T20 League : టీ20 లీగ్‌ ప్లేఆఫ్స్.. మూడు బెర్తుల కోసం ఐదు టీమ్‌లు ‘తగ్గేదేలే ’!

టీ20 లీగ్‌ ఆఖరి దశకు చేరుతోంది. లీగ్ దశలో మరో ఏడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. అయితే ప్లేఆఫ్స్‌ బెర్తుల్లో గుజరాత్‌ మాత్రమే ఇప్పటి వరకు ఖాయం చేసుకుంది. ఇక మిగిలిన..

Updated : 16 May 2022 17:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌ ఆఖరి దశకు చేరుతోంది. లీగ్ దశలో మరో ఏడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. అయితే ప్లేఆఫ్స్‌ బెర్తుల్లో గుజరాత్‌ మాత్రమే ఇప్పటి వరకు ఖాయం చేసుకుంది. ఇక మిగిలిన మూడు స్థానాల కోసం ఐదు జట్లు ముందు వరుసలో ఉన్నాయి. మరి ఆ జట్లేవి.. వీటిల్లో ఏ జట్టు ముందుంది.. వాటికున్న అవకాశాలు ఏంటనేది తెలుసుకుందాం.. 

  1. గుజరాత్‌ : ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్లేఆఫ్స్‌కు వెళ్లిన తొలి జట్టుగా గుజరాత్‌ నిలిచింది. ఇప్పటి వరకు 13 మ్యాచుల్లో పది విజయాలతో 20 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఇక మరే జట్టూ తనను క్రాస్‌ చేసుకోని వెళ్లలేదు. మిగిలిన ఒక్క మ్యాచులోనూ విజయం సాధించి లీగ్‌ దశను ముగించాలని హార్దిక్ నేతృత్వంలోని గుజరాత్‌ భావిస్తోంది. అయితే లీగ్‌ స్టేజ్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చినప్పటికీ నాకౌట్‌ రాణించడం చాలా కీలకం. 
  2. రాజస్థాన్‌ : ప్రస్తుతం ఎనిమిది విజయాలతో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్‌ (16)కు బెర్తు ఖరారు అని చెప్పలేని పరిస్థితి. తన ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే మాత్రం తిరుగుండదు.  లఖ్‌నవూ వంటి బలమైన జట్టును ఓడించిన రాజస్థాన్‌కు చివరి మ్యాచ్‌లో చెన్నైని బోల్తా కొట్టించడం పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే చెన్నైని ఓడించి రెండో స్థానం సుస్థిరం చేసుకుంటే నాకౌట్‌ దశలో అక్కరకొస్తుంది. 
  3. లఖ్‌నవూ : ఆరంభంలో గుజరాత్‌తో పోటీగా విజయాలు సాధించిన లఖ్‌నవూ గత రెండు మ్యాచుల్లో ఓటమిపాలై ప్లేఆఫ్స్‌ అవకాశాలను కఠినం చేసుకుంది. లేకపోతే గుజరాత్‌తోపాటు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టుగా లఖ్‌నవూ అవతరించేది. ప్రస్తుతం 13 మ్యాచుల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి మూడో స్థానంలో కొనసాగుతోంది. తన ఆఖరి మ్యాచ్‌లో కోల్‌కతాతో తలపడనుంది. మరోవైపు కోల్‌కతాకు ఈ మ్యాచ్‌ ఫలితం పెద్దగా ఉపయోగపడదు. ఆరు విజయాలతో 12 పాయింట్లను మాత్రమే దక్కించుకుంది. అయితే లఖ్‌నవూ అవకాశాలను దెబ్బతీసే ఛాన్స్‌ మాత్రం కోల్‌కతా ముందుంది. 
  4. బెంగళూరు : ఈసారి ఎలాగైనా కప్‌ను సాధించాలనే పట్టుదలతో వచ్చిన బెంగళూరు తీవ్ర నిరాశపరుస్తోంది. కీలక బ్యాటర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ విఫలం కావడం బెంగళూరు ఆశలకు గండి పడేలా ఉంది. ప్రస్తుతం ఏడు విజయాలను సాధించి 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. తన ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడాల్సి ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న గుజరాత్‌ను తట్టుకుని విజయం సాధించడం అద్భుతమనే చెప్పాలి. ఒకవేళ గెలిస్తే మాత్రం.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి కనీసం నాలుగో స్థానంతోనైనా ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. 
  5. దిల్లీ- పంజాబ్‌ : ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారడానికి కారణం దిల్లీ, పంజాబ్‌ జట్లు.. కీలక సమయంలో విజయాలు సాధించి సై అంటూ ముందుకొచ్చాయి. ఇవాళ ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై ఒక జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది. గెలిచిన జట్టు ఆశలు సజీవంగా ఉండటంతోపాటు పాయింట్ల పట్టికలో ముందడుగు పడుతుంది. ఓడిన జట్టు దాదాపు ఇంటి ముఖం పట్టక తప్పదు. ప్రస్తుతం దిల్లీ (5), పంజాబ్‌ (7) ఆరేసి విజయాలతో 12 పాయింట్లు సాధించాయి. ఇక దిల్లీకి తన ఆఖరి మ్యాచ్‌లో ముంబయితో తలపడుతుంది. పంజాబ్‌కు హైదరాబాద్‌తో మ్యాచ్‌ ఉంది. అయితే ఇవాళ్టి మ్యాచే ఇరు జట్లకూ కీలకం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని