IND vs AUS: రెండున్నర రోజుల్లోనే ముగింపా..? టెస్టు మ్యాచ్‌ అంటే అలా ఉండాలి: గంభీర్‌

IND vs AUS: భారత్ - ఆసీస్‌ జట్ల మధ్య టెస్టు సిరీస్‌ ఆసక్తిగానే ఉంటున్నప్పటికీ.. కేవలం మూడు రోజుల్లోపే ముగియడం మాత్రం బాగాలేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇలా అయితే పిచ్‌లకు ఐసీసీ రేటింగ్‌ తక్కువగా ఉంటుందనేది వారి వాదన.

Updated : 08 Mar 2023 13:28 IST

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) మూడు టెస్టులు కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. స్పిన్‌ పిచ్‌లతో తొలి రెండు టెస్టుల్లో ఆసీస్‌ను మట్టికరిపించిన టీమ్‌ఇండియా (Team India) .. మూడో మ్యాచ్‌లో మాత్రం ఓటమిని చూసింది. అయితే, నాలుగు టెస్టుల సిరీస్‌లో(IND vs AUS) ఆసీస్‌పై 2-1 ఆధిక్యంలో భారత్‌ కొనసాగుతోంది.  గురువారం నుంచి అహ్మదాబాద్‌ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. మూడో టెస్టు జరిగిన ఇందౌర్ మైదానానికి ఐసీసీ మూడు డీమెరిట్‌ పాయింట్లను కేటాయించింది.  అయితే, టెస్టు మ్యాచ్‌లు కేవలం రెండున్నర రోజుల్లోనే ముగియడంపై మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ కూడా పిచ్‌ పరిస్థితి, టెస్టులు త్వరగా ముగియడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘టర్నింగ్‌ ట్రాక్స్‌ మీద ఆటడం చాలా కష్టమని నాకూ తెలుసు.  కానీ, కేవలం రెండున్నర రోజుల్లోనే టెస్టులు ముగియడం మాత్రం సరైందికాదు. ఎప్పుడైనా సరే పోటాపోటీగా మ్యాచ్‌ల ముగింపు ఉండాలని కోరుకుంటాం. దానికి ఉదాహరణ.. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌నే తీసుకోండి. ఒక్క పరుగు తేడాతో కివీస్‌ విజయం సాధించింది. ఒకవేళ అలా కాకపోయినా.. కనీసం 4వ లేదా 5వ రోజుకైనా మ్యాచ్‌ సాగాలి. అంతేకానీ, కేవలం రెండున్నర రోజుల్లోనే టెస్టు పూర్తి కావడం మాత్రం బాగాలేదు’’ అని చెప్పాడు. 

గతతరం ఆటగాళ్లతో పోలిస్తే ఇప్పటితరం ప్లేయర్లు స్పిన్‌ బౌలింగ్‌ను సరిగ్గా ఆడగలరా..? అనే ప్రశ్నకు  గంభీర్‌ సమాధానం ఇచ్చాడు. ‘‘ఈ విషయంపై కచ్చితంగా మాత్రం చెప్పలేను. పుజారా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చాలా చక్కగా స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోగలరు. విరాట్, పుజారాకు వందకుపైగా టెస్టులు ఆడిన అనుభవం ఉంది. స్పిన్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌ను అద్భుతంగా ఆడితేనే అలాంటి వంద మార్క్‌కు చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పుడు డీఆర్‌ఎస్‌ చాలా కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో డీఆర్‌ఎస్‌ లేకుండా, ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చినా ఎల్బీ కాకుండా ఉండేవారు. కానీ, ఇప్పుడు టెక్నిక్‌ను మార్చుకుంటూ ముందుకు సాగాలి. లేకపోతే త్వరగా ఆటగాడు పెవిలియన్‌కు చేరతాడు. దాని గురించి (డీఆర్‌ఎస్‌ ప్రభావం) మాత్రం అభిమానులు ఎక్కువగా మాట్లాడరు’’ అని గంభీర్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని