IND vs BAN: అలాంటి ఆటగాళ్లకు అస్సలు విశ్రాంతి ఇవ్వొద్దు: మాజీ క్రికెటర్‌

ఇంకో పది నెలల్లో వన్డే ప్రపంచకప్‌ రానుంది. ఇప్పటికైనా ప్రయోగాలు ఆపేసి.. జట్టు సన్నద్ధతపై దృష్టిసారించాలని బీసీసీఐకి టీమ్‌ఇండియా మాజీలు సూచనలు చేస్తున్నారు. తాజాగా మరొక మాజీ అయితే బాగా ఆడుతున్న వారికి విశ్రాంతి ఇవ్వొద్దని చెప్పాడు.

Updated : 09 Dec 2022 13:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత వరుసగా రెండు వన్డే సిరీస్‌లను భారత్ కోల్పోయింది. తొలుత న్యూజిలాండ్‌పై 1-0 (3 వన్డేలు), తాజాగా బంగ్లాదేశ్‌ చేతిలో 2-0 తేడాతో ఓటమిపాలైంది. బంగ్లాతో చివరి వన్డే మ్యాచ్‌ శనివారం జరగనుంది. పొట్టి కప్‌ సందర్భంగా మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం దారుణంగా ప్రదర్శన చేస్తున్నాడు. దీనంతటికి కారణం ఫామ్‌లో ఉన్న ఆటగాడికి విశ్రాంతినివ్వడమేనని మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత వివేక్ రజ్‌దాన్‌ అభిప్రాయపడ్డాడు. 

‘‘ఇప్పటికైనా ప్రయోగాలు చేయడం ఆపేయండి. గత కొన్ని నెలలుగా చాలా రకాలుగా చేశారు. ఇలాంటి వాటికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ప్రయోగాలు ఎక్కువైపోయాయి. వన్డే ప్రపంచకప్‌నకు ఇంకా చాలా సమయం ఉంది. జట్టును సన్నద్ధత చేయాలి. గత మూడేళ్లలో దాదాపు 35 మంది అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. ఇలాంటప్పుడు మరొక అంశం గురించి ఆలోచించాలి. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం సరైంది కాదు. వారిని ఆడించాలి. లేకపోతే విరాట్‌ కోహ్లీలా ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. పొట్టికప్‌ అదరగొట్టిన కోహ్లీ కివీస్‌తో సిరీస్‌కు విశ్రాంతి తీసుకొన్నాడు. దీంతో బంగ్లాదేశ్‌తో ప్రస్తుత వన్డే సిరీస్‌లో రాణించలేకపోయాడు. మళ్లీ ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడేలా ఉన్నాడు. అందుకే ఫామ్‌తో ఉన్నవారికి అవకాశాలు ఇస్తూనే ఉండాలి’’ అని వివేక్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని