Sachin - Razzak: వీరే డేంజరస్‌ బ్యాటర్లు.. సచిన్‌కు రెండో ర్యాంక్‌.. అతడిదే తొలి స్థానం: రజాక్‌

భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌లో తమ జట్టే పైచేయి సాధించాలని అభిమానులు ఆశిస్తుంటారు. అలాగే ఆటగాళ్లూ పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగి విజయం సాధించాలని కోరుకుంటారు. ఇరువైపులా అత్యుత్తమ ఆటగాళ్లు ఉంటే.. ఆ మ్యాచ్‌ రసవత్తరంగా సాగడం ఖాయం. పాక్‌ బౌలింగ్‌ను భయపెట్టిన క్రికెట్‌ దిగ్గజాల్లో సచిన్‌, సెహ్వాగ్‌ తప్పక ఉంటారు.

Published : 29 Mar 2023 13:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దాయాదుల పోరంటే.. భారత బ్యాటర్లకు పాకిస్థాన్‌ బౌలర్లకు మధ్య జరిగే రసవత్తరమైన సంగ్రామం. సచిన్, సెహ్వాగ్, గంగూలీ, ద్రవిడ్.. వంటి దిగ్గజాలను వసీం అక్రమ్, వకార్ యూనిస్, అక్తర్‌, అబ్దుల్ రజాక్, సక్లయిన్‌ ముస్తాక్, షాహిద్ అఫ్రిది తమ బౌలింగ్‌తో అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. ఐసీసీ టోర్నమెంట్లలో పాక్‌పై భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించగా.. ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం దాయాది దేశానిదే ఆధిక్యం.  ప్రపంచ స్థాయి బౌలర్లను వణికించిన భారత బ్యాటర్‌ ఎవరంటే మాత్రం ఠక్కున సచిన్ పేరును చెబుతారు. కానీ, పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్‌ రజాక్‌ మాత్రం సచిన్‌కు రెండో స్థానం కేటాయించాడు. మరి, పాక్‌ బౌలర్లకు డేంజరస్‌ బ్యాటర్‌గా మారిన ఆటగాడు మాత్రం వీరేంద్ర సెహ్వాగ్‌ అట. తాను ఆడిన సమయంలో మిడిలార్డర్‌లో యువరాజ్‌ సింగ్‌ అత్యంత ప్రమాదకరమైన ఆటగాడని రజాక్‌ పేర్కొన్నాడు. 

‘‘పాకిస్థాన్‌ జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్‌ అత్యంత ప్రమాదకారి. అతడి తర్వాత సచిన్‌ తెందూల్కర్. వీరిద్దరిని ఔట్‌ చేయడం కోసం పాక్‌ బౌలర్లు ప్రత్యేకంగా ప్రణాళికలను సిద్ధం చేసుకొనేవారు. వీరద్దరిని త్వరగా ఔట్‌ చేస్తే మ్యాచ్‌ను మేం గెలిచినట్లే. ఇక బౌలింగ్‌లో జహీర్‌ ఖాన్, ఇర్ఫాన్‌ పఠాన్‌, హర్భజన్‌ సింగ్‌ను ఎదుర్కోవడంలో మా బ్యాటర్లు పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగేవారు. అయితే, భారత మిడిలార్డర్‌లో యువరాజ్‌ సింగ్‌ డేంజరస్. సచిన్ - సెహ్వాగ్‌ జోడీ తర్వాత యువీ కీలకం. వీరిని ఔట్ చేసిన రోజు.. ఇవాళ కీలక వికెట్లు తీశాం అని అనుకొనేవాళ్లం. వారిని త్వరగా పెవిలియన్‌కు చేర్చడానికి పాక్‌ మేనేజ్‌మెంట్ సీరియస్‌గా దృష్టిపెట్టేది. ఎలా బౌలింగ్‌ చేయాలి.. ఫీల్డింగ్‌ను ఏ విధంగా సెట్‌ చేయాలి..? అనే అంశాలపై ప్రణాళికలను సిద్ధం చేసుకొని బరిలోకి దిగేవాళ్లం. ఇలాగే జహీర్, భజ్జీ, ఇర్ఫాన్‌ను ఎదుర్కోవడానికి మా బ్యాటర్లు సమయాత్తమయ్యేవారు’’ అని రజాక్ తెలిపాడు.అబ్దుల్‌ రజాక్‌ పాక్‌ తరఫున 46 టెస్టులు, 286 వన్డేలు, 32 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 5వేలకుపైగా పరుగులు.. 250కిపైగా వికెట్లు తీశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని