Shamar Joseph: బాడీగార్డ్‌ నుంచి బౌలర్‌ దాకా..

పేద కుటుంబంలో అయిదుగురు పిల్లల్లో ఒకడైన ఆ కుర్రాడికి క్రికెట్‌పై ఆశ పుట్టింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకుండా.. తాను కలలు కన్న విండీస్‌ జాతీయ జట్టులోకి వచ్చేశాడు. అతడే విండీస్‌ నయా పేస్‌ సంచలనం షామర్‌ జోసెఫ్‌. 

Published : 19 Jan 2024 21:25 IST

వెస్టిండీస్‌ (West Indies)లోని ఓ మారుమూల గ్రామం.. ఆ గ్రామంలో ఓ పేద కుటుంబం. అయిదుగురు పిల్లల్లో ఒకడైన ఆ కుర్రాడికి క్రికెట్‌పై ఆశ పుట్టింది. నిజానికి క్రికెట్‌ ఆడే పరిస్థితి లేదతనికి. అయినా కూడా ఆ కుర్రాడు ఆర్థిక ఇబ్బందులను దాటుకుంటూ ఎదిగాడు. తాను కలలు కన్న విండీస్‌ జాతీయ జట్టులోకి వచ్చేశాడు. అంతేకాదు ఆస్ట్రేలియాతో టెస్టు అరంగేట్రం చేయడమే కాదు తొలి టెస్టులోనే 5 వికెట్లతో అదరగొట్టాడు. ఆ కుర్రాడే షామర్‌ జోసెఫ్‌ (Shamar Joseph). విండీస్‌ నయా పేస్‌ సంచలనం.

క్రికెటర్‌ కావడం ఓ చిత్రం

గయానాలోని బార్కారా గ్రామానికి చెందిన జోసెఫ్‌ది పేద కుటుంబం. అతడు నివసించే గ్రామంలో టీవీలు కూడా తక్కువ. ఎప్పుడైనా పాత క్రికెట్‌ మ్యాచ్‌ల హైలైట్స్‌ వస్తుంటే కన్నార్పకుండా చూసేవాడు. వెస్టిండీస్‌ దిగ్గజ పేసర్లు ఆంబ్రోస్, వాల్ష్‌లను ఆరాధించేవాడు. ఎప్పుడైనా స్నేహితుల దగ్గర బంతి దొరికితే ఆంబ్రోస్, వాల్ష్‌ మాదిరిగానే బంతిని పట్టుకుని వదిలేందుకు ప్రయత్నించేవాడు. వీలైనప్పుడల్లా క్రికెట్‌ టోర్నీల్లో ఆడుతూ డబ్బులు సంపాదించి ఇంట్లో ఇచ్చేవాడు. కానీ అవి ఏ మూలకీ వచ్చేవి కావు. దీంతో కోత మిషన్‌ దగ్గర పని చేసేవాడు. ఒకసారి ఓ చెట్టును కొట్టే ప్రయత్నంలో అది ఉన్నట్టుండి కూలింది. కొద్దిలో జోసెఫ్‌ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇంత క్లిష్టమైన వృత్తి ఎందుకు అని బాడీగార్డ్‌ పని ఎంచుకున్నాడు. ఒకవైపు బాడీగార్డ్‌గా పని చేస్తూనే మరోవైపు క్రికెట్‌ ఆడేవాడు. 

అలా మొదలైంది

ఎలాంటి శిక్షణ లేకుండానే వేగంగా బంతులు వేస్తూ వికెట్లు తీస్తున్న షామర్‌పై అందరి దృష్టి పడింది. దీంతో 2023 ఫిబ్రవరిలో గయానా హార్పీ ఈగల్స్‌ జట్టు అతడికి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడే అవకాశాన్ని కల్పించింది. ఈగల్స్‌ తరఫున 3 మ్యాచ్‌ల్లో 9 వికెట్లతో సత్తా చాటాడు. బుల్లెట్‌ బంతులు వేయడంతో పాటు వైవిధ్యమైన బౌలింగ్‌ చేస్తూ వికెట్లు తీసే జోసెఫ్‌కు 2023 కరీబియన్‌ ప్రీమయర్‌ లీగ్‌లో గయానా అమేజాన్‌ వారియర్స్‌ తరఫున పాల్గొనే ఛాన్స్‌ కూడా దక్కింది. ఈ లీగ్‌లోనూ అతడు ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనే అతడికి గతేడాది దక్షిణాఫ్రికా-ఏ పర్యటనలో వెస్టిండీస్‌-ఏ జట్టులో చోటు కల్పించింది. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన అతడికి ఆస్ట్రేలియాలో పర్యటించే వెస్టిండీస్‌ సీనియర్‌ జట్టులో అవకాశం వచ్చింది.

అడిలైడ్‌ టెస్టు ద్వారా తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ఈ పేసర్‌.. తొలి బంతికే స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ వికెట్‌ తీసి అదిరే అరంగేట్రం చేశాడు. అంతేకాదు మరో నాలుగు వికెట్లు కూడా పడగొట్టి తొలి మ్యాచ్‌లోనే అయిదు వికెట్ల ప్రదర్శనతో భళా అనిపించాడు. పేస్‌కు స్వింగ్‌ జత చేసి అతడు వేసిన బుల్లెట్‌ బంతులకు ఆసీస్‌ బ్యాటర్ల నుంచి సమాధానం లేకపోయింది. స్లో ఆఫ్‌ కటర్స్, స్లో బౌన్సర్లతోనూ జోసెఫ్‌ ఆకట్టుకున్నాడు. తొలి టెస్టులో కంగారూలపై జోసెఫ్‌ బౌలింగ్‌ చేసిన తీరు చూస్తే కచ్చితంగా వెస్టిండీస్‌కు ఓ పేస్‌ ఆయుధంగా మారతాడనే సంకేతాలు కనిపించాయి. ఎందుకంటే జోసెఫ్‌లో ఆ తపన ఉంది. పేద కుటుంబానికి చెందిన అతడికి ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చిన పేరు జోసెఫ్‌కి కొత్తగానే ఉంది. కానీ ఈ స్థితికి రావడానికి తానెంత కష్టపడ్డాడో అతడికి తెలుసు. సుదీర్ఘ ఫార్మాట్‌నే ఇష్టపడతానని.. జాతీయ జట్టులో స్థానాన్ని తేలిగ్గా తీసుకోనని చెబుతున్న ఈ కుర్రాడు మున్ముందు ఎలా రాణిస్తాడో చూడాలి.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని