అదరగొట్టేస్తోంది. శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్‌ గత మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై శతకాలతో చెలరేగిపోయారు. శ్రేయస్‌ 9 మ్యాచుల్లో 421 పరుగులు సాధించగా.. కేఎల్ రాహుల్ 347 పరుగులు చేశాడు. కానీ, వీరికి కివీస్‌ ఫాస్ట్‌ బౌలర్ లాకీ ఫెర్గూసన్ నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. మిచెల్ శాంట్నర్‌తోపాటు మిడిల్ ఓవర్లలో లాకీ తన పదునైన బౌలింగ్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. ప్రస్తుత వరల్డ్‌ కప్‌లో లాకీ ఆరు మ్యాచుల్లో 10 వికెట్లు పడగొట్టాడు. నిలకడగా 145 నుంచి 150 కి.మీ వేగంతో బంతులను సంధించగల సత్తా ఫెర్గూసన్ సొంతం. 


కివీస్‌ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ VS భారత బౌలింగ్

అయితే, కేన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్‌ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఏమాత్రం పట్టువదిలినా మొదటికే మోసం వస్తుంది. మిగతా బ్యాటర్లు ఏదో బంతికి ఉత్సాహపడి ఔటయ్యే అవకాశం ఉంది. కానీ, కేన్ మాత్రం ఆరంభం నుంచి ఎలా ఆడతాడో భారీ ఇన్నింగ్స్‌ తర్వాత కూడానే అదే నింపాదిగా పరుగులు రాబడుతాడు. అయితే, ఎక్కడ గేర్‌ మార్చాలో బాగా తెలిసిన బ్యాటర్. అతడిని క్రీజ్‌లో కుదురుకోనీయకుండా చేయాల్సిన కఠిన బాధ్యత భారత బౌలర్లపై ఉంది. ఈ టోర్నీలో ఆడిన మ్యాచ్‌లు తక్కువే కానీ. క్రీజ్‌లో పాతుకుపోతే మాత్రం ఓ పట్టాన పెవిలియన్‌కు చేరడు. కాబట్టి, వన్‌డౌన్‌లో వచ్చే కేన్‌ను త్వరగా ఔట్‌ చేస్తే మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని