Team India: బ్యాటర్లను ప్రశ్నించరు.. ఫాస్ట్‌ బౌలర్లపైనే నిందలు: టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌

Eenadu icon
By Sports News Team Published : 28 Aug 2025 00:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: వర్క్‌లోడ్ నేపథ్యంలో టీమ్ఇండియా (Team India) స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్‌ టూర్‌లో అయిదు టెస్టులకు గానూ కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ విషయమై అతడు ముందుగానే బీసీసీఐకి (BCCI) సమాచారమిచ్చాడు. అయినప్పటికీ పలువురు క్రికెట్‌ పండితులు, అభిమానుల నుంచి బుమ్రా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఈ విషయంలో అతడికి 1983 వరల్డ్‌ కప్‌ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడైన మాజీ క్రికెటర్‌ బల్వీందర్‌ సింగ్‌ సంధు (Balvinder Singh Sandhu) మద్దతుగా నిలిచాడు. వర్క్‌లోడ్‌ నేపథ్యంలో బ్యాటర్లు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు బౌలర్లు ఎందుకు తీసుకోకూడదని అతడు ప్రశ్నించాడు. 

‘గడిచిన ఏడు సంవత్సరాల్లో ఎంత మంది బ్యాటర్లు విరామం తీసుకోకుండా అన్ని మ్యాచ్‌లు ఆడారు?ఎంతమంది సిరీస్‌ మధ్యలో నుంచి వైదొలగకుండా అన్ని మ్యాచ్‌లు ఆడారు? నిజానికి ఈ విషయంలో బ్యాట్స్‌మెన్‌ను ఎవరూ ప్రశ్నించరు. కానీ ఫాస్ట్‌ బౌలర్ల విషయానికొచ్చేసరికి.. ప్రతి ఒక్కరూ నిందించడానికి సిద్ధంగా ఉంటారు. నిజానికి ఫాస్ట్‌ బౌలింగ్‌ చాలా కష్టమైన పని’ అని బల్వీందర్‌ సింగ్‌ సంధు పేర్కొన్నాడు.

‘జస్‌ప్రీత్‌ బుమ్రాకు గత ఏడు సంవత్సరాల్లో మ్యాచ్‌కు మ్యాచ్‌కు మధ్య సగటున కేవలం 3.2 రోజులు మాత్రమే విశ్రాంతి దొరికింది. మహ్మద్‌ సిరాజ్‌కు (Mohammed Siraj) 3.5 రోజులు, మహ్మద్‌ షమీకి (Mohammed Shami) 3.7 రోజులు విరామం లభించింది. ఈ గణాంకాలు నిజంగా నన్ను విస్మయానికి గురి చేశాయి. బుమ్రా, షమీ గాయాల కారణంగానే జట్టుకు దూరమయ్యారు. దానికి ఈ గణాంకాలే సాక్ష్యం’ అని బల్వీందర్‌ సింగ్‌ సంధు విశ్లేషించాడు. 

ఇంగ్లాండ్‌ టూర్‌లో టీమ్ఇండియా తరఫున మూడు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన జస్‌ప్రీత్‌ బుమ్రా 14 వికెట్లు తనఖాతాలో వేసుకున్నాడు. అలాగే రెండుసార్లు అయిదు వికెట్ల ప్రదర్శన కూడా చేశాడు. యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 9 నుంచి ఆసియా కప్‌ (Asia cup) జరగనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ (BCCI) ఆగస్టు 19న 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ఇండియా స్వ్కాడ్‌ను ప్రకటించింది. ఇందులో జస్‌ప్రీత్‌ బుమ్రా స్థానం దక్కించుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు