Gambhir - India Head Coach: ఇప్పుడు ‘గంభీర్‌’ వంతు.. షారుక్ ఖాన్ ‘కీ’ ఫ్యాక్టర్!

టాప్‌ ప్లేయర్లు ఉన్న జట్టును నడపాలంటే ఎవరికైనా కత్తిమీద సామే. అభిమానుల నుంచి భారీ అంచనాలు ఉంటాయి. తీవ్ర ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు భారత జట్టు కోసం కొత్త ప్రధాన కోచ్‌ వెతుకులాట కొనసాగుతోంది.

Published : 25 May 2024 15:28 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాన కోచ్‌ పదవి కోసం దరఖాస్తులు ఆహ్వానించినప్పటినుంచి రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌తో బీసీసీఐ సంప్రదింపులు జరిపిందని.. ధోనీకి కూడా సిఫార్సు చేసిందనే వార్తలు వచ్చాయి. వారి మధ్య మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో ఫ్లెమింగ్‌ను ఒప్పించమని ధోనీని కోరినట్లు కథనాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఆసీస్‌ మాజీల గురించి బీసీసీఐ కార్యదర్శి జై షానే స్పష్టంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రధాన కోచ్‌ పదవి రేసులో ఫ్లెమింగ్‌తోపాటు ఎక్కువగా గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) పేరు కూడా వినిపించింది. అయితే, ఇప్పటివరకు గంభీర్‌ను బీసీసీఐ సంప్రదించలేదని తెలుస్తోంది. ఒకవేళ అలాంటి స్టెప్‌ తీసుకుంటే మాత్రం గంభీర్‌ ఆసక్తి చూపిస్తాడనే వాదనా ఉంది. 

‘‘గంభీర్‌కు సవాళ్లను ఎదుర్కోవడం చాలా ఇష్టం. ప్రధాన కోచ్ పదవి ఆఫర్‌ చేస్తే తీసుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయడు’’ అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అతడు కోల్‌కతా మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో భారత ప్రధాన కోచ్‌గా గంభీర్‌ రావాలంటే ఆ ఫ్రాంచైజీ ఓనర్ షారుక్ ఖాన్ ‘ఎక్స్’ ఫ్యాక్టర్‌ అవుతాడని క్రీడా పండితుల విశ్లేషణ. గత సీజన్ల కంటే ఈసారి అద్భుతమైన ప్రదర్శన చేసిన కేకేఆర్ ఫైనల్‌కు చేరుకుంది. మూడోసారి విజేతగా నిలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. దీంతో అతడిని వదులుకోవడానికి షారుక్ ఆసక్తి చూపిస్తాడా? లేకపోతే భారత జట్టు కోసం పంపిస్తాడా? అనేది చూడాలి. ‘‘ఈ విషయంపై షారుక్ ఖాన్ - గంభీర్‌ల మధ్య ప్రైవేటు సంభాషణే కీలకం కానుంది. అప్పుడే ఏదోఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది’’ అనేది క్రికెట్ వర్గాల మాట. మరి రెండు రోజుల్లో ప్రధాన కోచ్ పదవి కోసం అప్లికేషన్ల గడువు ముగియనుంది. దీంతో ఎవరు దరఖాస్తు చేసుకున్నారనే విషయంపై స్పష్టత రానుంది. జూన్ చివరి వరకు రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఉంది. టీ20 ప్రపంచ కప్ వరకు ఉండి.. ఆ తర్వాత వీడ్కోలు చెప్పే అవకాశం ఉంది. కొత్తగా వచ్చే కోచ్ 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఈ బాధ్యతల్లో ఉంటాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని